హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాం..
ISB లీడర్‌షిప్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గచ్చిబౌలి లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ లో లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తన ఆలోచన అన్నారు. ISB లీడర్‌షిప్ సమ్మిట్‌లో మీ అందరిని కలిసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఐఎస్ బీ ఈ యేడాది ఎంచుకున్న లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా థీమ్ పైన తన ఆలోచనలను మీతో పంచుకుంటానని అన్నారు. ఐఎస్ బిలో చదువుకుంటున్న మీరంతా యువకులు, తెలివైనవారు, అసాధారణ విద్యార్థులు అని తెలిపారు. నా జీవితం, రాజకీయాల నుంచి నేను నాయకత్వం గురించి నేర్చుకున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉందని సీఎం తెలిపారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పి వి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులే దీనికి ఉదాహరణగా వ్యాఖ్యానించారు. ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యమన్నారు. తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరమని అన్నారు. గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేమని తెలిపారు. గొప్ప నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మన పోరాటంలో మనం చాలా కోల్పోవచ్చని అన్నారు. దేశంలోని గొప్ప నాయకులు, మన కాంగ్రెస్ నాయకులు, ప్రజల కోసం తమ వృత్తిని, డబ్బును, సుఖాలను, స్వేచ్ఛతో పాటు వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారని గుర్తు చేశారు. మీరు మంచి నాయకుడిగా ఎదగాలంటే, ముందుగా ధైర్యం , త్యాగం అనే రెండు విలువల గురించి ఆలోచించాలని సూచించారు. మీకు ధైర్యం ఉంటే, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు విజయం సాధిస్తారని అన్నారు. ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు పెట్టుకోవాలని.. పేదలు, ధనికులు ,చిన్నా, పెద్దా అన్న భేదం లేకుండా సమాన గౌరవం ఇస్తు స్నేహ భావంతో అందరిని కలుపుకుపోవాలన్నారు. ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకుంటే మీరు ఏదైనా సాధించగలరని అన్నారు. ISB విద్యార్థులుగా మీరు హైదరాబాద్, తెలంగాణ తో పాటు న్యూ ఇండియా కు బ్రాండ్ అంబాసిడర్‌లు అన్నారు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జిడిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే మాలక్ష్యం అని తెలిపారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలన్నారు. తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి నాకు మీ సాయం కావాలన్నారు. మీరు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు , సామాన్య ప్రజలతో తెలంగాణ ,హైదరాబాద్ గురించి మాట్లాడండి అని తెలిపారు. భారతదేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని నేను కోరుకోవడం లేదన్నారు. న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో , సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని కోరుకుంటున్నానని సీఎం అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం, హైదరాబాద్ అత్యుత్తమంగా మారాలన్నది పెద్ద లక్ష్యం. కాని అసాధ్యం కాదన్నారు. మా ప్రభుత్వంతో మీరు రెండు మూడేళ్లు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను .మీకు పెద్ద జీతాలు ఇవ్వలేకపోయినా మంచి అవకాశాలు, పెద్ద సవాళ్ళను ఇస్తా అన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గచ్చిబౌలి లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని శుభవార్త చెప్పారు సీఎం. తాను (రేవంత్) సౌత్ కొరియా లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ని సందర్శించానని గుర్తుచేశారు. సౌత్ కొరియా లాంటి చిన్న దేశం ఒలింపిక్స్ లో అనేక పథకాలు సాధించిందన్నారు. మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క బంగారు పథకం కూడా సాధించలేకపోయిందన్నారు. నా లక్ష్యం ఒలింపిక్స్ మనం పథకాలు సాధించడం అన్నారు. హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే నా ఆలోచన అన్నారు.
హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు..
