NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

నేడు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఇలా చేద్దాం..!
ఇవాళ టీడీపీపీ సమావేశం జరగనుంది.. ఉండవల్లిలోని తన నివాసంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో భేటీ కానున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల ప్రస్తావన పార్లమెంట్‌లో తేవాలని తమ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.. ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు జరిపిన ఢిల్లీ పర్యటనల్లో ఇచ్చిన వినతులపై ఫాలో అప్ చేసేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంది టీడీపీపీ. ఢిల్లీలో ధర్నాకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సిద్దపడుతోన్నందున్న.. కౌంటర్లను సిద్ధం చేసుకునే అంశంపై టీడీపీ కసరత్తు చేస్తోంది.. జగన్ హయాంలో జరిగిన అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని టీడీపీ భావిస్తోంది..

ముచ్చుమర్రి బాలిక కేసులో ట్విస్ట్..! ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి..
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య తర్వాత మృతదేహాన్ని మాయం చేసిన కేసులో పోలీసుల విచారణ కొనసాగుతూనే ఉంది.. అయితే, ఈ కేసులో రోజుకో.. పూటకో ట్విస్ట్‌ అనే మాదిరిగా కొనసాగుతూనే ఉంది.. బాలిక మిస్సింగ్‌ కేసులో నిర్లక్ష్యం వహించారంటూ.. నందికొట్కూరు రూరల్‌ సీఐ, ముచ్చుమర్రి ఎస్సై ని సస్పెండ్‌ చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. సొంతింటి నిర్మాణం, పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.. ఇంకో వైపు.. బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగానే.. ఈ కేసు కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది..

సౌదీలో తెలుగు వ్యక్తి కష్టాలు.. డోంట్‌ వర్రీ..! నేను ఉన్నానంటూ మంత్రి లోకేష్‌ హామీ..
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో.. ఏజెంట్లు నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఒక దగ్గర ఉద్యోగం అని చెప్పి.. మంచి జాబ్‌ అని చెప్పి నమ్మబలికి.. అందినకాడికి దండుకొని.. ఏదో చెత్తపనిలో తోసేసి చేతులు దులుపుకుంటున్నారు కొందరు ఏజెంట్లు.. అయితే, కువైట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ ఘటన మరువక ముందే.. ఇప్పుడు వీరేంద్ర కుమార్‌ అనే మరో వ్యక్తి సౌదీలో చిక్కుకున్నాను.. కాపాడండి బాబోయ్‌ అంటూ.. సోషల్‌ మీడియాలో ఓ వీడియో పెట్టాడు.. అది కాస్తా మంత్రి నారా లోకేష్‌ వరకు చేరడంతో.. డోంట్‌ వర్రీ..! నేను ఉన్నానంటూ హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌.. ఇక, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో విషయానికి వస్తే.. నా పేరు సరెల్ల వీరేంద్ర కుమార్.. ఓ ఏజెంట్‌ ఖతార్ అని చెప్పి తీసుకెళ్లి.. సౌదీ అరేబియాలో వదిలేశారు అని ఆ వీడియోలో వాపోయాడు.. 10వ తేదీన తాను ఖతార్‌ వచ్చాను.. ఆ తర్వాత 11వ తేదీన సాయంత్రం సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చారు.. ఈ ఏడారిలో నన్ను పడేశారు.. నా ఆరోగ్యం బాగోలేదు.. రక్తంతో వాంతులు అవుతున్నాయి.. ముక్కు నుంచి కూడా రక్తం కారుతోంది.. ఎవరైనా పెద్ద మనసు చేసుకుని.. నాకు సాయం చేయండి.. ఈ నరకం నుంచి నన్ను బయటపడేయండి అంటూ కన్నీరుమున్నీరయ్యాడు.. నేను ఖతార్‌ రావడానికి ఏజెంట్‌కు రూ.1.70 లక్షలు అప్పుచేసి ఇచ్చాం.. ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు, నీరు లేదు, తిండి లేదు.. ఈ ఒంటెల దగ్గర నేను ఉండలేకపోతున్నాను.. మరో పది రోజులు ఇక్కడే ఉంటే.. నేను చనిపోయే పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు వీరేంద్ర కుమార్‌.. ఇక, ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ ముందుకు వస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. వీరేంద్ర కుమార్‌ వీడియోపై స్పందించారు.. నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకువస్తాం వీరేంద్రా! డోంట్‌ వర్నీ అంటూ ట్వీట్‌ చేశారు..

