NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజీ భరత్.. స్పెషల్‌ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు టీజీ భరత్.. మొదట సచివాలయంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు అధికారులు.. 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ స్పెషల్‌ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్‌లో ఉందని పేర్కొన్నారు.. అయితే, స్పెషల్‌ స్టేటస్ కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు, నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.. రాష్ట్రంలో పరిశ్రమలు, అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. ఇక, గుజరాత్ ను రోల్ మోడల్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు మంత్రి టీజీ భరత్‌.. గతంలో లా మాయా బజార్ సమాచారం ఉండదన్న ఆయన.. రాయితీలు అందక పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అయితే, పరిశ్రమలకు అందాల్సిన రాయితీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాను అన్నారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానన్న ఆయన.. ఒక్క ప్రాంతం అభివృద్ధిమాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాం అన్నారు. స్నేహ పూర్వక వాతావరణంలో అద్భుతాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నామని వెల్లడించారు. మరోవైపు.. మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్కకు వెళ్లి పోయాయి.. 2019 నుండి 2024 వరకు పెట్టుబడులు ప్రకటనల వరకే పరిమితం అయ్యాయని దుయ్యబట్టారు.. అలా ఎందుకు జరిగిందో కూడా చూడాలన్నారు మంత్రి టీజీ భరత్‌.

పేరు మారింది.. ఇక, ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి
కాపు ఉద్యమ నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీడర్‌ ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది.. అధికారికంగా ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చారు.. ముద్రగడ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్‌ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే.. తన పేరు మార్చుకుంటాను అంటూ ముద్రగడ సవాల్‌ చేసిన విషయం విదితమే.. అంతే కాదు, ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఛాలెంజ్‌కు కట్టుబడి ఉంటానని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు ముద్రగడ.. అయితే, పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు.. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది.. ఆయన పేరును మారుస్తూ.. నామకరణ మహోత్సవాలు కూడా నిర్వహించారు. దాంతో.. మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ పద్మనాభం.. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక, ముద్రగడ పద్మనాభం పేరును మారుస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం.. ముద్రగడ పద్మనాభం పేరును ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఉత్తర్వులు వచ్చాయి..

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మల.. పోలవరంపై సంచలన వ్యాఖ్యలు
ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు.. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. పోలవరం నుండి ఎత్తి పోతల వరకు ప్రతి ప్రాజెక్ట్స్ ను ప్రాధాన్యత క్రమంలో నిర్మాణాలు పూర్తి చేస్తాం అన్నారు. ఇరిగేషన్ నిధులు దారి మళ్లించి వైసీపీ నాయకుల జేబుల్లోకి మల్లించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీఎంగా పరిపాలన తెలిసిన నాయకుడు ఉన్నారు.. సోమవారాన్ని.. పోలవారంగా మార్చుకున్న ఘనత సీఎం చంద్రబాబుది అని గుర్తుచేశారు. గత పాలకులు పోలవరాన్ని అడ్డుకుని మూలన పెట్టారు.. జగన్ విధ్వంసానికి పోలవరం ఒక సాక్షిగా ఉందన్నారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్‌ పేరు తో పోలవరాన్ని అడ్డుకున్నారు.. ఏజెన్సీలను మార్చేశారు.. అధికారులను బదిలీ చేసశారు.. జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా ప్రభుత్వంలో మార్పు రాలేదు అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతిందని విమర్శించారు మంత్రి నిమ్మల.. 2020లో వచ్చిన వరదలు పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతింది .. ఈ విషయాన్ని నీతి అయోగ్ స్పష్టం చేసిందన్న ఆయన. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు హయంలో పోలవరాన్ని పునర్నిర్మిస్తాం అని ప్రకటించారు. నాకు మంత్రి అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు , లోకేష్ కు ధన్యవాదాలు చెబుతున్నారు.. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనలో మా ప్రభుత్వం ఉందన్నారు. ఇక, గత ప్రభుత్వం వ్యవసాయం పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది… ఐదేళ్ల జగన్ పాలన లో లాకులకు, గేట్లకు మరమత్తులు చేయలేదు.. కనీసం గ్రీజు కూడా పెట్టలేదు.. వ్యవసాయ సీజన్ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన గేట్ల మరమత్తులు చేపిస్తాం అని స్పష్టం చేశారు.