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేశామన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి తెలంగాణకు రైల్వేల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. నూతన రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఇప్పటికే హైదారాబాద్ లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగుడతోపాటు అదనంగా చర్లపల్లిని నాలుగో నూతన రైల్వే స్టేషన్ గా రాబోతుందని తెలిపారు. దీనికారంగా హైదారాబాద్ లో ట్రాఫిక్ తగ్గుతుందని తెలిపారు. ప్రధాని నేతృత్వంలో ఈ రైల్వే స్టేషన్ ను తక్కువ సమయంలో నిర్మించామని తెలిపారు. ఇప్పటికే 98 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ను 430 కోట్ల రూపాయాలు ఖర్చు చేసి నిర్మించామన్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు కొత్త టెక్నాలజీతో అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. దివ్యాంగులకు, వృద్దులకు మెట్లు ఎక్కడానికి ఎస్కలెటర్లు, లిఫ్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. భరత్ నగర్, మహాలక్ష్మీ నగర్ వైపున 80 అడుగుల మేర రోడ్లు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం మాష్టర్ ప్లాన్ తయారు చేసిందని, వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడనుండి రోడ్లు కనెక్టివిటీ ఉంటేనే ఉపయోగం ఉంటుందన్నారు. తెలంగాణలో రైల్వే ప్రమాదాలు జగకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్రమోడీ రైల్వే కవచ్ వ్యవస్థను తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని తెలిపారు. ఇందుకోసం ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వందేభారత్ రైళ్లు డిల్లీ తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. త్వరలో వందే భారత్ ట్రెయిన్ లలో స్లీపర్ కోచ్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో అమృత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను, 429 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను, 430 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 521 కోట్లతో రైల్ మ్యానుఫాక్చర్ యూనిట్ ను ప్రారంభించామన్నారు. 346 కిలోమీటరు మేరకు తెలంగాణలో రైల్వే లైన్లు నిర్ణయించామన్నారు. 369 కిలోమీటర్ల మేర సింగిల్, డబుల్ లైన్లను నిర్ణయించామన్నారు. త్వరలోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి నోటీసులు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి తిరుమల పోటీసులు జారీ చేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇటీవల తిరుమల కొండపై రీల్స్ చేసిన వివాదంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. తిరుమల మాఢ వీధుల్లో పబ్లి్క్ న్యూసెన్స్ చేశారని వారిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. దివ్వల మాధురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వారిద్దరు కలిసి మాఢ వీధుల్లో హల్‌చల్ చేశారు. ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని.. కోర్టుల్లో కేసులు కొలిక్కివచ్చాక పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు. అయితే తిరుమలలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. దివ్వల మాధురిపై కేసు నమోదైంది. అయితే తిరుమలలో తాము రీల్స్ చేశామనే ఆరోపణల్లో నిజం లేదని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అయినప్పటికీ టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణలో భాగంగా నోటీసులు జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 21, 22 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల్లో రెండేసి వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే అల్పపీడన ప్రాంతం నుంచి ఎగువ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర కోస్తా వరకు ద్రోణి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వర్షాల కారణంగా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలి. వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కశ్మీర్‌లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్.. 2000 మందికి పైగా రన్నర్లు