తాడిపత్రిలో హై టెన్షన్..! నిన్న జేసీ వార్నింగ్‌.. నేడు కేతిరెడ్డి ప్రత్యక్షం..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.. నిన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్‌ ఇచ్చిన విషయం విదితమే కాగా.. ఈ రోజు తాడిపత్రిలో అడుగుపెట్టారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి అల్లర్ల కేసులో కేతిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. అయితే, బెయిల్ ష్యూరిటీలు సమర్పించేందుకు అనంతపురం నుంచి తాడిపత్రి పీఎస్ కి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి .. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలింగ్ రోజు చెలరేగిన అల్లర్లతో రెండు నెలలు నియోజకవర్గం వదిలి బయటే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. మరోవైపు.. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతామని నిన్నే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం.. ఇవాళ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇక, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాక్షన్ చేస్తా అని గతంలో మాట్లాడాడు.. ఇటు వంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తాడిపత్రి, అనంతపురం, ఏపీ నుంచి బహిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదన్న ఆయన.. జిల్లా నుంచి నన్ను బహిష్కరించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నా సీఎం? లేక జిల్లా అధికారా..? అని ప్రశ్నించారు. నాకు కుటుంబం ఉన్నట్టే.. జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా కుటుంబం ఉంది. తాడిపత్రిలో మళ్లీ అలజడులు సృష్టించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను జేసీ టార్గెట్ చేశారు.. కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు.. నాకు జామీన్ ఇవ్వకుండా పోలీసులపై జేసీ ఒత్తిడి తెస్తున్నారు.. ఎవరెన్ని చేసినా తాడిపత్రి ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాను అని ప్రకటించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.

టీటీడీలో లోపాలు గుర్తించాం.. సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం..
టీటీడీలో లోపాలను గుర్తించాం.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమలలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. టీటీడీ ఈవోగా భాధ్యతలు స్వీకరించే సమయంలో వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాలు మొదలుకోని, లడ్డూ ప్రసాదం, భక్తులకు అందించే అన్నప్రసాదాలు నాణ్యత పెంచాలని.. ఆన్ లైన్ లో జారీ చేసే దర్శన టికెట్ల జారిలో లోపాలను గుర్తించి సరిదిద్దాలని చెప్పారు.. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత చాలా లోపాలను గుర్తించామని తెలిపారు శ్వామలరావు. సర్వదర్శనం భక్తులకు క్యూ లైనులో అన్నప్రసాద వితరణ సరైన రీతిలో జరగడం లేదన్నారు శ్వామలరావు.. క్యూ లైనులో వేచి వున్న చంటిబిడ్డలకు పాలు అందించడం లేదు.. క్యూ లైనులో వేచివున్న భక్తులకు కనీస సమాచారం అందించే వ్యవస్థ కూడా లేనట్టు ఫిర్యాదులు అందాయి.. క్యూ లైన్‌లో నూతనంగా మూడు అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం.. వారంతం రద్దీ సమయంలో భక్తుల సౌకర్యాలు పర్యవేక్షణకు ఎస్వీబీసీ సీఈవోకి భాధ్యతలు అప్పగించాం.. అన్నప్రసాద కాంప్లెక్స్‌లోని నిత్యం 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. భక్తులకు సేవలందించడానికి ఉద్యోగుల కొరత ఉంది.. కావాల్సినవారి కంటే మూడోవంతు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు.

