NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్లకు అదే చివరి రోజు.. సీఎం వార్నింగ్‌
మహిళల మీద అత్యాచారాలు చేసే వాళ్లకు అదే చివరి రోజు అవుతుంది అని వార్నింగ్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పథకాన్ని ప్రారంభించారు.. స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్‌ అందించారు సీఎం.. ఇక, ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివిధ అంశాలను ప్రస్తావించారు. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటాం.. మహిళల మీద అత్యాచారాలు చేసేవాళ్లకు అదే చివరి రోజు అవుతుంది అంటూ హెచ్చరించారు. ఇప్పటి వరకు మర్యాదగా చెప్పాను.. గంజాయి మత్తులో వికృత వేషాలు వేస్తే ఎవరిని వదిలిపెట్టను అని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, పోలవరం పూర్తిఅయితే రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చేవాళ్ళం.. అమరావతి పూర్తి అయ్యి ఉంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరికేది అన్నారు చంద్రబాబు.. కానీ, గత ప్రభుత్వ పాలన మొత్తం తప్పులు, అప్పులు గానే సాగిందన్నారు.. ఎంత అప్పు ఉందో తెలియడం లేదు.. అయితే, సంపద సృష్టించే భాధ్యత నాది.. పేదరికం లేని సమాజం కోసం ప్రయత్నిస్తున్నా.. ఇచ్చిన హామీని 26 రోజుల్లో అమలు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టిడిపి .. ఆ దిశగా పనిచేస్తా అన్నారు. మరోవైపు.. సీఎం వస్తున్నాడంటూ హడావిడి వద్దు.. పదరాలు కట్టొద్దు అని సూచించారు.. పరదాలు కడితే, కట్టిన అధికారికి సస్పెన్షన్ తప్పదు అని హెచ్చరించారు.. షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధం గా ఉన్నా.. రాబోయేది చంద్రబాబు 4.0 పాలన … 95 సీబీఎన్‌ని చూస్తారు అని తెలిపారు సీఎం చంద్రబాబు.

ఎన్టీఆర్ రూ.30 వృద్ధాప్య పింఛన్ మొదలు పెడితే.. రూ.4 వేలు చేసిన ఘనత చంద్రబాబుదే..
స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే.. ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకం.. పండగ వాతావరణంలో ప్రారంభమైంది.. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది.. ఇక, ప్రకాశం జిల్లాలో పెన్షన్ల పంపినీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే, ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్ళిన ఘనత చంద్రబాబుదే అన్నారు.. ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ 4 వేలు చేసి పెంచిన పెన్షన్ ఏప్రిల్ నుంచే కలిపి 7 వేలు లబ్ధిదారులకు ఇస్తున్నాం అని గుర్తుచేశారు.. ఇది టీడీపీకి ఉన్న నిబద్ధత అన్నారు.. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.. రెండు వేల పెన్షన్ మూడు వేలు చేసేందుకు ఐదేళ్లు ఆపసోపాలు పడిందిని ఎద్దేవా చేశారు.. కానీ, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.3 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచామని తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల లబ్ధిదారులకు ఇవాళ పెంచిన పెన్షన్లు అందజేస్తున్నాం అని వెల్లడించారు. ఇక, రాబోయే కొద్ది నెలల్లో ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.

ఒక్క పింఛన్ కూడా తీయం.. ప్రతి ఒక్కరికి అందిస్తాం..
ఒక్క పింఛన్ కూడా తీయకుండా.. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాండ్రాడ గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 7 వేలు పింఛన్ సొమ్మును అందజేశారు మంత్రి.. పెరిగిన పింఛన్ రూ. 4 వేలు, మూడు నెలల బకాయిలు 3వేలు మొత్తం ఒకేసారి రూ. 7వేలు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పెన్షన్ల కోసమే ఏడాదికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని వివరించారు.. ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్న ఆయన.. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ వారికి పెన్షన్ తీసేశారు.. సానుభూతిపరులకు వేధించారని మండిపడ్డారు.. అయితే, మా ప్రభుత్వంలో అలాంటి వాటికి తావులేదు.. ఒక్క పింఛన్ కూడా తీయకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం అన్నారు.. మరోవైపు.. వాలంటీర్ వ్యవస్థతతో సంబంధంలేకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం.. వాలంటీర్స్ కంటే ఒక గంట ముందే పింఛను పంపిణీ శామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ రోజు ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.. మంగళగిరి నియోజకవర్గంలో.. ఉదయమే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు.. ఇక, ఎక్కడికక్కడ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న విషయం విదితమే.

పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం.. నా జీతం కూడా వదిలేస్తున్నా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కలయాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జీతం కచ్చితంగా తీసుకుంటా.. అప్పుడే జవాబుదారి తనం ఉంటుంది.. అందరూ ప్రశ్నించడానికి ఉంటుందన్న పవన్.. ఇప్పుడు.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్న ఆయన.. గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్నాను.. కానీ, ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు.. అందుకే నా జీతం కూడా వదిలివేశా అని ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి వచ్చా పిఠాపురానికి గెలిచిన వెంటనే పనిలోకి దిగాను.. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేశాను అన్నారు.. ఇక, లబ్ధిదారులకు అందజేస్తున్నా సంక్షేమ పథకాలను రీ సర్వే చేపడతాం అని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.. ప్రజలకు పని చేసి మన్ననలు పొందిన తరువాతే విజయోత్సవం చేసుకుంటాను అన్నారు.. పిఠాపురం నియోజకవర్గంలోని మోడల్ విలేజ్ లుగా చేస్తా.. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పరిపాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడతాను అని వెల్లడించారు. రాజకీయాలకు డబ్బులకు సంబంధంలేదు.. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు అన్ని చిటికెలో చేస్తారని కోరుకుంటారు.. చిటికెలో పని జరిగేలా కృషి చేస్తాను అన్నారు డిప్యూటీ సీఎం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 వేలు పెన్షన్ ఇచ్చి 300 కమీషన్ తీసుకునే వారు అని ఆరోపించారు. ఇలా జరగకుండా కూటమి ప్రభుత్వం చూస్తుంది.. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేయడం సాధ్యం కాదన్నారు.. ఇది నిజం కాదని.. ఈవేళ ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ చేసి రుజువు చేశాం అన్నారు పవన్.

హైకోర్టులో కేసీఆర్‌కు చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్‌ కమిషన్‌ ఏర్పాటును రద్దు చేయాలని కేసీఆర్‌ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనలు హైకోర్టు సమర్థించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఆ కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయగా.. దీని విచారణ అర్హతపై ఇరు వర్గాలు వాదనలు వినిపించగా.. విచారణ అర్హత లేదని ప్రభుత్వ వాదనల న్యాయస్థాన ఏకీభవించింది. విద్యుత్‌ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటైందని కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదనలు వినిపించారు. పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారుల్ని కూడా కమిషన్ విచారించిందని.. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.

వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం
నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. డీసీసీబీ ఛైర్మన్‌గా కుంభం శ్రీనివాస్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీబీ ఛైర్మన్ పీఠానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో కుంభం శ్రీనివాస్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కోపరేటివ్ అధికారి ప్రకటించారు. ఎన్నికకు 15 మంది డైరెక్టర్లు హాజరు కాగా.. నలుగురు డైరెక్టర్లు గైర్హాజరయ్యారు. మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై 3 రోజుల క్రితం డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం చేయడంతో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. అనంతరం జరిగిన డీసీసీబీ ఛైర్మన్ పదవి ప్రమాణ స్వీకారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రెండు లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు చేసిన రైతు రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అందుకు రైతు రుణమాఫీ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. రుణమాఫీ వల్ల 32 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసే రాష్ట్రాన్ని దివాలా తీసినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు పోతున్నారని ధన్యవాదాలు తెలిపారు.

ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్.. కొత్త చట్టాల కారణంగా మారిన 10అంశాలివే
నేటి నుంచి దేశ న్యాయ వ్యవస్థలో పెనుమార్పు వచ్చింది. బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న IPC, CrPC, ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ఇప్పుడు మారిపోయింది. ఇవి ఇప్పుడు ఇండియన్ జ్యుడీషియల్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా భర్తీ చేయబడ్డాయి. ఇది మాత్రమే కాదు, ఢిల్లీలో వీధి వ్యాపారిపై ఇండియన్ జస్టిస్ కోడ్ కింద దేశంలోనే మొదటి కేసు నమోదైంది. ప్రభుత్వం హడావుడిగా ఈ చట్టాలను తీసుకొచ్చిందని, పార్లమెంట్‌లో చర్చ జరగలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు ప్రజలకు శిక్ష కంటే న్యాయం జరుగుతుందని, బానిసత్వ చిహ్నాలను తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. 1. విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు వెలువరించాలనే నిబంధన ఈ చట్టాల్లో ఉంది. ఇది కాకుండా, మొదటి విచారణ నుండి 60 రోజులలోపు అభియోగాలను రూపొందించాలి. 2. కొత్త చట్టాల ప్రకారం దేశంలోని ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఏ వ్యక్తి అయినా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. ఇది ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను దాఖలు చేయడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. 3. అన్ని తీవ్రమైన క్రిమినల్ కేసులలో నేరం జరిగిన ప్రదేశం, వీడియోగ్రఫీ తప్పనిసరి. ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆన్‌లైన్ సమన్లు పంపబడతాయి. కాలక్రమం ప్రకారం మాత్రమే కోర్టులలో విచారణ జరుగుతుంది. 4. ఏదైనా సందర్భంలో బాధితుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తే, అతను పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే చేయవచ్చు. దీంతో వెంటనే కేసులు నమోదు చేయడంతోపాటు సకాలంలో చర్యలు తీసుకునేందుకు పోలీసులకు కూడా సమయం లభించనుంది. 5. ఫిర్యాదుదారు వెంటనే FIR కాపీని కూడా పొందుతారు. 6. కొత్త చట్టాల ప్రకారం, మహిళలు, పిల్లలపై నేరాల బాధితులు ఆసుపత్రులలో ఉచిత చికిత్స పొందుతారు. 7. ఈ నియమాలు సాక్షుల భద్రతపై కూడా దృష్టి పెడతాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షుల రక్షణ పథకంపై పనిచేస్తాయి. దీంతో న్యాయ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, ముఖ్యమైన కేసుల్లో కూడా సాక్ష్యం చెప్పేందుకు వెనుకంజ వేయరు. 8. అత్యాచారం వంటి సున్నితమైన కేసుల్లో, బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో-వీడియో రికార్డింగ్ పోలీసులు చేస్తారు. 9. కొత్త నిబంధనల ప్రకారం, 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. 10. వీరితో పాటు వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు కూడా పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాల్సిన అవసరం లేదు.

సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. సిబిఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. ఢిల్లీ సీఎం ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది కోర్టు. అయితే, జూన్ 26వ తేదీన ముఖ్యమంత్రిని వెకేషన్ జడ్జి అమితాబ్ రావత్ మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపించారు. ఈ సమయంలో అరెస్టును చట్టవిరుద్ధం అని చెప్పలేమని న్యాయమూర్తి అన్నారు. అయితే, ఈ అరెస్టు చట్ట విరుద్ధం కాదని, సీబీఐ అత్యుత్సాహం చూపవద్దని వెకేషన్ న్యాయమూర్తి అమితాబ్ రావత్ పేర్కొన్నారు. ఆ తర్వాత జూన్ 29న వెకేషన్ జడ్జి సునైనా శర్మ అరవింద్ కేజ్రీవాల్‌ను జులై 12వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కిందికోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. ఇక, ఎక్సైజ్ పాలసీ కేసులో “కీలక కుట్రదారుల” జాబితాలో కేజ్రీవాల్ పేరు ఉందని సీబీఐ చెప్పింది.

