NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఎల్లుండి ఢిల్లీకి డిప్యూటీ సీఎం పవన్‌..
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.. డిప్యూటీ సీఎం పదవితో పాటు.. కీలకమైన శాఖలను తీసుకున్న పవన్‌.. వరుసగా ఆ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, ఏ శాఖలో చూసినా నిధులు లేవంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి.. జలజీవన్‌ మిషన్‌పై మాట్లాడుతున్న పవన్.. ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందజేయడం తన లక్ష్యం అంటున్నారు.. అందులో భాగంగా.. ఢిల్లీలో జరగనున్న జలజీవన్‌ మిషన్‌ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు పవన్‌ కల్యాణ్‌.. కాగా, ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని తీసుకొచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఈ పథకంలో క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారనే దానిపై కేంద్రం దృష్టి సారించింది.. అందులో భాగంగా.. ఈ నెల 19వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. ఈ భేటీకి ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్ హాజరుకానున్నారు.. అయితే, గత ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోలేదని.. రాష్ట్ర వాటా నిధులు సరిగా కేటాయించని కారణంగా పనుల నిర్వహణపైనా తీవ్ర ప్రభావం చూపిందని.. తను నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో పవన్‌ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. ప్రతిపాదిత పనుల్లో ఇప్పటికీ సగం కూడా పూర్తికానట్టు పవన్‌ గుర్తించారు.. ఇక, ఈ పథకాన్ని గాడిలో పెట్టి.. ప్రతీ ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్‌ కల్యాణ్‌.. తొలిసారి కేంద్ర మంత్రితో నిర్వహించే సమీక్ష సమావేశానికి హాజరుకానుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు.. మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు తిరిగి రానున్నారు.. ఎల్లుండి పవన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు.

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కాలేజీల వద్దే ఉన్న సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ప్రభుత్వం కసరత్తు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది.. వివిధ కారణాలతో కాలేజీల వద్దే ఉండిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.. మొత్తం ఎంత మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల వద్ద ఉన్నాయోనని మంత్రి నారా లోకేష్‌ ఆరా తీస్తున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్దే ఉండిపోయాయని మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. అయితే, 8 లక్షల మంది బాధిత విద్యార్థులకు వారి సర్టిఫికెట్లను ఒకేసారి ఇప్పించేలా కసరత్తు చేస్తోంది సర్కార్.. పెండింగ్‌లో ఉన్న రూ. 3500 కోట్ల మేర విద్యా దీవెన సొమ్మును చెల్లించేలా ప్లాన్‌ చేస్తున్నారు.. అయితే, గత ప్రభుత్వం విద్యా దీవెన చెల్లింపులు పెండింగులో పెట్టడంతో సర్టిఫికెట్లను ఆయా కాలేజీలు.. వారి దగ్గర పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. త్వరలో కాలేజీ యాజమాన్యాలతో సమావేశం కానున్నారట మంత్రి నారా లోకేష్. మొత్తంగా ఆరు విడతల్లో విద్యా దీవెన బకాయిలు చెల్లించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.

విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై ప్రభుత్వం సీరియస్.. కీలక ఆదేశాలు..
విశాఖ తీరంలో భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి కొండలు రియల్ ఎస్టేట్ లే అవుట్ గా మారిపోతున్నాయి. సర్వే నెంబర్ 118/5లో అక్రమ తవ్వకాలు వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది.. అయితే, పర్యావరణ విధ్వంసం పై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. GVMC టౌన్ ప్లానింగ్ విభాగం అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు, గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GVMC) నుంచి పొందిన అనుమతులను ఉల్లంఘించి.. కొండలను కొల్లగొడుతున్నట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. ఎర్రమట్టి కొండల్లో తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ప్రాథమికంగా తేల్చారు అధికారులు.. ఇక, ప్రభుత్వ ఆదేశాలతో వివాదాస్పద తవ్వకాలను పరిశీలించారు జాయింట్‌ కలెక్టర్‌ మయూర్ అశోక్.. మొత్తంగా అనుమతులను ఉల్లంఘించి కొండలను కొల్లగొడుతున్నట్టు అధికారులు గుర్తించారు.. ఎర్రమట్టి కొండల్లో తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ప్రాథమికంగా తేల్చడంతో.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది..

