NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. కాల్‌ చేసిన మంత్రి పయ్యావుల
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫోన్‌ చేశారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని కోరారు పయ్యావుల.. దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు.. దీంతో, రేపు బుచ్చయ్య చౌదరితో ముందుగా ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. అయితే, తెలుగు దేశం పార్టీలో సీనియర్‌ లీడర్‌ అయిన బుచ్చయ్య చౌదరి.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి బుచ్చయ్య చౌదరి.. ఇక, ఈ నెల 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది.. ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, వైసీపీ అధినేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి సహా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు బుచ్చయ్య చౌదరి. ఆ తర్వాత స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.. స్పీకర్‌గా మరో సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు వినిపిస్తోన్న విషయం విదితమే. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ స్థానం నుంచి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించిన విషయం విదితమే..

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. వదిన ఇచ్చిన పెన్‌తో తొలి సంతకం..
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. బాధ్యతలు చేపట్టారు జనసేనాని.. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. అయితే, ఈ మధ్యే.. మెగాస్టార్‌ చిరంజీవి భార్య, తన వదిన సురేఖ.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఓ పెన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు.. బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు చేస్తున్న తరుణంలో.. తన వదిన గిఫ్ట్‌గా ఇచ్చిన పెన్నును ఉపయోగించారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌ కల్యాణ్‌కు మంత్రులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. మెగా బ్రదర్‌, సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్‌కు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. తదితర నేతలు పవన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.. మరోవైపు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి సీనియర్ ఐఏఎస్ అధికారి శశి భూషణ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వర్మ
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక, ఈ కార్యక్రమానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత వర్మ హాజరయ్యారు.. బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా చూడటంతో నా జన్మ ధన్యమైందన్నారు. పిఠాపురం ప్రజలు గెలిపించుకున్న పవన్ కల్యాణ్‌.. ఈ పదవిలో ఉండటం ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయంలో ధ్వంసమైన వ్యవస్థలను పవన్ కల్యాణ్‌ గాడిలో పెట్టేందుకు
రివ్యూలు చేస్తున్నారు.. త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనతో పాటు పిఠాపురం పర్యటన కూడా ఉంటుందన్నారు.. మరోవైపు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రామ లక్ష్మణుల మాదిరి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం పని చేస్తారని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ..

కన్నీళ్లు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..
గత ప్రభుత్వ హయాంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్న టీడీపీ సీనియర్‌ నేత జేసీ ఒక్కసారిగా కన్నీరు కార్చారు.. తనపై అన్యాయంగా కేసులు పెట్టడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. గత వైసీపీ ప్రభుత్వంలో నాకు చాలా అన్యాయం జరిగిందన్న ఆయన.. తమ కుటుంబంపై దొంగలుగా ముద్ర వేసి జైలుకు పంపించారు.. ఏప్రిల్ ఒకటి 2017 తర్వాత బీఎస్ 4 వాహనాలు అమ్మకూడదని.. రిజిస్ట్రేషన్ చేయకూడదని అనేక రాష్ర్టాల్లో హైకోర్టు తీర్పునిచ్చాయి.. కానీ, తప్పు చేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగలు మాదిరి అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేనడిగితే కేసు నుంచి బయట పడేసేందుకు చంద్రబాబు చేస్తారు.. కానీ, నేను ఇది నా వ్యక్తిగత అంశంగానే చూస్తాను అన్నారు.. ఇక, తన ట్రావెల్స్‌పై కేసులకు ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్ సీతారామాంజనేయులు.. మాజీ మంత్రి పేర్ని నాని.. ఇతర ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులే కారణం అన్నారు.. జేసీ ట్రావెల్స్ పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలి.. దీనిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశాను అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు ఇంటి ముందు ధర్నా చేస్తాను అని హెచ్చరించారు.. మరోవైపు.. ఇక, ఏపీని చెడకొట్టిందే ఐఏఎస్, ఐపీఎస్ లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా మా వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని మండిపడ్డారు.. రవాణా శాఖ అధికారులు అంతా లంచగొండులే అని ఆరోపించారు.. నా బస్సులన్నింటిని ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు రిపేరు చేయించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. పరువు తీసే బయటి తిరగకుండా చేశారు.. నన్ను జైలుకు పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి తిండి కూడా పెట్టలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