స్థిరంగా బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండు రోజులు పెరిగిన పసిడి ధరలు.. గత రెండు రోజలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జులై 1) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,280 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,420గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,280గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.66,850గా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్​, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,280గా ఉంది. నేడు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.20 పెరిగి.. రూ.90,200గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.90,200గా ఉండగా.. ముంబైలో రూ.90,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.94,700లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.90,150గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.94,700లుగా నమోదైంది.

మరో బ్లాక్ బస్టర్ తమిళ్ రీమేక్‌లో బెల్లంకొండ హీరో!
టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఛత్రపతి డిసాస్టర్‌గా నిలవడంతో షార్ట్‌ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్‌.. మళ్లీ బిజీ అవుతున్నారు. టాలీవుడ్‌లో వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా.. కంటెంట్ డ్రివెన్‌ సబ్జెక్ట్స్‌ను పిక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. ఇక బెల్లంకొండ హీరో మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టారని తెలుస్తోంది. రీసెంట్ త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘గ‌రుడ‌న్’ రీమేక్‌లో బెల్లంకొండ హీరో నటించనున్నారట. ఈ సినిమా హక్కులను కేకే రాధామోహన్ తీసుకున్నారని, విజయ్ కనకమేడల డైరెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ్ చిత్రం రాచ్చసన్‌ను తెలుగులో రాక్షసుడు పేరుతో రిలీజ్ చేసి సాయి శ్రీనివాస్‌ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ తమిళ్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారట.

కన్నడ హీరో దర్శన్ మర్డర్ కేసుపై సినిమాలు.. టైటిల్స్ ఏంటో తెలుసా ?
రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లు కన్నడ స్టార్ హీరో దర్శన్‌పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించినందుకు రేణుకాస్వామిని నటుడు దర్శన్ చంపారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో దర్శన్ తో పాటు పవిత్రగౌడ, మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో దర్శన్ ఈ హత్య చేయించాడనే చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దర్శన్ ని, అరెస్ట్ చేసిన వాళ్లును పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనంగా మారింది. దర్శన్‌కు చెందిన బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లోనే శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. దర్శన్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్న పోలీసులకు శ్రీధర్ మృతదేహంతో పాటు సంఘటనా స్థలంలో ఒక సూసైడ్‌నోట్‌, ఒక వీడియో సందేశాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసుపై దర్శన్ ని అందరూ విమర్శిస్తుంటే.. కొంతమంది మాత్రం సపోర్టు చేస్తున్నారు. దర్శన్ అలాంటివాడు కాదని పలువురు అభిమానులు, అతడి సన్నిహితులు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసుపై సినిమాలు కూడా తీయాలని కొందరు ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి సెలబ్రిటీలు ఏదైనా ఇష్యూలో ఉండి జైలుకి వెళ్తే వారి జీవిత చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. పలువురు ఇలాంటి వాటిపై సినిమాలు కూడా తీస్తారు. ఈ క్రమంలోనే దర్శన్ జీవితం, దర్శన్ గతంలో కూడా పలుమార్లు జైలు పాలైన సంగతులు, ఇప్పటి హత్య కేసు అన్నింటిని మిళితం చేసి సినిమాలు తీయాలని కన్నడ ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ ఫిలిం ఛాంబర్ లో దర్శన్ హత్య కేసుపై సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ కూడా రిజిస్టర్ చేయమని వెళ్లారట. D గ్యాంగ్, ఖైదీ నెంబర్ 6106 లాంటి టైటిల్స్ రిజిస్టర్ చేయాలని పలువురు కోరారట. మరి త్వరలోనే దర్శన్ హత్య కేసుపై సినిమా వస్తుందేమో చూడాలి.