రేపు రాష్ట్ర బ్యాంకర్లతో సీఎం సమావేశం.. రైతులను ఉద్దేశించి సందేశం..
ప్రజాభవన్ లో రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్దాయి బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న సమావేశానికి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్దిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, తదితరులు పాల్గొననున్నారు. లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ అమలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. రూ. లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో అన్ని మండల కేంద్రాలలో ఉన్న రైతు వేదికల్లో రైతుల సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇవ్వనున్నారు. రైతు వేదికల దగ్గర సంబరాలకు పిలుపు నిచ్చారు. రేపు సాయంత్రానికి రైతుల ఖాతాలోకి లక్ష రుణమాఫీ చేయనున్నారు. ఒకటి, రెండు రైతులతో సీఎం స్వయంగా మాట్లాడనున్నారు. ఇక రాష్ట్రంలో రుణమాఫీ అమలులో భాగంగా తొలి విడతగా రూ.లక్ష మేర రుణాలున్న రైతుల ఖాతాల్లో రేపు (గురువారం) నగదు జమ జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రుణమాఫీ లబ్ధిదారులతో కలిసి సంబురాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మొన్న గుజరాత్‌.. నేడు ముంబై.. రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో తొక్కిస‌లాట..
ప్రభుత్వాధినేతలు ఎన్ని చెబుతున్నా.. ఎన్ని సంస్థలు వస్తున్నా.. నిరుద్యోగం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది.. మొన్నకు మొన్నే గుజరాత్ రాష్ట్రంలోని భారుచ్ జిల్లా అంకాళేశ్వర్ సిటీలో.. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలిరావడంతో.. తోపులాట.. తొక్కిసలాట జరిగిన విషయం మరవక ముందే.. ఇప్పుడు అలాంటి ఘటన ముంబైలో చోటు చేసుకుంది.. ఎయిర్‌ ఇండియా రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌కు పెద్ద ఎత్తున నిరుద్యోగుల రావడంతో అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది.. ఎయిర్ ఇండియా వాకిన్‌లో జరిగిన తొక్కిస‌లాట‌ విషయానికి వస్తే.. ఎయిర్‌పోర్ట్ లోడ‌ర్ల కోసం .. వాకిన్ ఇంట‌ర్వ్యూలో పెట్టింది. 2 వేలకు పైగా పోస్టుల కోసం జ‌రిగిన వాకిన్‌కు దాదాపు 25 వేల మందికి పైగా నిరుద్యోగులు తరలివచ్చారు.. దీంతో ఎయిర్‌పోర్టు వ‌ద్ద ప‌రిస్థితి అదుపు త‌ప్పింది… యువకుల మధ్య తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది.. 2,216 ఖాళీల కోసం 25,000 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు వచ్చారు.. వారాన్ని నియంత్రించడం ఎయిర్ ఇండియా సిబ్బందికి కష్టంగా మారిపోయింది.. ఫారమ్ కౌంటర్‌లను చేరుకోవడానికి దరఖాస్తుదారులు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు.. అంతేకాదు.. దరఖాస్తుదారులు.. ఆహారం.. మంచినీళ్లు కూడా లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది..

అంతా అబద్ధం.. ఆ యువకుడిని ఏడు సార్లు కాదు ఒక సారే పాము కరిచింది
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఓ యువకుడిని 7 సార్లు పాము కాటు వేసిన ఉదంతం నమోదైంది. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడిని ఒక్కసారి మాత్రమే పాము కాటు వేసినట్లు విచారణలో తేలింది. అయితే అనారోగ్యం కారణంగా ఆ యువకుడు పాము తనను పదే పదే కాటేస్తోందని అనుకుంటూనే ఉన్నాడు. ఇందుకోసం ఆసుపత్రికి కూడా వెళ్తూనే ఉన్నాడు. వైద్యులు కూడా చికిత్స కొనసాగించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఆరోగ్య శాఖ జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. యువకుడికి స్నేక్ ఫోబియా ఉన్నట్లు తేలింది. దీనిపై విచారణకు జిల్లా ముఖ్య ఆరోగ్య అధికారి ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్సపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫతేపూర్‌లోని సౌరా గ్రామానికి చెందిన వికాస్ దూబే 40 రోజుల్లో ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడని పేర్కొన్నాడు. ఈ ఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా శాస్త్రవేత్తలు, వైద్యుల్లో చర్చనీయాంశంగా మారింది.

పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. ఎనిమిది మంది సైనికులు, 10మంది ఉగ్రవాదులు మృతి
పాకిస్థాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో 10 మంది సైనికులతో సహా కనీసం 15 మంది మరణించారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మొత్తం 13 మంది దాడికి పాల్పడ్డారని పాక్ సైన్యం కూడా ప్రకటించింది. మిలిటెన్సీ పీడిత డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని గ్రామీణ ఆసుపత్రిపై ఉగ్రవాదులు మంగళవారం దాడి చేయడంతో ఇద్దరు మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఇద్దరు పిల్లలు, ఒక సెక్యూరిటీ గార్డు మరణించినట్లు ఆర్మీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలోని కంటోన్మెంట్ ప్రాంతంపై నిన్న తెల్లవారుజామున 10 మంది ఉగ్రవాదుల బృందం దాడి చేసి ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని ISPR ఒక ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదుల దాడిని భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, దీంతో పేలుడు పదార్థాలతో కూడిన ఉగ్రవాదుల వాహనం కంటోన్మెంట్ గోడను ఢీకొట్టిందని ప్రకటన పేర్కొంది.

వెండి కూడా బంగారమైంది.. లక్ష రూపాయలు దాటేసింది!
గత కొద్ది నెలలుగా బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ పోతున్నాయి. ధరల పెరుగుదలో బంగారం, వెండి.. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ ఆల్‌టైమ్ హైకి చేరుకోగా.. కిలో వెండి ఏకంగా లక్ష దాటేసింది. ఏడాది క్రితం కిలో వెండి ధర రూ.50 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.1,00,000 దాటింది. దాంతో వెండి కూడా బంగారమైంది. ఒకప్పుడు బంగారం కొనాలంటే భయపడే జనాలు.. ఇప్పుడు వెండి అన్నా కూడా బెంబేలెత్తిపోతున్నారు. హైదారాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు (జులై 17) రూ.1,00,500గా ఉంది. ఈరోజు కిలో వెండిపై రూ.1000 పెరిగింది. మూడు రోజుల క్రితం రూ.95,500గా ఉన్న కిలో వెండి ధర.. ఈరోజు లక్ష దాటేసింది. ఈ మూడు రోజుల్లో కిలో వెండి ధర రూ.5 వేలు పెరిగింది. గతంలో లక్ష వరకు వచ్చిన వెండి.. ఇటీవలి రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ షాక్ ఇస్తూ లక్ష దాటింది. పెరుగుతున్న ధరలు చూసి.. కొనుగోలుదారులు షాపుల వైపు చూడడం కూడా మానేశారు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి బుధవారం రూ.96,000గా నమోదైంది.

నేను ప్రతిరోజు ఓడిపోతాను కానీ.. గౌతమ్‌ గంభీర్‌ ఎమోషనల్ వీడియో!
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడైన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఆ జట్టు అభిమానులకు భావోద్వేగ వీడ్కోలు నోట్‌ను పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి.. ‘కోల్‌కతా నాతో రా.. కొత్త వారసత్వాలను సృష్టిద్దాం. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. వీడియోలో కోల్‌కతా నగరం, కేకేఆర్‌ జెండా, ఈడెన్ గార్డెన్స్ మైదానం, కేకేఆర్‌ అభిమానులను చూపిస్తూ.. తన అనుబంధాన్ని గుర్తు చేస్తుకున్నాడు. భారత జట్టు కోచ్‌గా నియమితుడవ్వడంతో కేకేఆర్‌ మోంటార్‌ బాధ్యతల నుంచి గౌతీ వైదొలిగాడు. ఈ నేపథ్యంలో ఎమోషనల్ గుడ్ బై చెప్పాడు. వీడియో ఈడెన్‌ గార్డెన్స్‌లో మొదలవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 2024 కేకేఆర్‌ తరఫున గౌతమ్ గంభీర్ జర్నీకి సంబంధించిన అంశాలను చూపించారు. స్రిప్ట్ దినేష్ చోప్రా రాయగా.. రితిక భట్టాచార్య ఎడిటర్‌గా వ్యవహరించారు. వీడియోకు కేకేఆర్‌ టీమ్, షారూక్‌ ఖాన్‌, భారత క్రికెట్ జట్టు అకౌంట్లను గౌతీ ట్యాగ్ చేశాడు. ‘మీరు నవ్వితే నేను నవ్వుతాను.. మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను.. మీరు ఓడితే నేను ఓడిపోతాను.. మీరు కల కంటే నేను కల కంటాను.. మీరు సాధిస్తే నేను సాధిస్తాను. నేను మిమ్మల్ని నమ్ముతాను. కోల్‌కతా.. నేను మీలో ఒకడిని. మీ కష్టాలు నాకు తెలుసు, ఎక్కడ బాధ కలుగుతుందో తెలుసు. తిరస్కరణలు నన్ను బాధించాయి కానీ నేను మీలాగే నమ్మకంతో పైకి లేచాను. నేను ప్రతిరోజు ఓడిపోతాను కానీ మీలాగే ఓటమిని అంగీకరించను. పాపులర్‌ కావాలని అంటాను కానీ నేను విన్నర్‌గా ఉండాలని చెబుతా’ అని గంభీర్ పేర్కొన్నాడు.

