లిక్కర్ కేసులో ఆ ముగ్గురికి బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. వీరి అరెస్టు నుంచి ఇప్పటివరకు ఉన్న రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే, ఈ ముగ్గురు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్‌పై ప్రతికూల తీర్పు వచ్చినప్పటికీ, ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసే పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. అయితే, డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఇదే సమయంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు మాత్రం నిరాకరించింది. హైకోర్టు తీర్పును నిలబెట్టినప్పటికీ, నిందితులకు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ తదుపరి చర్యలపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. రెగ్యులర్ బెయిల్ అంశాన్ని ట్రయల్ కోర్టు పరిధిలోనే పరిష్కరించాలని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు లిక్కర్ కేసులో కీలక మలుపుగా మారాయి. ఈ కేసు తదుపరి దశలో ఎలా కొనసాగుతుందనే అంశంపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్.. నో పే విధానం..! స్పీకర్ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రసంగం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల ప్రతినిధులని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వారి ప్రాథమిక బాధ్యత అని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకుని పంపిన ప్రతినిధులు సభకు రాకుండా జీతాలు పొందడం సరికాదన్నారు. శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారానే ప్రజల సమస్యలు చర్చకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు ఈ విషయాన్ని గంభీరంగా పరిగణనలోకి తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు కోరారు. శాసనసభ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు ఇలాంటి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల హాజరు తప్పనిసరిగా ఉండేలా ‘నో వర్క్.. నో పే’ విధానం అమలైతే, శాసనసభ పనితీరు మెరుగుపడుతుందని, ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. కాగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలోనూ ఈ తరహా కామెంట్లు చేసిన విషయం విదితమే..
ఏపీలో మరోసారి భూముల మార్కెట్ విలువ పెంపు..
ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ విలువ మరోసారి పెరిగింది.. సవరించిన భూముల మార్కెట్ విలువలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టింది సర్కార్. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు కావడం గమనార్హం. గత ఏడాది కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం 15 శాతం కంటే ఎక్కువగా పెంచిన విషయం తెలిసిందే.. కాగా, భూముల మార్కెట్ విలువ పెంపుతో ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ.13,150 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూముల మార్కెట్ విలువ పెంపు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో భూముల కొనుగోలు, విక్రయాల సమయంలో ఎక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, భూముల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ఆస్తుల విలువ మరింత పెరుగుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కీలకంగా మారనుందని విశ్లేషిస్తున్నారు.
కోర్టు ఆదేశాలు పాటించని ట్రాఫిక్ పోలీసులు!
హైకోర్టు ఆర్డర్లను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. వాహనదారులపై రెచ్చిపోతున్నారు. ఆటోలు, బైక్స్ కనబడితే ట్యాబ్‌లు తీసి పెండింగ్ చలాన్ల చిట్టా విప్పుతున్నారు. ఒకవైపు హై కోర్టు వాహనదారులను ఆపొద్దంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఒక్కొక్క చౌరస్తాలో పదుల సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు పహరా కాస్తున్నారు. ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళే వారి వాహనాలను ఆపితే త్వరగా వసూళ్లకు అవకాశం ఉంటుందని రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఆపి ఫొటోలు తీస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా ఇంకా తమకు పైఅధికారుల నుంచి ఆదేశాలు అందలేదని సిబ్బంది చెబుతున్నారు. వాహనాలను ఆపి ఫోటోలు తీస్తున్న విజువల్స్ వస్తున్నాయి గమనించగలరు.. ఇదిలా ఉండగా.. పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ నిన్న(మంగళవారం) తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. రహదారులపై తనిఖీలు చేసే సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను బలవంతపెట్టవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వాహనాల కీలను లాక్కోవడం లేదా వాహనాలను అక్కడే ఆపేసి ట్రాఫిక్ నిరోధించడం వంటి చర్యలు చేపట్టకూడదని కోర్టు ఆదేశించింది. పోలీసుల విధులు కేవలం నిబంధనలను పర్యవేక్షించడమేనని, చలాన్ల వసూలు కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. కోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
“వాళ్ళిద్దరూ ఒక్కటే.. కలిసే ఉన్నారు”.. కవిత కీలక వ్యాఖ్యలు..