మహిళలకు ఫ్రీ బస్సుపై మంత్రి సమీక్ష.. ఎప్పటినుంచంటే..?
మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసుపై మా హామీ నిలబెట్టుకుంటాం అన్నారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. ఈ రోజు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండులో సౌకర్యాలు పరిశీలించిన ఆయన.. మహిళలకు ఫ్రీ బస్సు అమలు విషయంపై సమీక్షించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలపై చర్చించి ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి చేస్తాం అన్నారు. మెరుగైన బస్సులు సంస్ధకు అందించడానికి పని చేస్తాం.. ప్రైవేటు, ప్రభుత్వ సంస్ధల సమన్వయంగా ఆర్టీసీని నడిపించేందుకు పని చేస్తామని వెల్లడించారు.. మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసు మా హామీ.. దానిని అమలు చేస్తాం అన్నారు. ఇక, మంత్రిగా మొదటగా పండిట్ నెహ్రూ బస్టాండును పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు రాంప్రసాద్‌రెడ్డి.. ఎందరో ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత నా పైన ఉంది.. కానీ, ఏపీఎస్ఆర్డీసీ ఒక హాఫ్ బాయిల్డ్ లాగా తయారైంది.. కొత్త బస్సులు కొంటాం.. కచ్చితంగా బస్సులు ఉంటేనే సంస్ధ నడుస్తుందన్నారు. మహిళలకు ఫ్రీ సర్వీసు అంటూ ఏదో ఒక బస్సులో సర్వీసు కాకుండా అన్ని మంచి బస్సులే ఇస్తాం అన్నారు. పాత బస్సులు ఉన్న మాట వాస్తవం.. దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటాం అన్నారు. ఉద్యోగులకు జీతం, ఉద్యోగం ఏపీ ప్రభుత్వం అనే ఒకే గొడుగు కిందకు తెచ్చి పూర్తి విలీనం చేస్తాం అన్నారు. గత ప్రభుత్వాలపై మేం నిందలేస్తూ కూర్చోం… గత ప్రభుత్వం విలీనం సరిగా చేయలేదని విమర్శించారు. టీడీపీకి అధికారం రావడానికి కారణం ఈ రాష్ట్రంలోని మహిళా మూర్తులు.. మా ప్రభుత్వంలో కార్యక్రమాలు లేటుగా అయినా లేటెస్టుగా చేస్తాం అన్నారు.

బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీనివాస్‌.. చిన్న పరిశ్రమలకు రాయితీలు
చిన్న పరిశ్రమలకు రాయితీలు అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌.. ఈ రోజు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను అన్నారు.. ఏంఎస్ఏంఈ, సెర్ఫ్, ఎన్నారై విభాగం ఈ మూడు విభాగాలు అనుసంధానం చేసి ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారన్నారు.. చిన్న పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. నూతన పారిశ్రామిక వేత్తలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తాం… స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.. గత ప్రభుత్వం లో చిన్న పరిశ్రమల కు ఎదురైనా సమస్యలు పరిష్కరిస్తాం.. రాయితీలు అందజేస్తామని పేర్కొన్నారు చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌.

వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..
వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఎండలు ఉంటాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. రాష్ట్రంలో తీవ్రమైన ఉక్కపోత.. వేడిమి వాతావరణం ఉంటుందని తెలిపింది. వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినా ఒక్క చోటే కురవడం మరో చోట వర్షం కురవకపోవడం ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బుదులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురుస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు వరిసాగు చేశారు. కానీ వర్షం కురిస్తేనే మొక్కలు నాటే అవకాశం ఉంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు ఇండో-జర్మన్ నిపుణులు కూడా తెలంగాణ వాతావరణాన్ని పరిశోధించారు. వారి అంచనా ప్రకారం తెలంగాణలో జూన్ 21, 22 తేదీల్లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించగా.. జూన్ 21న తూర్పు తెలంగాణ, 22న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు ప్రకటించారు.

నేటి నుంచి గ్రూప్‌ 4 ధ్రువీకరణ పత్రాల పరిశీలన.. ఎప్పటి వరకు అంటే..
తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టులకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన నేటి నుండి అంటే జూన్ 20 నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ దాదాపు రెండు నెలలు పడుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన ఆగస్టు 21న ముగుస్తుంది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్, టీజీపీఎస్సీ కార్యాలయం, నాంపల్లిలో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్ష జరుగుతుంది. ఏ కారణం చేతనైనా గైర్హాజరైన, ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వని వారికి ఆగస్టు 24, 27, 31 తేదీలను రిజర్వ్‌డ్ డేలుగా టీజీపీఎస్సీ ప్రకటించింది. ఆగస్టు 31 సాయంత్రం 5 గంటల తర్వాత వెరిఫికేషన్‌కు అనుమతించబోమని టీజీపీఎస్సీ సెక్రటరీ డాక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.

బీహార్ సీఎంకు షాక్.. ఆ చట్టాన్ని రద్దు చేసిన పాట్నా హైకోర్ట్..
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాట్నా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా ఓబీసీ, ఈబీసీ, దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచింది. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన వారికి (అగ్ర కులాలు) 10 శాతం రిజర్వేషన్‌తో సహా, బీహార్‌లో ఉద్యోగ, ప్రవేశ కోటా 75 శాతానికి పెరిగింది. ఈ విషయంపై యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థ దీనిని పాట్నా హైకోర్టులో సవాలు చేసింది. అదే అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ రిజర్వేషన్లను పెంచే ఈ చట్టాన్ని రద్దు చేసింది. ఇక, బీహార్ పోస్టులు సేవల (సవరణ) చట్టం 2023, బీహార్ రిజర్వేషన్ (విద్యా సంస్థలలో ప్రవేశాలలో) (సవరణ) చట్టం 2023 రెండు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వం యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తుంది అని తెలిపింది.