ఈరోజు (ఆదివారం) ఉదయం శ్రీనగర్‌లోని పోలో స్టేడియం నుంచి కాశ్మీర్ తొలి అంతర్జాతీయ మారథాన్‌ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు సునీల్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు. లోయ చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్‌లో 59 మంది విదేశీయులు, బాలీవుడ్ ప్రముఖులతో సహా రెండు వేల మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌లో రూ.3 కోట్ల విలువైన బహుమతులు ఉంటాయి. దీనిని పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. సునీల్ శెట్టితో కలిసి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మారథాన్‌ను ప్రారంభించారు. టూరిజం శాఖ డైరెక్టర్ కశ్మీర్ రాజా యాకూబ్ మాట్లాడుతూ.. లోయలో పరిస్థితి మారిందని ప్రపంచానికి చాటిచెప్పడమే మారథాన్ ఉద్దేశమన్నారు. అదే కాశ్మీర్ అని మేము చెప్పాలనుకుంటున్నాము. ఇక్కడ ప్రజలు పగటిపూట కూడా తమ ఇళ్లలో దాక్కోరు. కానీ, ఇప్పుడు ప్రజలు పర్యాటక ప్రదేశాలు, రోడ్లు, పార్కులలో అర్థరాత్రి వరకు షికారు చేస్తూనే ఉన్నారు. మేము ప్రపంచం నలుమూలల నుండి అత్యుత్తమ క్రీడాకారులను ఆహ్వానించాము. దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు.. జర్మనీ, ఇంగ్లాండ్, స్వీడన్, ఆఫ్రికా ఇలా ఇంకా 13 ఇతర దేశాల నుండి రన్నర్లు వచ్చారు. రిజిస్ట్రేషన్‌లో స్థానికులు కూడా పాల్గొంటున్నారు. మారథాన్ ద్వారా కాశ్మీర్ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను కూడా తెలియచేయనున్నారు. సునీల్ శెట్టి సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శ్రీనగర్ చేరుకున్నారు. 42 మంది ఏస్ రన్నర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ సునీత మాట్లాడుతూ.. ఈ బృందంలో అనేక మంది ఆసియా బంగారు పతక విజేతలు, ఇంకా.. హాఫ్, ఫుల్ మారథాన్ పోడియం ఫినిషర్లు గోపి డి, మాన్ సింగ్, అంకిత్ దేస్వాల్, నవప్రీత్, పూనమ్, ప్రజాత్గా గాడ్‌బోలే, తొమ్మిది సార్లు టాటా మారథాన్ ముంబై విజేతలు ఉన్నారు. జ్యోతి కార్తీక్, నేషనల్ ఛాంపియన్ అశ్వని పాల్గొంటున్నారు. భూమ్మీద స్వర్గంగా పిలుచుకునే లోయలోని రోడ్లపై పరుగెత్తే అవకాశం వచ్చిందని, అంతేకాకుండా లోయలో తొలిసారిగా ఇలాంటి మారథాన్‌లో భాగమైన ఘనత తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు.
నెతన్యాహు నివాసంపై దాడి తర్వాత గాజాలో విధ్వంసం.. వైమానిక దాడిలో 73 మంది మృతి
ఇజ్రాయెల్‌లోని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసాన్ని శనివారం డ్రోన్ లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇజ్రాయెల్ కనీసం మూడు వైమానిక దాడులను బీరుట్ దక్షిణ శివారు ప్రాంతమైన దహియేలో నిర్వహించింది. ఇక్కడ హిజ్బుల్లా కార్యాలయాలు ఉన్నాయి. గాజాలోని ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనా భూభాగం ఉత్తర భాగంలోని ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో 24 గంటలలోపు పిల్లలతో సహా 73 మందికి పైగా మరణించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. లెబనాన్‌లోని హిజ్బుల్లాతో గాజాలోని హమాస్‌తో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం గత ఏడాది అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడికి సూత్రధారి హతమైన తర్వాత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. లెబనాన్ నుండి రాకెట్ కాల్పుల దృష్ట్యా, శనివారం ఇజ్రాయెల్‌లో సైరన్‌లు మోగించాయని, దీనితో పాటు, సాయిస్రియాలోని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసం వైపు డ్రోన్ దాడి జరిగిందని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. దాడి జరిగినప్పుడు నెతన్యాహు గానీ, ఆయన భార్య గానీ ప్రధాని నివాసంలో లేరని ప్రధాని అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రోన్ దాడికి హిజ్బుల్లా బాధ్యత వహించనప్పటికీ, ఉత్తర.. మధ్య ఇజ్రాయెల్‌పై అనేక రాకెట్ దాడులను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఇరాన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందించనుందని భావిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. లెబనాన్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ఇస్తుంది. మరిన్ని గైడెడ్ క్షిపణులు, పేలుడు డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ద్వారా పోరాటంలో కొత్త దశను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు హిజ్బుల్లా శుక్రవారం తెలిపారు. వాస్తవానికి, సెప్టెంబర్ చివరలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో హిజ్బుల్లా ముఖ్య నాయకుడు హసన్ నస్రల్లా మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ తన సైన్యాన్ని అక్టోబర్ ప్రారంభంలో లెబనాన్‌కు పంపింది. మరోవైపు గాజాలో కూడా హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైనికులు గురువారం హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చారు, ఆ తర్వాత ఇద్దరి మధ్య యుద్ధం ఆగిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సిన్వార్ మరణం తీరని లోటని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ శుక్రవారం అన్నారు. సిన్వార్ కంటే ముందే చాలా మంది పాలస్తీనా నాయకులను చంపినప్పటికీ, హమాస్ తన ప్రచారాన్ని కొనసాగిస్తోందని ఆయన అన్నారు. హమాస్ సజీవంగా ఉందని, సజీవంగా ఉంటుందని ఆయన చెప్పారు.
కరుణించని వరణుడు.. టీమిండియా ఓటమి
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో వర్షం అంతరాయం కలిగించిన భారత్‌తో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలిరోజు వర్షం కారణంగా రద్దయిన తర్వాత ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదిరిపోయే ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్‌లో ఐదో, చివరి రోజైన ఆదివారం కివీస్ జట్టు విజయానికి 107 పరుగులు చేయాల్సి ఉండగా రెండు వికెట్లు కోల్పోయి 8 వికెట్లతో విజయం సాధించింది. మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 46 పరుగులకే ఆలౌట్ చేసింది. దీని తర్వాత బ్యాట్టింగ్ కు వచ్చిన రచిన్ రవీంద్ర 134 పరుగులు, డెవాన్ కాన్వే 91 పరుగుల సాయంతో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ (150) తొలి టెస్టు సెంచరీ, రిషబ్ పంత్ 99 పరుగుల సాయంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు పరిమతమైంది. దింతో న్యూజిలాండ్‌కు 107 పరుగుల సులభమైన లక్ష్యాన్ని అందించింది. బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ నాలుగో రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆట ముగిసింది. ఐదో రోజు కూడా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. రోజు తొలి బంతికే కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను ఎల్‌బీడబ్ల్యూ ద్వారా జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ కు చేర్చాడు. అయితే, కాన్వే – విల్ యంగ్ తమ టీమ్‌ను కాపాడే ప్రయత్నం చేసారు. భారత బౌలర్లు వీరిద్దరినీ ఇబ్బంది పెట్టినా వికెట్ పడకుండా కొద్దీ సేపు పోరాడారు. వీరిద్దరి మధ్య కేవలం 35 పరుగుల భాగస్వామ్యం కివీ జట్టును మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత కాన్వేను ఔట్ చేయడం ద్వారా బుమ్రా మళ్లీ భారత్ ఆశలను పెంచాడు. ఆ తర్వాత యంగ్ మళ్లీ రవీంద్ర మద్దతును తీసుకోని మరో వికెట్ కోల్పోకుండా భారత్ కు ఓటమిని కట్టబెట్టారు. రవీంద్ర 39 పరుగులతో నాటౌట్‌గా, విల్ యంగ్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 36 ఏళ్ల తర్వాత భారత్‌లో న్యూజిలాండ్‌కి ఇదే తొలి టెస్టు విజయం. అంతకుముందు, కివీ జట్టు 1988-89లో ఆడిన సిరీస్‌లో స్వదేశంలో జరిగిన టెస్టులో భారత్‌ను ఓడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య మరో రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పక గెలవాలి. ఎందుకంటే, అప్పుడే సిరీస్ కైవసం చేసుకోవచ్చు. రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి పుణెలో, మూడో టెస్టు నవంబర్ 1 నుంచి వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానుంది.
కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం
కన్నడ సినీ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కిచ్చా సుదీప్ తల్లి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈరోజు (అక్టోబర్ 20) ఆమె ఈ ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. తన తల్లి అకాల మరణంతో నటుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కిచ్చా సుదీప్ తల్లి వయస్సు 83 సంవత్సరాలు. వయసు పెరగడం వల్ల కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. నటుడి తల్లికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని, దాని కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారని సమాచారం. అయితే వైద్యసేవలు అందిన కోలుకోలేక మరణించారు. అందిన సమాచారం ప్రకారం, నటుడి తల్లి మృతదేహాన్ని అక్టోబర్ 20, 2024న ఆసుపత్రి నుండి ఆమె మృతదేహాన్ని JP నగర్ ఇంటికి తీసుకురానున్నారు. తన తల్లి చివరి వీడ్కోలు కోసం నటుడి ఇంట్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు నివాళులర్పిస్తారు. దీని తరువాత, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విల్సన్ గార్డెన్ శ్మశానవాటికలో నటుడి తల్లి అంత్యక్రియలు నిర్వహించబడతాయి.