ట్యాంక్ బండ్ మీద ఇంకా కూడా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆంధ్రా వాళ్ళ విగ్రహాలు తీసేయాలి అనడం లేదు కానీ తెలంగాణ వారి విగ్రహాలు పెట్టాలన్నారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా బీసీ రిజర్వేషన్లు మాట లేదని చెప్పారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా దాట వేస్తున్నారని.. ఇప్పుడు గుంపు మేస్త్రి గుంట నక్కను విచారణకు పిలుస్తున్నారన్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటే.. వాళ్ళు కలిసే ఉన్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయమని యువత, మహిళలు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. అవసరం ఉంటే తాను ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చారు. నిన్న సికింద్రాబాద్ జిల్లా చేయమని కేటీఆర్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. పది ఏళ్ళు ఎందుకు గుర్తు కు రాలేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల టైం లోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారని నిలదీశారు. ఫోన్ టాపింగ్ విచారణ వల్ల నాలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుందని తాను అనుకోవడం లేదన్నారు.
ఉద్దేశపూర్వకంగానే సనాతన ధర్మంపై మాట్లాడారు.. ఉదయనిధి స్టాలిన్‌ను తప్పుపట్టిన కోర్టు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రకటనను ప్రశ్నిస్తూ పటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మంత్రి ఉపయోగించిన భాష జాతి విధ్వంసాన్ని సూచిస్తుందని అభిప్రాయపడింది. ద్వేషపూరిత ప్రసంగానికి సమానమని ధర్మాసనం పేర్కొంది. సనాతన ధర్మ అనుచరులపై జాతి హత్యగా పిలుపునిచ్చినట్లుగా ఉందని కోర్టు తెలిపింది. సనాతన ధర్మాన్ని ఒక మతంగా భావిస్తే.. సనాతన ధర్మం అనుసరించే వ్యక్తులు ఉండకూడదని చెబితే.. అది మతహత్య అవుతుందని.. అంటే మతాన్ని నాశనం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో ఉపయోగించిన పదాలు కచ్చితంగా.. జాతి నిర్మూలన, సాంస్కృతిక విధ్వంసాన్ని సూచిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఉదయనిధి స్టాలిన్ పోస్ట్‌ను విమర్శించినందుకు బీజేపీ నేత అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టేసింది. మంత్రి చేసిన వ్యాఖ్యలకు అమిత్ స్పందించడంలో తప్పు లేదని.. ప్రతి చర్యగా ఆయనపై చర్యలు తీసుకోవడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని పేర్కొంది. ఆయనకు కోలుకోలేని హాని, గాయం కలిగిస్తుందని జస్టిస్ అభిప్రాయపడ్డారు. ఇక ద్వేషపూర్తిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ బుక్ కాకపోవడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి.. కట్‌చేస్తే..
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్టేషన్ రోడ్డులో ఉన్న ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ చేసిన నిర్లక్ష్యం వల్ల, ఓ వ్యక్తి జీవితం గందరగోళంగా మారే పరిస్థితి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. 47 ఏళ్ల పురుషుడికి చేసిన స్కాన్ రిపోర్టులో అతడికి గర్భాశయం ఉందని రిపోర్టులో రాశారు. ఆ గర్భాశయం తలకిందులుగా ఉందని పేర్కొన్నారు. తీరా చూస్తే రిపోర్టులో తప్పుగా రాశారని తేలింది. ఈ సంఘటన జరిగింది సాధారణ వ్యక్తికి కాదు. ఉచెహెరా నగర పంచాయతీ అధ్యక్షుడు నిరంజన్ ప్రజాపతి ఈ తప్పిదానికి బలయ్యారు. కొద్ది రోజులుగా ఆయనకు కడుపునొప్పి, వాపు సమస్యలు మొదలయ్యాయి. మొదట స్థానికంగా చికిత్స తీసుకున్నారు. ఉపశమనం లేకపోవడంతో జనవరి 13న సత్నాలోని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లి స్కాన్ చేయించుకున్నారు. రిపోర్టు చూసిన తర్వాత ఆయనకు ఏం చేయ్యాలో అర్థం కాలేదు. పురుషుడైన తనకు గర్భాశయం ఉందని రాసి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. జబల్‌పూర్‌కు వెళ్లి డాక్టర్‌కు రిపోర్టును చూయించారు. సత్నా రిపోర్టును చూసిన వైద్యుడు ఆశ్చర్యపోయారు. “ఇది మీ రిపోర్టు ఎలా అవుతుంది? పురుషుడికి గర్భాశయం ఉండదు కదా” అని