విడుదలై ఫస్ట్ లుక్ విడుదల..సేతుపతి విశ్వరూపం ..!
సూరి హీరోగా మారి  తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో  నటిచింన సంగతి విదితమే. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో  సూరి నటనకు మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి. కాగా విడుదలై  చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు  దర్శకుడు వెట్రిమారన్. మొదటి భాగం గతేడాది రిలీజ్ కాగా పార్ట్- 2 అనుకొని కారణాల వలన ఆలస్యం అవుతూవస్తోంది. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విడుదలై పార్ట్ -2 ఫస్ట్ లుక్ పోస్టర్ లను  రిలీజ్  చేసింది నిర్మాణ సంస్థ. ఒక పోస్టర్ లో  పొలంలో  కత్తి పట్టి పరిగెడుతూ  శత్రువులను వేటాడుతున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే విజయ్ సేతుపతి క్యారెక్టర్ తెలియజేసే విధంగా లుక్ ను రిలీజ్ చేసారు. ఇక రెండవ పోస్టర్ లో సినిమాలో తన భార్య పాత్ర పోషిస్తున్న మంజు వారియర్ తో సైకిల్ పట్టుకుని నిలబడిన పోస్టర్ ను విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలోని  ఫ్లాష్ బ్యాక్ లోని విజయ్ సేతుపతి లుక్ కోసం డే ర్యాగింగ్ టెక్నాలజీని ఉపయోగించినట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా రెడ్ జెయింట్ మూవీస్, గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ, ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. విడుదలై ఫస్ట్ లుక్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. షూటింగ్ ఫైనల్ దశలో ఉందని పోస్టర్ లో పేర్కొన్నాడు దర్శకుడు వెట్రి మారన్. వీలైనంత త్వరలో షూటింగ్ ముగించి విడుదల చేసేలా ప్లాన్ చేస్తుంది రెడ్ జెయింట్ ఫిలిమ్స్.

కార్తీ సర్దార్ షూటింగ్ లో ప్రమాదం.. పలవురికి తీవ్ర గాయాలు..!
తమిళనాడు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కార్తీ కథానాయకుడిగా గతంలో సర్దార్ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర ఎండ్ లో సర్దార్ -2 ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపుగా సర్దార్ -2ను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు పీఎస్ మిత్ర‌న్ . కాగా అందుతున్న సమాచారం ప్రకారం సర్దార్ -2 షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోరాట సన్నివేశాలు తెరకెక్కించే సమయంలో ఈ ఘటన జరిగింది. యాక్షన్ సీన్స్ తీస్తుండగా స్టంట్ మ్యాన్ ఎజుమలై దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి కిందపడి మృతి చెందాడు. మరో ఇద్దరు అసిస్టెంట్ స్టంట్ మ్యాన్ లకు గాయాలుయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్తీ షూటింగ్ స్పాట్ లో ఉన్నారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఎజుమలై మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గతంలో భారతీయుడు -2 షూటింగ్ ప్రమాదంలో ఫైట్ మాస్టర్ మృతి చెందాడు. సర్దార్ షూటింగ్ ప్రమాదంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టంట్ మ్యాన్ ఎజుమలై మృతి పట్ల సంతాపం తెలియజేసింది యూనిట్. ఇటీవలటాలీవుడ్ లోను షూటింగ్ లో ప్రమాదాలు జరిగాయి.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర షూటింగ్ లో తేనెటీగల దాడిలో దాదాపు 20 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఆసుపత్రి పాలయ్యారు.