అడ్వకేట్ జనరల్‌ను నియమించిన ఏపీ ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించింది చంద్రబాబు సర్కార్‌.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు న్యాయ శాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్ రావు.. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.. కాగా, దమ్మాలపాటి శ్రీనివాస్.. ఆయన అడ్వకేట్ జనరల్‌గా పనిచేయడం ఇది తొలిసారి కాదు.. 2014 నుంచి 2019 వరకు ఏజీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడడం.. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఏజీ పదవి మళ్లీ దమ్మాలపాటి శ్రీనివాస్‌కే దక్కుతుందనే ప్రచారం సాగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగా.. ఇతర పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. దమ్మాలపాటి వైపే చంద్రబాబు మొగ్గుచూపారట.. ఇక, గతంలో టీడీపీ సర్కార్‌ హయాంలో దమ్మాలపాటిపై, ఆయన కుటుంబ సభ్యులపై రాజధాని భూముల విషయంలో కేసులు పెట్టారు.. ఆ కేసులను తానే వాదించుకన్న దమ్మాలపాటి.. ఇతర కేసుల్లో టీడీపీ కీలక నేతలపై నమోదైన కేసులను కూడా ఆయనే వాదిస్తూ వచ్చారు.. ఇప్పుడు ఆయన్నే ఏజీగా నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు.

వరుసగా 5 రోజులు వాన.. పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే జూన్‌ ప్రారంభం నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు అంటే నేటి నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయం, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవం.. సీఎం రేవంత్ ట్విట్‌ వైరల్‌
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024ను యువకవి, రచయిత రమేష్ నాయక్‌కు అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ట్వీట్ చేశారు. పిన్నవయసులో ‘ధావ్లో’ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన రమేష్ కార్తీక్ నాయక్‌కు అభినందనలు. ఈ అవార్డు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఇది గొప్ప గౌరవమని అన్నారు. కార్తీక్ భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు చేసి సాహిత్యరంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రమేష్ కార్తీక్ నాయక్ సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. మోజిరామ్, సెవంతబాయి దంపతులకు నునావత్ మొదటి సంతానం. డిసెంబర్ 14, 1997న జన్మించిన అసలు పేరు నునావత్ కరిర్తిక్. కథలు, వచనా కవిత్వం, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనువాద రంగాల్లో చిన్నతనంలోనే సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. రమేష్ కార్తీక్ నాయక్ రచనలు ఒక్కొక్కటి ప్రజాదరణ పొందాయి. 2014లో తొలి కవితా సంపుటిని ప్రారంభించిన రమేష్.. తాను సేకరించిన సంఘటనలు, వ్యక్తులు, ఎన్నో విషయాలు తెలుసుకుని తొలి రచన పూర్తి చేశారు. అంతేకాకుండా.. గిరిజన బతుకులు, వెతలనే కవితలు, కథలుగా చెప్పాలనుకున్నాడు. కాగా.. రమేశ్‌ రాసిన ‘బల్దేర్‌ బండి’ కవితా సంపుటి 2018లో ప్రచురితం కాగా, 2019 జనవరిలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక.. ఈ వచన కవితా సంపుటి సాహితీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నది.

నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం ఇక్కడి నుంచి కొత్త క్యాంపస్‌కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

వరదలతో అస్సాం విలవిల.. 30 మందికి పైగా మృతి
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్‌పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. గైనచోర గ్రామంలో మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. అస్సాంలో మేలో రెమాల్ తుఫాను వల్ల కొండచరియలు విరిగిపడ పలువురు మరణించగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 30కి చేరుకుంది.

స్థిరంగా పసిడి ధరలు.. తగ్గిన వెండి!
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరిగిన పసిడి ధరలు కాస్త దిగొస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బుధవారం (జూన్ 19) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,220గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పసిడి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయన్న విషయం తెలిసిందే. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 తగ్గి.. 91,000గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,000 కాగా.. ముంబైలో రూ.91,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,600గా నమోదవగా.. బెంగళూరులో రూ.91,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.95,600లుగా నమోదైంది.