వానకాలంలో కంకులకు డిమాండ్‌.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతి..
నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది. చల్లటి వాతావరణంలో, కాల్చిన మొక్కజొన్నలను వేడి మంటలకు ఆరబెట్టడానికి నగరవాసులు జంకుతున్నారు. దీంతో కంకులకు మంచి డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ నగరానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కంకులు దిగుమతి అవుతుంది. ప్రతి సంవత్సరం జూన్‌లో కంకులు దిగుమతి అయ్యేవి. ఈసారి పంట ఆలస్యంగా రావడంతో జులై నుంచి కంకులతో కళకళలాడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా పాతబస్తీలోని దారుస్సలాం రోడ్డులో కుప్పలు తెప్పలుగా కన్నుల పండువగా సాగుతున్నాయి. చిరు వ్యాపారులు హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక్కో కంకి ధర రూ.5గా ఉంది. ఇదిలా ఉండగా మార్కెట్‌లో ఈ కంకులు ఒక్కోటి రూ.20. దూర ప్రాంతాల నుంచి నగరానికి తీసుకురావాలంటే రవాణా ఛార్జీల భారం ఎక్కువగా ఉండడంతో ధరలు పెంచాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 20 శాతం మాత్రమే మొక్కజొన్న గింజలు వచ్చాయని, ఇంకా 80 శాతం రావాల్సి ఉందని జమీల్ తెలిపారు. సాధారణంగా, హోల్‌సేల్ మార్కెట్ ఉదయం 5 నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మొక్కజొన్న సీజన్ ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుందని తెలిపారు. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు ఎక్కువగా అమ్ముడవుతాయని వ్యాపారులు తెలిపారు. రైతులకు, వినియోగదారులకు నష్టం వాటిల్లకుండా ధరలను నిర్ణయిస్తామని హోల్‌సేల్ మేనేజర్లు తెలిపారు.

పరీక్షలు పెట్టకుండా… వాయిదా వేస్తూపోతే వయసైపోతుంది..
పరీక్షలు పెట్టకుండా.. వాయిదాలు వేసుకుంటూ పోతే యుక్త వయసు అంతా వృథా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశ పెట్టనున్నాం. నిరుద్యోగులు సమస్య పరిష్కారం చేయడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేము ఎక్కడైతే ప్రమాణం చేశామో.. నిరుద్యోగులకు కూడా అక్కడే ఉద్యోగ ప్రమాణం చేయించామన్నారు. పదేళ్లలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు పెట్టలేదన్నారు. గత ప్రభుత్వం ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదన్నారు. విద్యార్దులు మాత్రం సంవత్సరాల కొద్ది.. కోచింగ్ సెంటర్ లో చుట్టూ తిరిగారని తెలిపారు. విద్యార్థుల బాధ మేము కళ్లారా చూసినామని అన్నారు. అందుకే మేము వచ్చిన వెంటనే.. టీఎస్పీఎస్సీ రద్దు చేసి కొత్త కమిషన్ వేశామని అన్నారు. గ్రూప్ రాసే విద్యార్థుల ఆలోచనకి అనుగుణంగా పరీక్షలు నిర్వహించామన్నారు. గ్రూప్ 2.. గ్రూప్ 3 కి సమానమైన సిలబస్ ఉంటుంది కాబట్టి.. కొద్ది తేడాతో పరీక్షలు నిర్వహించుకుంటున్నామన్నారు. యూపీఎస్సీ మీద నమ్మకం ఉంటుంది విద్యార్థులకు.. కాబట్టి పరీక్ష మీద దృష్టి పెడతారన్నారు. కానీ టీఎస్పీఎస్సీ మీద గత పదేళ్ళలో అపనమ్మకం ఉండేదన్నారు. ప్రభుత్వం మీద.. టీఎస్పీఎస్సీ మీద ఉద్యమాలు చేశారన్నారు. అందుకే నమ్మకం గా ఉద్యోగాలు నిర్వహించి భర్తీ చేయాలని చెప్పినం అన్నారు. పరీక్షలు రాసి ఉద్యోగం రాకుంటే.. ప్రైవేట్ సెక్టార్ లోకి ఐనా వెళ్తారన్నారు. కానీ పరీక్షలు పెట్టకుండా… వాయిదాలు వేసుకుంటూ పోతే యుక్త వయసు అంతా వృథా అవుతుందన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నామన్నారు. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామన్నారు. జూన్ 2 లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు అభినందనలు తెలిపారు.

