NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పోలవరంలో సీఎం చంద్రబాబు.. పనుల పురోగతిపై ఆరా
ఆంధ్రప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయనకు మంత్రులు నిమ్మల, పార్థ సారథి, కందుల దుర్గేష్‌ సహా.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. కూటమి నేతులు స్వాగతం పలికారు.. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఆ వెంటనే.. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు బయల్దేరారు.. గతంలో ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన.. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రాజెక్టు పరిశీలనకు వచ్చారు.. మొదట వ్యూ పాయింట్ నుంచి పోలవరం పనుల పురోగతని పరిశీలించిన చంద్రబాబు.. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పైకి చేరుకున్నారు.. స్పిల్ వే 26వ గేట్ వద్ద పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 2. 05 గంటల నుండి 3.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ సీఎం.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడననున్నారు.

స్పీకర్‌గా ఆ సీనియర్‌ ఎమ్మెల్యే పేరు ఖరారు.. జనసేకు డిప్యూటీ స్పీకర్‌ పదవి..!
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. ఇప్పటికే సీఎం, మంత్రివర్గం ప్రమాణస్వీకారం.. మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కాగా.. ఇప్పుడు స్పీకర్‌ ఎన్నికపై కసరత్తు చేస్తోంది అధికార పక్షం.. ఏపీ స్పీకర్‌ పేరు ఎంపిక దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ని ఎంపిక చేసినట్టు సమాచారం.. ఇక, డిప్యూటీ స్పీకర్‌ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది.. డిప్యూటీ స్పీకర్‌ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నారు.. మరోవైపు ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రను నియమించే ఛాన్స్‌ ఉందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.. అయితే, ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్‌ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు.. స్పీకర్‌గా బీసీ నేతను ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం.. టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్‌ రేసులో అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించినా.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌… గత ఐదేళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని అయ్యన్నపాత్రుడు వైపే మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. అయితే, దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదు..
లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇప్పటికీ కొంత మంది పోలీసు అధికారుల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.. మీకు ఇంకా జగన్ మోహన్ రెడ్డిపై ప్రేమవుంటే, ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీకోసం పనిచేసుకోండి అంటూ సలహా ఇచ్చారు.. కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసిన వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్‌ ఇచ్చారు.. మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తాను.. అవసరం మేరకు న్యాయ పోరాటం చేస్తాం అన్నారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు హోంశాఖ మంత్రి అనిత..

ఋషికొండ కట్టడాలపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి
ఋషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అవి వైఎస్‌ జగన్‌ సొంత భవనాల్లాగా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. రుషికొండ భావనలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని కోరారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాలుగు నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం.. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భావనలను వినియోగించుకోవాలని సూచించారు.. రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ మోహన్ రెడ్డి ఏమీ ఉండరు అని వ్యాఖ్యానించారు. ఇక, విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు.. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారని తెలిపారు అమర్నాథ్.. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటంబం మీద బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసం? అని మండిపడ్డారు..2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్న ఆయన.. హైదారాబాద్ లో ఇల్లు నిర్మించుకునే సమయంలో చంద్రబాబు ప్రైవేట్ హోటల్ ఉండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండ పై శాశ్వత భవనాలు నిర్మించారని తెలిపారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలని సవాల్‌ చేశారు.. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలను తప్పు తోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవుపలికారు.

వైఎస్‌ జగన్ క్యాంప్ ఆఫీసు వద్ద ఆంక్షల తొలగింపు
మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ క్యాంప్ ఆఫీసు ముందు ఉన్న రోడ్ పై ఆంక్షలు తొలగించారు అధికారులు.. సాధారణ ప్రజలతో పాటు అన్ని రకాల వాహనాల రాకపోలకు ఆ రోడ్లో అనుమతి ఇస్తున్నారు పోలీసులు.. గతంలో రోడ్లకు ఇరు వైపులా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు సిబ్బంది. దీంతో, ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు రహదారి అందుబాటులోకి వచ్చింది.. కాగా, 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌.. ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. తాడేపల్లికి చెందిన వైసీపీకి చెందిన రైతు నుంచి భూమిని కొనుగోలు చేసి ఇల్లు కట్టారు.. జగన్‌ ఇంటి పక్కనే భారీ విల్లాలను నిర్మించారు. ఇక, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఎంపిక చేయడంతో.. తాడేపల్లి, ఉండవల్లి మార్గంలో నివాసాలకు భారీ డిమాండ్‌ వచ్చింది.. ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి.. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత ఆ ఇంటినే తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు వైఎస్‌ జగన్‌.. దీంతో అప్పటి నుంచి సాధారణ ప్రజలకు ఆ రోడ్‌లో ఆంక్షలు మొదలయ్యాయి. ఇప్పుడు వైసీపీకి అధికారం చేజారడంతో.. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చాయి.

అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నా..
నల్గొండ ఈద్గాలో బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక.. నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా మతసామరస్యాన్ని కాపాడుతున్నాం.. పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. జనాభా పెరుగుతున్న సందర్భంగా ఈద్గాను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే, ముస్లింలకు విద్యారంగంలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తాం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువతీ యువకులకు అవకాశాలు కల్పిస్తాం.. అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నాను అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

బెంగాల్ రైలు ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలానికి రైల్వే మంత్రి
పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జైల్‌పైగురి సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీల్దా రంగపాణి స్టేషన్‌లో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. కాంచనంజగ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ గాల్లోకి లేచింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేసి.. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్‌ను పంపుతున్నామని తెలిపారు. కతిహార్ డివిజన్‌లోని రంగపాణి-నిజ్‌బారి స్టేషన్‌ల మధ్య స్టేషన్‌లో నిలబడి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌లోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. తోపు బలంగా ఉండడంతో ఒక బోగీ మరో బోగీపైకి ఎక్కింది. ఈ ఘటన సమాచారంతో కతిహార్ రైల్వే డివిజన్‌లో కలకలం రేగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందగా.. 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌జెపికి చెందిన పలువురు సీనియర్ రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదవశాత్తు రిలీఫ్ రైలు, వైద్య వాహనాలు వెళ్లిపోయాయని సీనియర్ డీసీఎం ధీరజ్ చంద్ర కలిత తెలిపారు. కాంచన్‌జంగా రైలు ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగాల్ వెళ్లారు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు, ఆ తర్వాత రైళ్లను సజావుగా నడిపే వరకు ఆయన అక్కడే ఉంటారు.

డ్రాయర్ ఉతక్కుండా మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారా.. మీరు డేంజర్లో పడ్డట్లే
ఏంటి పైన హెడ్డింగు చూసి నవ్వుకుంటున్నారా. మీరు నవ్వుకున్న.. తిట్టుకున్న.. ఇదే నిజం అంటున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా కొంతమంది బ్యాచ్ లర్స్ హాస్టల్లో ఉండే పిల్లలు కొన్ని కారణాల చేతనో లేకపోతే బద్ధకం వల్లో కానీ వేసుకున్న అండర్ వేర్ ని ఉతక్కుండానే మళ్లీ మళ్లీ తిప్పి వేసుకుంటూ ఉంటారు. ఇది చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే అలా వేసుకున్న డ్రాయర్ ను ఉతక్కుండా పదేపదే వేసుకోవడం వల్ల చాలా చాలా ఇన్ఫెక్షన్స్ సోకుతాయట. అవి కాస్త పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయట. అందుకే అలాంటి సమస్యలు రాకుండా ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు డాక్టర్లు. నిజానికి ప్రతి ఎనిమిది గంటలకు.. ఒకసారి అండర్ వేర్ ని మార్చుకోవడం ఉత్తమమైన లక్షణం . కానీ ఆఫీసులకు వెళ్లే వాళ్లు, ఉద్యోగాలు చేసేవాళ్లు, వేరే పని మీద బయటకు వెళ్లే వాళ్లు అలా చేసుకోవడం కుదరకు. కాబట్టి కనీసం రోజుకు ఒక్కసారైనా సరే అండర్ వేర్ ని నీటుగా వాష్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.

83 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజ‌యం
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2024లో శ్రీలంక భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. 83 పరుగుల తేడాతో ఆ జ‌ట్టు నెద‌ర్లాండ్స్‌పై విజయం సాధించింది. గ్రూప్- డీలో భాగంగా ఇవాళ జ‌రిగిన మ్యాచ్‌లో.. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 201 పరుగులు కొట్టింది. లంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ 15 బంతుల్లో 30, హ‌స‌రంగ 10 బంతుల్లో 20 ర‌న్స్ చేయగా.. చ‌రిత్ అస‌లంక శ‌ర‌వేగంగా 21 బంతుల్లో 46 పరుగులు చేసి శ్రీలంకకు భారీ స్కోర్‌ను అందించాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అస‌లంక ఎంపికయ్యాడు. త‌న ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు కొట్టాడు. ఇక, ఓపెన‌ర్ మెండిస్ కూడా 46 పరుగులు చేశాడు. ఇక, 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెద‌ర్లాండ్స్ టీమ్ కేవ‌లం 118 ప‌రుగుల‌కు కుప్పకూలిపోయింది. నిజానికి ఓపెన‌ర్లు మైఖేల్ లివిట్‌, మ్యాక్స్ ఓదౌడ్‌లు 4.2 ఓవ‌ర్లలో 45 పరుగులు చేశారు. కానీ, ఓదౌడ్ అవుట్ అయ్యాక.. నెద‌ర్లాండ్స్ టీమ్ బ్యాట‌ర్లు క్రీజ్‌లో ఎక్కువ సేపు ఉండలేక పోయారు. వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. నువాన్ తుషారా మూడు, ప‌తిర‌న రెండేసి వికెట్లు పడగొట్టారు.

రెచ్చిపోయిన తంజీమ్, ముస్తాఫిజుర్.. సూపర్-8కి బంగ్లాదేశ్..!
టీ20 ప్రపంచకప్ -2024లో బంగ్లాదేశ్‌ సూపర్‌-8కి చేరుకుంది. సెయింట్‌ లూసియా వేదికగా ఇవాళ నేపాల్ తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్‌ సూపర్‌-8 బెర్త్‌ ఖారారు చేసుకుంది. తొలుత నేపాలీ బౌల‌ర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లను నియంత్రించ‌డంలో విజయం సాధించారు. గ‌త మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాకు దాదాపు షాక్ ఇచ్చినంత పని చేసిన నేపాలీ బౌల‌ర్లు.. ఈ మ్యాచ్‌లోనూ బంగ్లాను కట్టడి చేసేశారు. బంగ్లాదేశ్ కేవ‌లం 106 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే, స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన నేపాల్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బంగ్లా బౌల‌ర్ల ధాటికి కేవ‌లం 85 పరుగులకే కుప్పకూలిపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ‌, ముస్తాఫిజుర్ చెల‌రేగిపోయారు. తంజిమ్ హ‌స‌న్ త‌న కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్‌ వేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. అత‌ను తన 4 ఓవర్లలో 21 డాట్ బాల్స్ వేశాడు. మరో బౌల‌ర్ ముస్తాఫిజుర్ రహమాన్ కూడా నేపాలీ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 4 ఓవర్లలో ఏడు పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడ‌ు.. నేపాల్ ఓ ద‌శ‌లో 26 రన్స్ కే 5 వికెట్లను కోల్పోయింది. బ్యాట‌ర్ కుషాల్ మ‌ల్లా, దీపేంద్ర సింగ్‌లు 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కుషాల్ 27, దీపేంద్ర 25 పరుగులు చేశారు.

అటవీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్న రవితేజ..?
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ”మిస్టర్ బచ్చన్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.దీనితో “మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి,ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ వరప్రసాద్ నిర్మిస్తున్నారు.వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా నటించాడు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత రవితేజ సామజవరగమన సినిమాతో మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న భాను బొగ్గవరపు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రీసెంట్ గా ఆ సినిమా అధికారికంగా ప్రారంభం అయింది.ఈ సినిమా రవితేజ 75 వ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ధమాకా సినిమాతో హిట్ పెయిర్ గా నిలిచిన వీరి కాంబోలో మరో సినిమా వస్తుండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా బిగ్గెస్ట్ పీరియాడిక్ స్టోరీతో అరకు అటవీ బ్యాక్ డ్రాప్ లో సాగనుందని సమాచారం.ఈ చిత్రాన్ని సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ తెరకెక్కిస్తున్నారు.

స్పిరిట్ మూవీలో విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ హీరో..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  మేకర్స్ నిర్వహించారు.ఈ ఈవెంట్ కు సంబంధించి ఇతర వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత ప్రభాస్ యానిమల్ మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాకు “స్పిరిట్” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సందీప్ ఈ సినిమాను అక్టోబర్ 2024 న ప్రారంభించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తీసుకోనున్నట్లు సమాచారం.ఇటీవలే అక్షయ్ కు స్టోరీ వినిపంచగా బౌండెడ్ స్క్రిప్ట్ తో మరోసారి కలిసి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.యానిమల్ సినిమాలో విలన్ పాత్రకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ అద్భుతంగా నటించాడు.స్పిరిట్ సినిమాలో కూడా విలన్ పాత్ర హీరో పాత్రను డామినెటే చేసేలా వుంటుందట.అయితే అక్షయ్ కుమార్ కు సందీప్ బౌండెడ్ స్క్రిప్ట్ నచ్చకపోతే అక్షయ్ కుమార్ బదులుగా మరో స్టార్ హీరో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.