NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అమరావతిని ప్రపంచంలోనే టాప్‌-5 రాజధానుల్లో ఒకటిగా నిలుపుతాం..
మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది అమరావతేనని.. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు, పనులు పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. సెక్రటేరియట్,అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తామన్నారు. 3600 కి.మీ రోడ్లతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం చేపడతామని.. ఎలాంటి మార్పు లేదన్నారు. 217 చ.గజాల్లో గతంలో 48 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని.. అలా నిలుపుతామని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగుతుందన్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటలు ఆడిందని ఆయన విమర్శించారు. రైతుల కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. గతంలో తనకున్న అనుభవంతో ప్రపంచంలో టాప్‌-5లో ఒకటిగా ముందుకు తీసుకెళతామన్నారు. గతంలో మా ప్రభుత్వంలో లో 48 వేల కోట్లతో అమరావతి కోసం టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టామన్నారు. ఏ ఒక్క చిన్న లిటిగేషన్ లేకున్నా.. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసిందన్నారు. భూములిచ్చిన రాజధాని రైతులను గత ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. వైసీపీ అరాచక పాలనతో విసుగు చెంది ప్రజలు ఎన్డీఎకు అధికారం ఇచ్చారన్నారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. పదిహేను రోజుల్లో అధ్యయనం చేసి టైం బౌండ్ నిర్ణయిస్తామన్నారు. రాజధాని పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తామో చెబుతామని.. మూడు దశల్లో రాజధాని అమరావతిని నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించి అమలు చేశామన్నారు. రాజధానిలో తొలి ఫేజ్ పనులకు 48 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. మూడు ఫేజుల్లో కలిపి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతాయని.. రాజధాని పై కోర్టుల్లో ఉన్న కేసులపై స్టడీ చేసి సానుకూలంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజధానిలో రోడ్ల ధ్వంసం సహా దొంగతనాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కమిటీ వేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

 

వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్య కుమార్ యాదవ్.
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సత్య కుమార్ బాధ్యతల స్వీకరించారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై సంతకం చేశానని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమం సహా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎయిమ్స్ తరహాలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిమ్స్‌లో అందించే సేవలపై అధ్యయనం చేసి తదుపరి సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ నివారణ, సహా మత్తు బానిసైన వారి కోసం డీఎడిక్షన్ సెంటర్ల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం వైద్యంపై ఆర్బాటం ఆరాటం తప్ప పేదలకు చేసిందేమీ లేదన్నారు. వైద్యం కోసం కేంద్రం నుంచి వచ్చిన 60 నిధులనూ గత ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. వైద్య రంగాన్ని రాష్ట్రం తన వంతు వాటా ఇవ్వకుండా గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నాడు-నేడు,ఆరోగ్య శ్రీలో అనేక అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ,అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్య శ్రీ పేరిట కొన్ని ఆస్పత్రులకు, దళారులకు ధారాదత్తం చేసిందన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఆస్పత్రులకు రూ. 1500 కోట్ల నిధులు ఇవ్వకుండా బకాయి పెట్టారని.. గత ప్రభుత్వం ఆరోగ్యశాఖకే అనారోగ్యం తెచ్చిందని విమర్శలు గుప్పించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో గత ప్రభుత్వం నిబంధనలు పాటించలేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నింటినీ సరిచేస్తామన్నారు. వైద్యంలో ఏపీని మోడల్‌గా తీర్చిదిద్దేలా పనిచేస్తామన్నారు. చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో పని చేసి ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చుతామన్నారు. శాఖకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఉద్యోగులంతా పని చేయాలని సూచించారు. ఉన్నతాధికారులు ,సిబ్బంది కలసికట్టుగా పారదర్శకంగా , జవాబుదారీగా పని చేయాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపైనా వివిధ కీలక శాఖల పైనా ప్రతి అంశపైనా శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.

 

రెండో రోజూ మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’.. సమస్యలు విన్నవించిన ప్రజలు
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు మంచి చేసేందుకు రంగంలోకి దిగారు. శనివారం మంగళగిరి ఎమ్మెల్యేగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘ప్రజా దర్బార్’ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్‌. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. రెండో రోజూ ఆదివారం కూడా ప్రజా దర్బార్‌ను మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్‌ను కలిసి ప్రజలు సమస్యలను విన్నవించుకున్నారు. డీఎస్సీ-2008, జీవో నెం.39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని రెగ్యులర్ చేయాలని లోకేష్‌ను ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ కోరింది. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల తమ దృష్టికి తెచ్చే సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మంగళగిరి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రజా దర్బార్‌ను నిర్వహించాలని మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినపుడు మినహా ఉండవల్లిలో ఉన్నపుడు.. ప్రతిరోజూ ఉదయం నారా లోకేష్ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఓవైపు మంత్రిగా మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యేగా అందరికీ న్యాయం చేసే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు.

 

నా భార్యకు గుండె కుడివైపు ఉంది నాకొద్దు.. ఏం జరిగిందంటే..!
సాధారణంగా ప్రతి ఒక్కరి గుండె ఎడమవైపు ఉంటుంది. కానీ ఒక యువతి గుండె కుడి వైపున ఉంది. నిజం చెప్పాలంటే దేవుడు మనిషిని చేస్తాడు. ఆ దేవుడు చేసిన తప్పుకు ఆమె ఏం చేస్తుంది. తన తల రాత అనుకుని బతికేస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఆమెకు పెళ్లైంది. భార్య భర్త బాగానే కాపురం చేసుకున్నారు. ఇంతలోనే భర్తకు గుండె పగిలే వార్త వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కుడివైపు గుండె ఉందని తెలిసింది. ఇది తెలిసిన భర్త నువ్వు నాకు వద్దంటూ ఇంట్లోనుంచి బయటకు గెంటివేశాడు. దీంతో ఆ భార్య కోర్టు ఆశ్రయించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మంలోని జయనగర్ కాలనీలో నివసించే అబ్బనాపురి వెంకటేశ్వర్లు విజయలక్ష్మి కుమార్తె గంగాభవానిని బోనకల్లులో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తౌడోజు వెంకటేశ్వర్లు కుమారుడు భాస్కరాచారితో 2018లో వివాహం జరిపించారు.పెళ్లయిన 15 రోజులకే అత్తమామలు గంగాభవానిపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకే ఆమెకు గుండె కుడివైపు ఉందని ఆరోపిస్తూ ఆమెను పుట్టింటికి పంపించారు. 2019లో గంగాభవాని ఖమ్మం మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు తీర్పు వెలువడే వరకు మనోవర్తి ప్రతినెలా రూ.15 వేలు చెల్లించాలని ఆదేశించింది. భాస్కరాచారి స్పందించకపోవడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. మనోవర్తి ప్రతినెలా రూ.10 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా భాస్కరాచారి కుటుంబం పట్టించుకోలేదు. 2022లో ఖమ్మం కోర్టులో రాజీ కుదుర్చుకుని రూ.13 లక్షలు చెల్లించేందుకు పెద్దల ముందు అంగీకరించినా తర్వాత మొండి చేయి చూపారు. మనోవర్తిని డబ్బులు అడిగేందుకు తల్లి విజయలక్ష్మితో కలిసి గంగాభవాని శుక్రవారం బోనకల్లులోని మేనమామ ఇంటికి వెళ్లింది. గంగాభవానిపై అత్తమామలు వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గంగాభవాని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనకు అన్యాయం చేసి గాయపరిచిన భాస్కరాచారి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బోనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు.

 

నెల రోజులపాటు రైళ్ల సేవలు బంద్‌.. వివరాలు ఇవే..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలతో ఇవి నిన్నటి నుంచి నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. సాంకేతిక సమస్యల వివరాలు ప్రకటించనప్పటికీ, సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క ఆధునీకరణ జరుగుతుందని భావిస్తున్నారు. బాలాసోర్ వద్ద కోరమాండల్ విపత్తును దృష్టిలో ఉంచుకుని, అధికారులు దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు.
వివరాలు ఇవే..
* 17003 కాజీపేట-కాగజ్‌నగర్ రైలు ఈ నెల 17 నుండి జూలై 6 వరకు రద్దు చేయబడింది.
* 12757/58 కాగజ్నా గర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23 నుండి ఈ నెల 6 వరకు రెండు వైపులా రద్దు చేయబడింది.
* 12967 చెన్నై-జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 25, 30, జూలై 2,7 తేదీల్లో రద్దు చేయబడింది.
* 12968 జైపూర్-చెన్నై జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21,23,28,30, జూలై 5న రద్దు చేయబడింది.
* 12975 మైసూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 27, 29, జూలై 4, 6 తేదీల్లో రద్దు చేయబడింది.
* 12539 యశ్వంత్‌పూర్-లక్నో ఈ నెల 26, జూలై 3న రద్దు చేయబడింది.
* 12540 లక్నో-యశ్వంత్‌పూర్ ఈ నెల 28, జూలై 5 తేదీల్లో రద్దు చేయబడింది.
* 12577 భాగమతి-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 28న మరియు వచ్చే నెల 5న రద్దు చేయబడింది.
* 22619 బిలాస్‌పూర్-త్రివేండ్రం తిరునవెల్లి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25, జూలై 2 రద్దు చేయబడింది.
* 22620 త్రివేండ్రం-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు చేయబడింది.
* 22352 పాటలీపుత్ర-శ్రీమాతా వైష్ణో ఈ నెల 21, 28, జూలై 5వ తేదీల్లో రద్దు చేయబడింది.
* 22352 శ్రీమాత వైష్ణో-పాటలీపుత్ర ఈ నెల 24, జూలై 1, 8 తేదీల్లో రద్దు చేయబడింది.

 

ఉత్తరాఖండ్‌లో కాలుతున్న అడవులు.. 10 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో అడవుల్లో మంటలు అదుపు తప్పుతున్నాయి. నవంబరు నుంచి దాదాపు వెయ్యికి పైగా అగ్ని ప్రమాద ఘటనల్లో పచ్చదనంతో నిండిన సుమారు 1500హెక్టార్ల అటవీ భూమి కాలిపోయి ధ్వంసమైంది. బిన్సార్‌తో సహా వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు వైమానిక దళం హెలికాప్టర్ల సాయం తీసుకుంటున్నప్పటికీ మంటలను పూర్తిగా అదుపు చేయలేకపోయారు. నవంబర్ 2023 నుండి రాష్ట్రంలో 1,242 అటవీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,696 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ సంపద దెబ్బతిన్నది. అడవి మంటలను అదుపు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఏప్రిల్‌లో నైనిటాల్ జిల్లాకు చేరుకుంది. అదేవిధంగా మేలో కూడా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ గర్వాల్‌కు చేరుకుంది. రాష్ట్రంలో కుమావోన్ డివిజన్‌లో గరిష్టంగా 598, గర్వాల్ డివిజన్‌లో 532 వద్ద అటవీ మంటలు సంభవించాయి. వేడి పెరగడంతో అల్మోరా, రాణిఖేత్‌లలో మంటలు మళ్లీ అంటుకోవడం ప్రారంభమయ్యాయి. సాల్ట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఐటీఐ, విశ్వనాథ్, కతర్మాల్, దోటియాల్ సమీపంలోని అడవుల్లో ఇప్పుడు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. సాల్ట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని విశ్వనాథ్, కతర్మాల్, దోటియాల్ సమీపంలోని అడవులలో శనివారం కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోజంతా అడవి మండుతూనే ఉంది. కానీ పాలకసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదు. రోజంతా అడవులు మండుతూనే ఉన్నాయి. రాణిఖేత్‌లోని సౌనీ, రిచీ అడవులు కూడా మండుతూనే ఉన్నాయి. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

 

స్కాట్లాండ్‌పై ఆసీస్ విజయం.. ఊపిరిపీల్చుకున్న ఇంగ్లండ్ జట్టు
టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్‌, మార్కస్ స్టొయినీస్ రాణించడంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా విజయంతో ఇంగ్లండ్‌కు సూపర్‌-8 టిక్కెట్‌ లభించింది. అక్కడ, స్కాట్లాండ్ ప్రయాణం ముగిసింది. గ్రూప్-బీ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8కి చేరుకుంది. స్కాట్లాండ్‌ ఓటమితో ఇంగ్లండ్‌ ఈ గ్రూప్‌ నుంచి సూపర్‌-8కి చేరిన రెండో జట్టుగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చిన స్కాట్లాండ్ ఒక దశలో గెలుపు వైపు పయనించింది. కానీ హెడ్ 68, స్టొయినీస్ 59 మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో స్కాట్లాండ్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లకు 186 పరుగులు చేసి విజయం సాధించింది. సెయింట్ లూసియాలోని డారెన్ సమీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. 3 స్కోరు వద్ద స్కాట్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులకే మైఖేల్ జోన్స్ అగర్ బలి అయ్యాడు. రెండో వికెట్‌కు జార్జ్ మున్సీ (35), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (60) మధ్య 48 బంతుల్లో 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. వేగంగా ఆడుతూ, మెక్‌ముల్లెన్ స్కాట్లాండ్ తరపున T20 అంతర్జాతీయ క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. బ్రాండన్ 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో 2 ఫోర్లు, 6 సిక్సర్లు బాదారు. కెప్టెన్ రిచర్డ్ బెరింగ్టన్ 42 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బలమైన బౌలింగ్ లైనప్‌పై స్కాట్లాండ్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు తీశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాకు ఆరంభం చాలా పేలవంగా ఉంది. రెండు స్కోరు వద్ద డేవిడ్ వార్నర్ పెవిలియన్ బాట పట్టాడు. దీని తర్వాత కెప్టెన్ మిచెల్ మార్ష్ 8 పరుగులు చేసి తొందరగానే ఔటయ్యాడు. 11 పరుగుల వద్ద గ్లెన్ మాక్స్‌వెల్ అవుటైనప్పుడు జట్టు ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఆస్ట్రేలియా 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.దీని తర్వాత ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్ ఇన్నింగ్స్ చేపట్టారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 44 బంతుల్లో 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ట్రావిస్ హెడ్ 68 పరుగులు చేసి ఔట్ కాగా, మార్కస్ స్టోయినిస్ 29 బంతుల్లో 59 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. టిమ్ డేవిడ్ (24 నాటౌట్), మాథ్యూ వేడ్ (4 నాటౌట్) చివరికి 186 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశారు.

 

గుడ్ న్యూస్.. నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు..
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,500, 24 క్యారెట్ల ధర రూ.72,550 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 95,600 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,500, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,550 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,550 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,150. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,700 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,500, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,550 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే , వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 95,600 ముంబైలో 91,000 ఢిల్లీలో 91,000 బెంగుళూరు లో 91,000, అదే విధంగా హైదరాబాద్ లో 95,600 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

 

మద్యం ఎక్కువగా తాగటం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందా?
చాలామంది మద్యపానాన్ని హాబీగా ప్రారంభించి దానిని అలవాటుగా మార్చుకుంటారు. కానీ మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు పదే పదే చెబుతున్నారు. మద్యం సేవించడం మన ఆరోగ్యంపై అనేక తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని హెచ్చరించింది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంతోషకరమైన సమయమైనా, దుఃఖ సమయమైనా చాలా మంది మద్యం సేవించడానికి ఇష్టపడతారు. మొదట్లో సరదా.. తర్వాత అలవాటు.. తర్వాత వ్యసనం. మద్యం సేవించడం వ్యసనంగా మారితే, అది మరణానికి దారి తీస్తుంది. మీకు అతిగా మద్యం సేవించే అలవాటు ఉంటే, వీలైనంత త్వరగా దానిని మానేయాలి. తరచుగా మద్యం సేవించడం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఫెయిల్యూర్ కావచ్చు. కాలేయ వాపు కూడా సాధ్యమే. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్, ఇతర రసాయనాలను ఉత్పత్తి చేసే శరీరంలోని ఒక అవయవం. ఇది మద్యం సేవించడం ద్వారా ప్రభావితమవుతుంది. ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా మధుమేహం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేషనల్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, ఆల్కహాల్ గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అధిక ఆల్కహాల్ వినియోగం రక్తంలో కొవ్వు స్థాయిలను పెంచుతుంది, అంతేకాకుండా.. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కాల్షియం మరియు విటమిన్ డి శరీరంలో సరిగా పనిచేయవు. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా.. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యత పడిపోతుంది. ఫలితంగా సంతానలేమి సమస్య. కాబట్టి అనేక అనర్థాలకు కారణమయ్యే ఆల్కహాల్‌ను అధికంగా తీసుకోవడం మానుకోవాలి. ఖచ్చితంగా ఇబ్బంది లేదు. తరచుగా మద్యం సేవించే వారు ఈ విషయాలను తెలుసుకోవాలి, ఈ ప్రమాదాలను అర్థం చేసుకోవాలి, తదనుగుణంగా మద్యపానాన్ని నియంత్రించాలి.