సంతోషించేలోపే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. జీవనస్థాయి గరిష్ఠానికి చేరిన పసిడి రేట్స్.. కాస్త దిగొస్తున్నాయని సంతోషించేలోపే షాక్ తగిలింది. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరిగింది. గురువారం (జూన్ 20) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1,500 పెరిగి.. రూ.92,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,500 ఉండగా.. ముంబైలో కూడా రూ.92,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.97,100లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.90,900గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.97,100లుగా ఉంది.

చెలరేగిన సాల్ట్, బెయిర్‌స్టో.. సూపర్-8లో విండీస్‌ను చిత్తుచేసిన ఇంగ్లండ్!
అష్టకష్టాలు పడి సూపర్‌-8కి చేరిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్.. కీలక సూపర్-8లో జూలువిదిల్చింది. సూపర్-8 తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 17.3 ఓవర్లలోనే రెండు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఫిలిప్ సాల్ట్ (87 నాటౌట్: 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (48 నాటౌట్: 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరాజయంతో లీగ్‌ స్టేజ్‌లో ఎదురులేకుండా హవా కొనసాగించిన విండీస్‌కు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. విండీస్‌కు మంచి ఆరంభమే దక్కింది. బ్రాండన్ కింగ్ (23), జాన్సన్ ఛార్లెస్ (38) శుభారంభం ఇచ్చారు. కింగ్ రిటైర్డ్ హర్ట్ అయ్యాక విండీస్ వేగంగా పరుగులు చేయలేకపాయింది. ఛార్లెస్, నికోలస్ పూరన్ (36) నెమ్మదిగా ఆడారు. రోవ్‌మన్ పావెల్ (36), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (28) ధాటిగా ఆడడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, అదిల్ రషీద్, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోమ్ తలో వికెట్ తీశారు.

ప్రభాస్ కల్కి నుంచి రాబోతున్న మరో పవర్ ప్యాక్డ్ ట్రైలర్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినిదత్ ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వుంది.రీసెంట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ ట్రైలర్ సినిమాపై భారిగా అంచనాలు పెంచేసింది.తాజాగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబై లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ,ప్రభాస్ ,దీపికా పదుకోన్ ,అశ్వినిదత్ ,నాగ్ అశ్విన్ వంటి తదితరులు హాజరయ్యారు.అలాగే దగ్గుబాటి రానా ఈ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించారు.ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వారు రానాతో షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్యింగ్ వైరల్ అవుతుంది.ఈ సినిమా రిలీజ్ కు ముందు మరో పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ ట్రైలర్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.ఈ ట్రైలర్ తో ప్రభాస్ కల్కి సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.దీనితో కల్కి సెకండ్ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్, ప్రభాస్.. ప్రశాంత్ నీల్ మూవీ ఎవరితో..?కన్ఫ్యూషన్ లో ఫ్యాన్స్..
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గత ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన “సలార్: సీజ్ ఫైర్ పార్ట్ 1 ” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా సాధించింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సలార్ పార్ట్ 2 పై భారీగా అంచనాలు పెరిగి పోయాయి.ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో బిజీ గా ఉండటంతో కల్కి పూర్తి అయ్యాక సలార్ 2 సెట్స్ పైకి వెళ్తుందని అంతా భావించారు.ఇంతలో ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వచ్చి కొత్త ట్విస్ట్ ఇచ్చింది.అయితే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా సలార్ 2 తరువాత ఉంటుందని గతంలో ప్రశాంత్ నీల్ ప్రకటించారు. కానీ, ఉన్నట్టుండి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ సినిమా ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది అని మైత్రి మూవీస్ ప్రకటించింది.దీనితో ప్రభాస్ మూవీ ఆగిపోయిందేమో అని ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు.అయితే ఈ సినిమా ఆగిపోలేదని సలార్ మూవీ నిర్మాణ సంస్థ ప్రకటించింది.అయితే ఎన్టీఆర్ మూవీ తరువాత ప్రభాస్ మూవీ ఉంటుందని అంతా భావించారు.దానికి తగ్గట్టుగానే ప్రభాస్ కల్కి తరువాత హను రాఘవపూడి డేట్స్ ఇచ్చారు.ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ గా వున్నాడు.ఆ తరువాత వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు.అయితే ఆ తరువాత ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ మూవీ మొదలవుతుంది అనుకుంటే ఆ సినిమా పరిస్థితి కూడా ముందుకు సాగట్లేదు.ఆ సినిమా షూటింగ్ ఆగస్టు లో మొదలవుతుందని ప్రకటించగా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కాలేదు.దీనితో ఫ్యాన్స్ లో కాస్త కన్ఫ్యూషన్ మొదలైంది.