రోహిత్‌తో గొడవ.. బంగ్లాదేశ్ క్రికెటర్‌కు ఐసీసీ షాక్‌!
బంగ్లాదేశ్‌ పేసర్‌ తంజీమ్‌ సకీబ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ సకిబ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొరడా ఝుళిపించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడమే కాకూండా.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ చేర్చింది. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా కింగ్స్‌టౌన్‌ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌తో గొడవకు దిగిన కారణంగా సకిబ్‌పై ఐసీసీ జరిమానా‌ విధించింది. మూడో ఓవర్‌ ముగిసిన అనంతరం నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌ దగ్గరకు వెళ్లిన తంజీమ్‌ సకీబ్‌ ఢీకొట్టడమే కాకుండా.. కవ్వించే మాటలతో దురుసుగా ప్రవర్తించాడు. రోహిత్‌ డిఫెన్స్‌ షాట్లు ఆడుతుండటంతో సహనం కోల్పోయి అతడిపైకి దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. తంజీమ్‌ దురుసు ప్రవర్తన పట్ల స్పందించిన ఐసీసీ.. క్రమశిక్షణ చర్యలకు దిగింది. ఐసీసీ ఆర్టికల్‌ 2.12 ప్రకారం.. మ్యాచ్‌ జరుగుతున్నపుడు సహచర ఆటగాడు, అంపైర్‌, మ్యాచ్‌ రిఫరీ, సిబ్బంది, ప్రేక్షకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు.

పేరెంట్స్‌ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనలైన రౌడి బాయ్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్న విజయ్ (Vijay) దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ వరుస సినిమాలతో బిజీబిజీగా షూటింగ్ లతో ఉన్నాడు. ఇటీవల విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా యావరేజ్ గా నిలిచింది. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్ళాడు. ఈ వెకేషన్ లో విజయ్ కుటుంబ సభ్యులలో వారి పేరెంట్స్, తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. ఈమధ్య అమెరికాలో కూడా విజయ్ దేవరకొండ కోసం అక్కడి తెలుగు వాళ్ళు చేసిన హంగామాకు సంబంధించిన వీడియోలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ ఫ్యామిలీ సభ్యులు అమెరికా వెకేషన్ ను పూర్తి చేసుకొని తిరిగి రాగా.. విజయ్ దేవరకొండ అమెరికాలో తన పేరెంట్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ పోస్ట్ లో మా అమ్మా నాన్న లను మొదటిసారి అమెరికాకు తీసుకెళ్ళానంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.

‘మరియ‌మ్’గా రిఎంట్రీ ఇస్తోన్న శోభ‌న..
చాలారోజుల నుండి ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతగానో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ వైటెడ్ సినిమా ‘క‌ల్కి 2898 AD’. ప్రపంచవ్యాప్తంగా ఇక కేవలం మ‌రో 8 రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు థియేటర్స్ కు రానుంది. ఈ సినిమాతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇందుకోసం ప్రభాస్ అభిమానులు ముఖ్యంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబంధం ఇప్పటికే ప్రమోషన్స్ ని ఎంతో పెద్ద ఎత్తున ప్లాన్ చేసి రకరకాలుగా ప్రజెంట్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలోని మరియ‌మ్ (mariam) పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది చిత్ర బృందం. మరియ‌మ్ అనే పాత్రలో ప్రముఖ నటి శోభన (shobana) నటిస్తున్నట్లుగా తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది వైజయంతి మూవీస్. సోషల్ మీడియా ఖాతా ద్వారా వైజయంతి మూవీస్ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు ” ఆమె లాగే తన పూర్వీకులు కూడా ఎదురు చూశారు ” అంటూ క్యాప్షన్ ను జత చేశారు. దింతో ఆమె పాత్రపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది.

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి
మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తాజాగా కన్నుమూశాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. 2007లో వీరి వివాహం జరిగింది. అప్పట్లో ఈ వివాహం పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే 2014లో వారికి విడాకులు అయ్యాయి. ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ని 2016లో వివాహం చేసుకున్నారు. ఇక శిరీష్ శ్రీజ జంటకు ఒక పాప ఉండగా విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గరే పెరుగుతుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శిరీష్ బీజేపీలో చేరి కొంత యాక్టివ్ అయ్యారు. 2019లో ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఇక తాజాగా ఆయన అనారోగ్య కారణాలతో కన్ను మూసినట్లు సమాచారం అందుతోంది. లంగ్స్ డామేజ్ కావడంతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది.