NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో భారీగా బదిలీలు.. మార్గదర్శకాలపై రెడీ..!
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో బదిలీలు చేపట్టనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇక, బదిలీల మార్గదర్శకాలపై తుది కసరత్తు జరుగుతోంది.. ఆఫీస్ బేరర్ల పేరుతో బదిలీలను తప్పించుకునేలా కొందరు వైసీపీ అనుకూల ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.. ఆఫీస్ బేరర్లకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి వెసులుబాటు కల్పించే జీవోను అడ్డం పెట్టుకుంటున్నారట పలువురు ఉద్యోగులు. అయితే, ఉద్యోగ సంఘాలిచ్చే ఆఫీస్ బేరర్ల పేర్లతో ఇచ్చే లెటర్లను ఏ విధంగా కట్టడి చేయాలనే అంశంపై తర్జన భర్జన జరుగుతోందట.. ఆఫీస్ బేరర్ల లెటర్ల కోసం ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాలని ఆశ్రయిస్తున్నారు పలువురు వైసీపీ అనుకూల ఉద్యోగులు. ఐదేళ్ల నుంచి ఒకే చోట పాతుకుపోయి.. ఇప్పుడు ఆఫీస్ బేరర్ల లెటర్ల కోసం ఉద్యోగ సంఘాల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.. అయితే, సాధారణ ఉద్యోగుల బదిలీలకు ఇబ్బంది కలిగించేలా ఆఫీస్ బేరర్ల లెటర్లు మారతాయే ఆందోళన వ్యక్తం అవుతోంది.. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ఉన్నాయి.. ఆఫీస్ బేరర్ల లెటర్ల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులు బదిలీలు తప్పించుకునే అవకాశం లేకపోలేదు.. మరోవైపు, సంఘాల్లో పని చేయని ఉద్యోగులకు సైతం ఆఫీస్ బేరర్ల లెటర్లు ఇచేస్తున్నాయట కొన్ని ఉద్యోగ సంఘాలు. ఆఫీస్ బేరర్లమంటూ ఉద్యోగులిచ్చే లెటర్లను స్క్రూట్నీ చేసే వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు.. ఆఫీస్ బేరర్ల లెటర్లను కట్టడి చేయకుంటే బదిలీల విషయంలో ప్రభుత్వ ఉద్దేశ్యాలు నెరవేరయని అంటున్నారు ఉద్యోగులు.

దట్టమైన పొదల్లో తల్లి ఆత్మహత్య.. 2 రోజులు మృతదేహంతోనే నరకం చూసిన చిన్నారి..!
దట్టమైన పొదల్లో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.. తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకుంది.. అమ్మ ఒడిలో సేదతీరుతూ హాయిగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి.. ఏకంగా రెండు రోజుల పాటు నరకం చూసింది.. దట్టమైన పొదల్లో.. తల్లి మృతదేహం వెనుకే వేలాడింది.. ఆకలి తట్టుకోలేక ఆ చిన్నారి ఎంత అలమటించిపోయిందో.. ఎవరూ కనిపించక.. రెండు రోజుల పాటు ఎంత భయంతో వణికిపోయిందో.. చివరకు తల్లి జోలె నుంచి కిందకు జారి.. పొదల నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు పొక్కింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ బొండ్యగూడ గ్రామానికి చెందిన పాంగి పద్మ (25).. అరకులోయ మండలం పద్మాపురానికి చెందిన కొండాను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు.. వారిలో రెండేళ్ల చిన్న కుమార్తెను వెంటపెట్టుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. పానిరంగనీలో నివసిస్తున్న పెదనాన్న కుమార్తె ఇంటికి వెళ్లింది పద్మ.. బుధవారం తన సోదరి ఇంటికి వెళ్లిన ఆమ.. అందరితో కలిసి భోజనం చేసింది. ఇక, ఇంట్లోవాళ్లు పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పద్మ కనిపించలేదు. దీంతో.. వారు పద్మ తన ఇంటికి వెళ్లిపోయిందేమోనని భావించారు. అయితే, రెండు రోజుల తర్వాత చివరకు శుక్రవారం రోజు ఉదయం రెండేళ్ల చిన్నారి పానిరంగిని గ్రామ సమీపంలో ఏడ్చుకుంటూ రావడంతో వారు చుట్టుపక్కల వెతికారు. హైవే పక్కన సమీపంలో పొదల్లో చెట్టుకు వేలాడుతూ పద్మ మృతదేహం కనిపించింది. పాపని తన జోలెలో చుట్టుకుని పద్మ ఉరివేసుకొని మృతి చెందినట్టు.. ఆ పరిస్థితులను గమనించినవారు చెబుతున్నారు.. రెండు రోజులపాటు చిన్నారి ఎంత బాధకు గురైందో ఎంతలా ఏడ్చిందో . చివరకు ఎలాగోలా జోలి నుంచి విడిపడి చిన్నారి రోడ్డుపైకి చేరుకుంది. ఈ హృదయ విదారక సంఘటనను తలుచుకుంటేనో అందరి హృదయాలను కలచివేస్తోంది.. చిన్నారి పుష్పను దోమలు, పురుగులు కుట్టడంతో అనారోగ్యానికి గురైంది. పోలీసులు అనుమానస్పద మృతిగా చేసి నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.. క్లూస్ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించే పనిలో పడిపోయారు..

అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి.. స్పీకర్‌గా నేను అవకాశం ఇస్తా..
వైఎస్‌ జగన్ ప్రతిపక్ష హోదా కోరినప్పటికీ చట్టపరిధిలో వ్యవహరిస్తామ్మన్నారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు‌.. తిరుపతి ఎస్వీ జూపార్కును సందర్శించిన స్పీకర్.. ఎమ్మెల్యేతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ కాని.. వైసీపీ ఎమ్మెల్యే లు కానీ.. మీడియాలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కోరితే సభాపతిగా తాను తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు అయ్యన్న. ఇక, అసెంబ్లీ లో 80 మంది కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారని.. వారందరికీ ప్రత్యేక శిక్ష తరగతులు నిర్వహిస్తామన్నారు‌‌. ‌రాష్టంలో పచ్చదనం పెంపొందించడానికి చర్యలు చేపడుతామని.. అపార్ట్‌మెంట్, మిద్దిల తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేలా సూచనలు చేస్తాన్నారు‌ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.

వైసీపీకి బిగ్‌ షాక్‌..! మొన్న పదవులకు.. నేడు ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి రాజీనామా..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్‌ తగిలినట్టు అయ్యింది.. మాజీ మంత్రి ఆళ్ల నాని.. వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. కొద్దిరోజుల క్రితం ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. నియోజకవర్గ ఇంఛార్జ్‌ పోస్టుకు రాజీనామా చేశారు ఆళ్ల నాని.. ఇక, ఈ రోజు వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత బాధ్యతలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్దికాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి నిర్ణయించుకోవడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.. భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నట్టుగా పేర్కొన్నారు మాజీ మంత్రి ఆళ్లనాని.. గతంలో.. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ బాధ్యతలకు రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇచ్చాను,, పార్టీకి రాజీనామా అనేది నేను ప్రస్తావించలేదన్నారు ఆళ్ల నాని.. అయితే, నా వ్యక్తిగత కారణాలవల్ల, వ్యక్తిగత బాధ్యతల వల్ల… ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అన్నారు..

కూల్సుంపుర పాఠశాలను సందర్శించిన పొన్నం ప్రభాకర్‌..
కార్వన్ నియోజకవర్గంలోని కూల్సుంపురలో జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటించారు. జిల్లా పరిషత్ స్కూల్ లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. 10 వ తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు జరిగిన పాఠ్యాంశాల పై ఆరా తీశారు. ఈసారి పదవ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక తరగతులను పరిశీలించి విద్యార్థులతో కింద కూర్చుని వారితో మాట్లాడారు. వివిధ సబ్జెక్టులలో వారిని ప్రశ్నించారు. విద్యార్థులకు LSRW పై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులకు బేసిక్ వర్డ్స్ కూడా సరిగా చెప్పకపోవడంతో ఉపాధ్యాయులు పిల్లలకు బేసిక్ ఇంగ్లీష్ పై పట్టు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్.. ఏడు జిల్లాల్లో భారీ వర్ష సూచన..
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నుంచి పలుచోట్ల వర్షం కురిసింది. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తాజా హెచ్చరికల ప్రకారం మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, మెదక్ కుమురంభీం, హైదరాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. అలాగే కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం చోర్పల్లిలో పిడుగుపాటుకు అంజన్న యువకుడు మృతి చెందాడు.

సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్.. హరీష్ రావు ట్వీట్ వైరల్..
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నినాదాలతో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్‌ఎస్‌ నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీల చింపివేశారు. ఈ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫ్లెక్సీల చింపివేతపై హరీష్ రావు ట్వీట్ చేశారు. సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. వెంటనే ఈ ఘటనపై @TelanganaDGP గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.

‘దేశం ఆత్మపై దాడి’.. సీజేఐ వద్దకు చేరిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్య కేసు
కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వద్దకు చేరింది. ఆర్మీ కాలేజీకి చెందిన వైద్యుడి పిటిషన్‌తో సహా మూడు లేఖ పిటిషన్లు సీజేఐకి పంపబడ్డాయి. ఈ భయంకరమైన ఘటనపై సీజేఐ స్వయంచాలకంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు. ఇద్దరు పిటిషనర్లు సుప్రీంకోర్టు న్యాయవాదులు రోహిత్ పాండే, ఉజ్వల్ గౌర్ కాగా.. మూడో పిటిషనర్ పేరు డాక్టర్ మోనికా సింగ్. ఆమె సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ కాలేజీలో పని చేస్తున్నారు. రోహిత్ పాండే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, ఉజ్వల్ గౌర్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నారు. ఈ కేసు చాలా భయంకరమైనదని, అరుదైనదని సుప్రీంకోర్టు లాయర్లు రోహిత్ పాండే, ఉజ్వల్ గౌర్ అన్నారు. ఇది మన దేశ ఆత్మపై అణచివేత అని, ఒక వైద్యుడిపైనే కాదు మానవత్వంపైనా దాడి జరిగిందన్నారు. ఈ విషయంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ తగిన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అనాగరిక ఘటన యావత్ దేశం ఆత్మను కదిలించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధిత కుటుంబం రోధిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయిందన్నారు. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు మాటలు చాలవన్నారు. ఒక దేశంగా మనం నిలబడాలని, ఈ విషయంలో సత్వర విచారణ, న్యాయం జరిగేలా చూడాలని కోరారు.ఈ విషయంలో న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకుని ప్రజలకు సందేశం పంపాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక ఘటనలను సహించేది లేదు. స్త్రీ ఆత్మగౌరవం, చట్టాన్ని పరిరక్షించడం కోసం చర్య అవసరం. ఈ కేసును సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంచాలకంగా పరిగణలోకి తీసుకోవాలని డాక్టర్ మోనికా సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో భద్రతకు సంబంధించి కోర్టు కూడా తగిన సూచనలు ఇవ్వాలని అన్నారు. ఆసుపత్రుల రక్షణకు కేంద్ర బలగాలు అవసరమన్నారు.

బాలికపై స్కూల్‌ టీచర్‌ అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో 14 ఏళ్ల బాలిక ఉపాధ్యాయుడిచే అత్యాచారానికి గురై మరణించింది. 14 ఏళ్ల బాధితురాలు, సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలోని నివాసి, వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించింది. నిందితుడు విశాంబర్‌ ఇంకా పరారీలో ఉన్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడని, గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెను పిలిచాడని తెలిపారు. అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమానానికి భయపడి బాధితురాలు ఏమీ చేయలేదని, ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను బంధువుల వద్దకు వెళ్లేందుకు ఛత్తీస్‌గఢ్‌కు పంపగా, అక్కడ ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి అలాగే ఉంది. దీంతో బాధితురాలు మౌనం వీడి జరిగిన విషయాన్ని అత్తకు చెప్పగా.. ఆమె ఆస్పత్రిలో చేర్చింది.

స్వదేశానికి విచ్చేసిన భారత స్టార్‌ రెజ్లర్‌.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్
భారత స్టార్‌ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వినేష్ ఢిల్లీకి తిరిగి రావడానికి ముందే, భారత రెజ్లర్ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రెజ్లర్‌ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు ఆమె ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే బిగ్గరగా చీర్స్‌తో స్వాగతం పలికారు. అభిమానులను చూసిన వినేశ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు వినేష్‌కు మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్, బజరంగ్ పునియా స్వాగతం పలికారు. వారు పారిస్ వినేశ్‌ను కౌగిలించుకొని అభినందించారు. పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫోగట్‌.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా వినేశ్‌ ఫోగట్‌కు సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టిపడేసింది. కానీ వినేశ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచింది.