విమానంలో పోర్న్ చూస్తూ పక్క మహిళపై చేతులేసిన ఉన్నతాధికారి
కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్లే ఎతిహాద్ విమానంలో బోస్టన్‌కు వెళ్తున్న ఓ మహిళ జిందాల్ స్టీల్స్ సీనియర్ అధికారి దినేష్ కుమార్ సరోగీపై పలు తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రయాణంలో అతను తనకు పోర్న్ క్లిప్ చూపించడానికి ప్రయత్నించాడని మహిళ చెప్పింది. దాంతో పాటు తనను వేధింపులకు గురి చేసినట్లు ఆమె పేర్కొంది. ఆ మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పంచుకుంది. తన పోస్ట్‌లో మహిళ విమానంలో జరిగిన సంఘటనను నివేదించినప్పుడు ఎయిర్‌లైన్ సిబ్బంది సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. జిందాల్ స్టీల్ విభాగానికి చెందిన వల్కన్ గ్రీన్ స్టీల్ సీఈవో దినేష్ సరోగి ప్రయాణంలో తనకు పోర్న్ ఫిల్మ్ చూపించారని ఆ మహిళ ఆరోపించింది. సోషల్ మీడియాలో.. “నేను ఒక పారిశ్రామికవేత్త పక్కన కూర్చున్నాను. అతని వయస్సు దాదాపు 65 సంవత్సరాలు ఉంటుంది. అతను ఇప్పుడు ఒమన్‌లో నివసిస్తున్నానని, కానీ తరచూ భారతదేశానికి వెళుతున్నానని నాతో చెప్పాడు. అతను నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నా కుటుంబం తదితర విషయాలను అడిగారు. తన కొడుకులిద్దరూ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారని చెప్పారు. నన్ను సినిమాలు చూడటం ఇష్టమా అని అడిగాడు. నేను అవును అని చెప్పాను. దీని తర్వాత తన ఫోన్‌లో కొన్ని సినిమా క్లిప్‌లు ఉన్నాయని చెప్పాడు. అతను తన ఫోన్, ఇయర్‌ఫోన్‌లను తీసి నాకు పోర్న్ చూపించడం ప్రారంభించాడు. అవి చూస్తూ అతను నన్ను తాకడం ప్రారంభించాడు. నేను షాక్, భయంతో స్తంభించిపోయాను. చివరికి నేను వాష్‌రూమ్‌కి పరిగెత్తి ఎయిర్ స్టాఫ్‌కి ఫిర్యాదు చేశాను. ఎతిహాద్ బృందం అలర్ట్ అయింది. వెంటనే చర్యలు తీసుకున్నారు. నాకు టీ, పండ్లు ఇచ్చారు.” అంటూ రాసుకొచ్చారు. జిందాల్ స్టీల్ చైర్మన్ నవీన్ జిందాల్ ఈ విషయంపై వీలైనంత త్వరగా విచారణ జరిపి అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళకు హామీ ఇచ్చారు. సరయోగి తన సీటు నుండి లేచిన తర్వాత తన ఆచూకీ గురించి ఎయిర్‌లైన్ సిబ్బందిని అడిగారని మహిళ ఆరోపించింది.

అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన ఈడీ
అక్రమ మైనింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో చాలా కాలంగా ఈడీ విచారణలో నిమగ్నమై ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా సురేంద్ర పన్వార్‌తో పాటు అతని సహచరుల ఇంటిపై ఈడీ దాడులు చేసింది. సురేంద్ర పన్వార్‌ను అరెస్టు చేసేందుకు కేంద్ర పారామిలటరీ బలగాలతో ఈడీ అక్కడికి చేరుకుంది. హర్యానా పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌ల ద్వారా ఈ మనీలాండరింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. యమునానగర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో లీజు గడువు ముగిసినా, కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్రమంగా బండరాళ్లు, కంకర, ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