ప్రశ్నించారు. అప్పుడే ఈ పెద్ద తప్పిదం బయటపడింది. దీంతో ఆయన అవాక్కయ్యారు. “ఈ తప్పు రిపోర్టు చూసి డాక్టర్ ఆపరేషన్ చేసుంటే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని బాధితుడు సత్నా వాపోయారు. ఈ ఘటన బయటకు రాగానే ఆరోగ్య శాఖలో కలకలం మొదలైంది. డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడిని సంప్రదించగా, ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు జిల్లా ఆరోగ్య అధికారి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇది చిన్న తప్పు కాదని, రోగుల ప్రాణాలతో ఆడుకునే పని అని స్పష్టం చేశారు. పూర్తి విచారణకు ఆదేశాలు ఇచ్చామని, నిర్లక్ష్యం రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య కేసులో.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేసినట్లు అంగీకరించిన వ్యక్తికి బుధవారం జపాన్ కోర్టు జీవిత ఖైదు విధించిందని NHK పబ్లిక్ టెలివిజన్ తెలిపింది. 45 ఏళ్ల టెట్సుయా యమగామి, జూలై 2022లో పశ్చిమ నగరమైన నారాలో తన ఎన్నికల ప్రచార ప్రసంగంలో అబేను హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. జపాన్‌లో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన అబే, ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టిన తర్వాత సాధారణ శాసనసభ్యుడిగా పనిచేస్తున్నప్పుడు, 2022లో పశ్చిమ నగరమైన నారాలో ప్రచారంలో ఉండగా ఆయన హత్యకు గురయ్యారు. అక్టోబర్‌లో ప్రారంభమైన విచారణలో 45 ఏళ్ల టెట్సుయా యమగామి హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. ప్రాసిక్యూటర్ల వాదనలు విన్న నారా జిల్లా కోర్టు యమగామికి జీవిత ఖైదు విధించింది. యూనిఫికేషన్ చర్చికి అనుబంధంగా ఉన్న ఒక బృందానికి మాజీ నాయకుడు పంపిన వీడియో సందేశాన్ని చూసిన తర్వాత తాను అబేను చంపానని యమగామి చెప్పాడు. తాను ద్వేషించే చర్చిని దెబ్బతీయడం, అబేతో దాని సంబంధాలను బహిర్గతం చేయడమే తన లక్ష్యమని తెలిపాడు. యమగామికి జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేయగా, చర్చి అనుచరుల బిడ్డగా అతను ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొంటూ అతని న్యాయవాదులు 20 సంవత్సరాలకు మించకుండా జైలు శిక్ష విధించాలని కోరారు. జపనీస్ చట్టం హత్య కేసుల్లో మరణశిక్షను అమలు చేస్తుంది, కానీ కనీసం ఇద్దరు వ్యక్తులు చంపబడితే తప్ప ప్రాసిక్యూటర్లు సాధారణంగా దానిని అభ్యర్థించరు. పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి, చర్చికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు బయటపడటంతో ఆ పార్టీ చర్చి నుండి వైదొలిగింది. దీని ఫలితంగా చర్చ్ జపనీస్ శాఖకు పన్ను మినహాయింపు ఉన్న మతపరమైన హోదాను తొలగించి, దానిని రద్దు చేయాలని ఆదేశించడంతో దర్యాప్తులు ముగిశాయి.
Vivo X200T లాంచ్ తేదీ ఖరారు.. 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్స్..
వివో భారత మార్కెట్లో మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. Vivo X200T పేరుతో ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ జనవరి 27న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇంతకుముందే వివో భారత్‌లో Vivo X200 మరియు Vivo X200 Pro మోడళ్లను విడుదల చేసింది. అనంతరం తక్కువ ధరలో Vivo X200 FEను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే సిరీస్‌లో భాగంగా Vivo X200Tను తీసుకురానుంది. Vivo X200Tలో జైస్ (ZEISS) భాగస్వామ్యంతో రూపొందించిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కెమెరా సెటప్ ఫోటోగ్రఫీ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉండనుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్‌కు శక్తినిచ్చే హృదయంగా MediaTek Dimensity 9400+ ప్రాసెసర్ పనిచేయనుంది. ఇది హై-పెర్ఫార్మెన్స్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. Vivo X200Tలో 6200mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
సరికొత్త వాషింగ్ మెషిన్.. నీరు, డిటర్జెంట్ లేకుండానే బట్టలు ఉతికేస్తుంది..!