జెర్సీలు మార్చుకున్న మను, కైఫ్.. వైరల్ పిక్స్..
భారత స్టార్ షూటర్ మను భాకర్ ఢిల్లీలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌తో కలిసి జెర్సీలను మార్చుకున్నారు. గురువారం నాడు కైఫ్, భాకర్ తమ ఆటోగ్రాఫ్ ఉన్న జెర్సీలను మార్చుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం సాధించిన పతక విజయాన్ని కలిసి జరుపుకున్న మను భాకర్ అలాగే మిగిలిన భారత బృందం దేశభక్తి మూడ్‌ లో ఉన్నారు. బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా కూడా ఈ కార్యక్రమానికి హాజరై మను భాకర్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. లండన్ 2012లో భారత కాంస్య పతక విజేత కూడా హాజరై మహ్మద్ కైఫ్‌ తో కలిసి చిత్రాలను క్లిక్ చేశాడు. ఢిల్లీ హోటల్‌లో వేడుకకు ముందు లోక్ కళ్యాణ్ మార్గ్‌ లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భారత బృందం సమావేశమైంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రధాని మోదీ సత్కరించారు. భారత పురుషుల హాకీ జట్టు, అమన్ సెహ్రావత్ తమ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి సంతకం చేసిన జెర్సీని బహుమతిగా అందించారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, సరబ్జోత్ సింగ్, అమన్ సెహ్రావత్, స్వప్నిల్ కుసాలే, విజేత హాకీ జట్టు సభ్యులతో ప్రధాని మోదీ ఫోటోలు దిగారు.

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పూజతో మొదలైన ప్రభాస్ సినిమా.. లుక్ ఇదే..
టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు అను రాఘవపూడితో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. నేడు శనివారం ఆగస్టు 17 సినిమాను పూజా కార్యక్రమంతో మొదలుపెట్టారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ పూజ కార్యక్రమానికి సంబంధించిన ప్రభాస్ న్యూ లుక్ వైరల్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. ఇందులో భాగంగానే సాయంత్రం 4:05 లకు సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండనున్నట్లు ఓ వెరైటీ పోస్టును పోస్ట్ చేశారు. చూడాలి మరి మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించి ఎటువంటి వివరాలను తెలుపబోతున్నారో. తాజాగా కల్కి సినిమాతో హీరో ప్రభాస్ భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

సాయిపల్లవికి అన్యాయం.. అర్హత ఉన్నా అందని అందలం
తాజాగా కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. అయితే ఈ సినిమా అవార్డుల్లో చాలా సినిమాలు తమ సత్తా చాటాయి. దక్షిణాదిలో కార్తికేయ-2, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ కన్నడ చిత్రం KGF 2, ఉత్తమ తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1, ఉత్తమ నటి నిత్యా మీనన్, ఉత్తమ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అవార్డులు అందుకున్నారు. అయితే ఈ అవార్డుల్లో ఓ హీరోయిన్‌కి అన్యాయం చేశారంటూ అవార్డులు నిర్వహించిన వారిపై ఆ హీరోయిన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హీరోయిన్ కి రెండు సార్లు అన్యాయం జరిగిందంటూ అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్ లో పూజా హెగ్డే, ఇప్పుడు నిత్యమీనన్ కు ఇద్దరికీ అవార్డులు ఇచ్చి తమ హీరోయిన్ కు అన్యాయం చేశారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి 2022 నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సాయి పల్లవికి అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ, లవ్ స్టోరీ ఆ సంవత్సరం నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి నటన నెక్స్ట్ లెవెల్. కానీ ఆమె వెనుకబడి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ హీరోయిన్ పూజా హెగ్డేకి అవార్డు వచ్చింది. ఆ సమయంలో సాయి పల్లవి అభిమానులు పూజా హెగ్డేపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు పూజా హెగ్డే డబ్బుతో అవార్డును కొనుగోలు చేశారని విమర్శించారు.