మనమే గెలవబోతున్నాం.. డెమోక్రటిక్లకు కమలా హారిస్ భరోసా..!
అమెరిక అధ్యక్ష ఎన్నికలు జోరందుకున్నాయి. కాల్పుల ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు యూఎస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించేందుకు అవకాశాలు మెరుగుపర్చుకోవడంతో.. జో బైడెన్ విచిత్ర ప్రవర్తనతో సొంత పార్టీ నేతలకే తలనొప్పిగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ దాతలకు అధ్యక్ష ఎన్నికలలో పార్టీ గెలుస్తుందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భరోసా ఇచ్చారు. ఎక్కువ మంది చట్టసభ సభ్యులు మరోసారి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను నిలబెట్టాలని పిలుపునిచ్చారని చెప్పుకొచ్చింది. పార్టీకి చెందిన దాతలను శాంతింపజేయడానికి షార్ట్ నోటీసుపై ఏర్పాటు చేసిన కాల్‌లో.. మేము ఈ ఎన్నికల్లో గెలవబోతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అమెరికన్ ప్రజలకు మొదటి స్థానం ఇస్తారో మాకు తెలుసు.. మా అధ్యక్షుడు జో బైడెన్.. 2024 అధ్యక్ష రేసులో కొనసాగుతానని ప్రమాణం చేశారని కమలా హారిస్ గుర్తు చేశారు. ఇక, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు జో బైడెన్ నామినేషన్‌ను వేగవంతం చేయాలని యోచిస్తుందని కమలా హారిస్ పేర్కొనింది. మరోవైపు, తొమ్మిది మంది డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులు బైడెన్‌ను ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన దాతలు ఎన్నికల ప్రచారానికి నిధులను నిలిపివేస్తామని బెదిరించడంతో.. ఈవెంట్‌లలో పాల్గొన్న వైఎస్ ప్రెసిడెంట్ కమలా హరిస్.. ఈ ఎన్నికల్లో తప్పకుండా తాము విజయం సాధించబోతున్నామని వారికి భరోసా కల్పించింది.

డిసెంబర్ దంగల్..రేసులో ఉండేది ఎవరు తప్పుకునేది ఎవరు..?
ఒకేసారి అన్ని సినిమాలు రావడం, బాగున్న సినిమాలకు థియేటర్ల ఇవ్వలేదని  ఇబ్బంది పడడం ఇటివంటి వ్యహారాలు సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం. కానీ ఈ సారి డిసెంబరులో అదే పరిస్థితి వచ్చేలా ఉంది చూస్తుంటే. ఒకప్పుడు డిసెంబర్ అంటే క్రిస్టమస్ రోజు మాత్రమే ఒకటి అరా సినిమాలు వచ్చేవి, కానీ అఖండ, పుష్ప లు డిసెంబర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో డిసెంబర్ కు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇక రానున్న డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని అందరికంటే ముందుగా డేట్ వేసాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని డిసెంబర్ కు వేసేలా ప్లాన్ చేసాడు. వారితో పాటు మరో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ ను కూడా అదేనా నెలలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు నిర్మాత బన్నీ వాసు.. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాలు వచ్చేలా లేవు.

హైదరాబాద్ ‘పార్క్’లో సందడి చేయనున్న రాయన్..ఎప్పుడంటే..?
తమిళ సూపర్ స్టార్ ధనుష్ 50వ మైల్ స్టోన్ మూవీకి తానే దర్శకత్వం వహిస్తు, నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన రాయన్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ధనుష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండనున్నటు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ మేకోవర్ , యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో ఉండేలా వున్నాయి. సందీప్ కిషన్ ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగా వుంది. ఎస్ జే SJ సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రామాయణం, మహాభారతం తరహా హై పాయింట్‌లను సినిమా అంతటా పొందుపరిచారని సమాచారం. కాగా రాయన్ ను తమిళ్ తో తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నాడు ధనుష్. షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు ధనుష్. ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ నెల 21న పార్క్ హయత్ హోటల్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ హీరో ధనుష్ తో పాటు సందీప్ కిషన్ తదితరులు పాల్గొననున్నారు. ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రానున్న రాయన్ ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సినిమాస్, సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా కొనుగోలు చేసారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రానున్న రాయన్ ఎలా ఉండబోతుందో చూడాలి.