టెక్నాలజీ మారుతుంది.. గతంలో వాడిని ఏ వస్తువుకు అయినా.. మరింత టెక్నాలజీ జోడించి అత్యాధునికంగా మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు.. ఇక, గృహోపకరణాల రంగంలో ప్రముఖ సంస్థ వర్ల్‌పూల్ భారత మార్కెట్లో వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త వాషింగ్ మెషిన్‌ను విడుదల చేసింది. Whirlpool Expert Care Front Load Automatic Washing Machine పేరుతో ఈ సరికొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి.. ఇందులోని ప్రత్యేకత ఏంటి? అంటారా.. దీని ప్రత్యేక ఏంటంటే.. నీరు లేదా డిటర్జెంట్ ఉపయోగించకుండానే బట్టలను శుభ్రం చేయడం దీని స్పెషాలిటీ.. ఈ వాషింగ్ మెషిన్‌లో Ozone Fresh Air Technologyను అమర్చారు. తక్కువసేపు మాత్రమే ధరించిన బట్టలను ప్రతిసారి పూర్తిగా ఉతకాల్సిన అవసరం లేదని వర్ల్‌పూల్ పేర్కొంది. ఇలాంటి బట్టలను నీరు అవసరం లేకుండానే తాజాగా మార్చేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? అనే విషయాల్లోకి వెళ్తే.. వర్ల్‌పూల్ ఎక్స్‌పర్ట్ కేర్ వాషింగ్ మెషిన్‌లో అంతర్గతంగా ఓజోనైజర్ ఉంటుంది. ఇది ఆక్సిజన్‌ను ఓజోన్‌గా మార్చి డ్రమ్‌లోకి విడుదల చేస్తుంది. ఈ ఓజోన్ బట్టలపై ఉన్న దుర్వాసనలను తొలగించి.. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీంతో బట్టలు తాజాగా మారుతాయి. ముఖ్యంగా డ్రై-క్లీన్ ఫాబ్రిక్స్‌పై ఈ టెక్నాలజీని పరీక్షించగా, రంగు మారడం లేదా కుంచించుకుపోవడం జరగలేదని కంపెనీ స్పష్టం చేసింది. బట్టలను యంత్రం నుంచి తీసిన వెంటనే ధరించవచ్చని వర్ల్‌పూల్ పేర్కొంది.
బంగ్లాదేశ్ బాటలో పాకిస్థాన్..?.. టీ20 వరల్డ్ కప్ బహిష్కరణపై క్లారిటీ ఇచ్చిన పీసీబీ..
బంగ్లాదేశ్ తరహాలో పాకిస్థాన్ కూడా 2026 టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించాలా? అనే అంశంపై ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టతనిచ్చింది. టోర్నమెంట్ నుంచి వైదొలగే ఆలోచన తమకు లేదని పీసీబీ ఖరాఖండిగా ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నమెంట్‌ను బహిష్కరిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను పీసీబీ వర్గాలు తోసిపుచ్చాయి. మీడియా కథనాల ప్రకారం, బంగ్లాదేశ్ దౌత్యపరమైన మరియు క్రికెట్ పరమైన మద్దతు కోసం పాకిస్థాన్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అయినప్పటికీ, పాకిస్థాన్ మ్యాచ్‌లు పూర్తిగా శ్రీలంకలోనే షెడ్యూల్ కావడంతో, టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని పీసీబీ స్పష్టం చేసింది.
అజిత్ ‘గ్యాంబ్లర్’ రీ-రిలీజ్ బుకింగ్స్ చూస్తే మతిపోవాల్సిందే!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ‘గ్యాంబ్లర్’ ఒకటి. 2011లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. అజిత్ 50వ సినిమాగా వచ్చిన ఈ మూవీ, ఆయనకు ఒక కొత్త ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో అజిత్ పోషించిన నెగిటివ్ షేడ్స్ ఉన్న ‘వినాయక్ మహదేవ్’ పాత్ర, ఆయన సిగ్నేచర్ ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ మళ్ళీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇక సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని జనవరి 23, 2026న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, కేవలం కొన్ని గంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికే 21.24K (21 వేలకి పైగా) టికెట్లు అమ్ముడవగా, దాదాపు 86 లక్షల గ్రాస్ వసూళ్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రావడం విశేషం. అజిత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి ఈ నంబర్లే నిదర్శనం.ఇంకో విషయం ఏంటంటే.. అదే రోజు దళపతి విజయ్ నటించిన మాస్ హి హిట్ మూవీ ‘తేరి’ (Theri) కూడా రీ-రిలీజ్ అవుతుంది. చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు మళ్ళీ తలపడుతుండటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ పీక్స్‌కు చేరుకున్నాయి.
నిఖిల్ భారీ పీరియాడిక్ మూవీ ‘స్వయంభు’ వాయిదా?
నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ ఒక పవర్‌ఫుల్ వారియర్ పాత్రలో కనిపిస్తుండగా, ఆయన సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 13న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న టైమ్‌కి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న దర్శకుడు భరత్ కృష్ణమాచారి, కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అందుకే ఫిబ్రవరి రిలీజ్ నుండి ఈ సినిమాను వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? ఫిబ్రవరిలో మిస్ అయితే, ఈ సినిమాను సమ్మర్ కానుకగా మార్చి చివరలో లేదా ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ వాయిదా నిజమైతే, త్వరలోనే కొత్త డేట్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
