NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

హైదరాబాద్‌ నుంచి ఏపీకి డిప్యూటీ సీఎం.. పవన్‌ వెంట త్రివిక్రమ్, ఆనంద సాయి..
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి చేరుకున్నారు.. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు పవన్‌ కల్యాణ్.. అయితే, ఆయనతో పాటు సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి మరియు కమెడియన్లు నర్ర శ్రీనివాస్.. నాగ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు పవన్‌ కల్యాణ్‌.. కాగా, అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన పవన్‌ కల్యాణ్.. ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకున్నారు.. అక్కడి నుంచి ఈ రోజు గన్నవరం వచ్చారు.. అయితే, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో పవన్‌ కల్యాణ్‌కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. ఆయనతో త్రివిక్రమ్‌ కనిపించడం ఇదే మొదటిసారి అంటున్నారు.. మరోవైపు పవన్‌ వెంట ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి ఎందుకు? వచ్చారు అనేదానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది.. ఆనంద్‌ సాయితో ఏదై కొత్త డిజైన్లు గీయిస్తారా? పిఠాపురంలో భూమి కొనుగోలు చేసినట్టు ప్రకటించిన పవన్‌.. అక్కడ నిర్మాణాల కోసం ఏమైనా ప్లాన్‌ గీయిస్తున్నారా? ఇంకేదైనా కారణం ఉందా? అనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.. అమరావతిలో నిర్మాణలపై కూడా ప్రభుత్వం దృష్టిసారించిన విషయం విదితమే.

హర్షసాయి హెల్పింగ్‌ టీమ్‌ అంటూ వల.. యువకుడికి కుచ్చుటోపీ..
డబ్బులు ఎరగావేసి.. ఆఫర్ల పేరుతో.. ప్రముఖుల పేర్లతో.. సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు.. ఆదమరిస్తే చాలు.. అందినకాడికి దండుకుంటున్నారు.. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గ్రామానికి చెందిన బిడ్డిక సోమేష్‌ అనే గిరిజన యువకుడు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కాడు. యూట్యూబర్ హర్షసాయి హెల్పింగ్ టీమ్ అంటూ.. గిరిజనుడికి కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు.. హర్షసాయి సహాయ కేంద్రం నుండి 3 లక్షల రూపాయలు సహాయం చేస్తామని నమ్మబలికిన మోసగాళ్లు.. ఆ సొమ్మును బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తాం.. మీ బ్యాంకు వివరాలు చెప్పాలని కోరారు.. దీనికోసం వాట్సాప్ లో లింక్‌పంపిన కేటుగాళ్లు.. బ్యాంక్ అకౌంట్ వివరాలా నిర్ధారణ కోసం 1150 రూపాయలు వేయాలని సూచించారు.. రూ.1150 వేసిన వెంటనే లక్ష రూపాయలు బాధితునికి ఫోన్ పే ద్వారా వేసినట్లు నకిలీ స్క్రీన్ షాట్ పంపించారు.. డబ్బులు జమ కాకపోవడంతో.. కాస్త అనుమానం వ్యక్తం చేసిన యువకుడికి జీఎస్టీ లేకపోవడం వలన డబ్బులు జమ అవ్వడం లేదని 2570 రూపాయలు ఒకసారి 9330 రూపాయలు ఒకసారి వేస్తే డబ్బులు జమ అవుతాయని మళ్ళీ నమ్మబలికారు.. ఆ ముఠా.. కేటుగాళ్ల మాటల గారడీలో పడి.. వాళ్లు అడిగిన డబ్బులు పంపించాడు యువకుడు.. ఆ సొమ్మును పంపించిన మరుక్షణం తమ వాట్సాప్ పేరు, డీపీ ఐపీఎస్‌ రాహుల్ శర్మ గా మార్చేసి.. నేను పోలీస్ ఉన్నతాధికారిని అంటూ.. తిరిగి బాధితుడినే బెదిరించారు.. ఇక, మోసపోయానని గుర్తుంచిన సోమేష్.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. భక్తులకు కీలక సూచనలు
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు ఆణివార ఆస్థానం కార్యక్రమాని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపు ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.. రేపు సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పుష్పపల్లకి పై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. కాగా, ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు.. అంటే తమిళుల సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరి రోజున జరిగే ఉత్సవం కావడంతో.. ఈ వేడుకలకు ఆణివార ఆస్థానం అనే పేరు వచ్చింది. చారిత్రక నేఫథ్యంలో పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజైన ఆణివార ఆస్థానం పర్వదినం నుండి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమైయ్యేది. టీటీడీ ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కు మారినపట్టికి.. ఆనాదికాలంగా వస్తున్న ఆచారాని అనుసరిస్తు నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తుంది టీటీడీ.. ఆణివారి ఆస్ధానం సంధర్భంగా శ్రీరంగం దేవస్ధానం తరుపున స్వామివారికి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. ఈ వస్త్రాలను ముందుగా పెద్ద జీయర్ మఠంలో వుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాల నడుమ జీయర్‌ స్వాములు, ఆలయ అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో సర్వభూపాల వాహనంపై వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఆణివార ఆస్థానం రోజున సాధరణంగా స్వామి వారు సాయంకాలం సమయాన పుష్పపల్లకిపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. 5 నుంచి 7 టన్నుల పుష్పాలుతో అలంకరణ చేసిన పుష్పపల్లకి పై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు మాడ వీధులలో ఉరేగుతారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ. ఇక, భక్తుల రద్దీ దృష్యా సిఫార్సు లేఖలపై జారి చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంలో విచారణ.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. అక్రమ ఇసుక తవ్వకాలపై జస్టిస్ అభయ్ ఒకా ధర్మాసనం ముందు విచారణ చేశారు.. అక్రమ ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపు న్యాయవాది.. అయితే, ఆగస్టు 2వ తేదీ నాటికి ఏపీలో అక్రమ మైనింగ్ వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.. మరోవైపు.. ఇప్పటికే ఏడు జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేశామని వెల్లడించారు కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాది.. మరో ఆరు జిల్లాల్లో తనిఖీకి ఆరు వారాల సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది కేంద్ర ప్రభుత్వం. కాగా, ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లాలని స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం విదితమే..

ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం..
ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకం అవగాహన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. బట్టి విక్రమార్కకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మక మైన హామీలను నెరవేర్చిందన్నారు. మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామన్నారు. అడ్డుగోలుగా వాటిని దుర్వినియోగం చేయమని తెలిపారు. రైతు భరోసా సదస్సుకు మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ.. 12 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఎంపీ రైతు సంఘ నాయకులు హాజరయ్యారు. రైతు భరోసా విధివిధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఇత‌ర వ‌ర్గాల నుంచి మంత్రివ‌ర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

గూడెం మహిపాల్ రెడ్డి పార్టీలోకి వద్దు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన..
పటాన్ చెరులో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్ చేస్తున్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారంతో కాంగ్రెస్ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో వస్తే పార్టీ వర్గాలుగా చిలిపోతుంద మండిపడ్డారు. నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధులు కలిసి మంత్రి దామోదర, సీఎం రేవంత్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్, ఈడీ కేసులు ఉండటంతో పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్తయంటున్న కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇది ఇలా ఉండగా.. మరోవైపు తన అనుచరులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో తన చేరికపై మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లతో మహిపాల్ రెడ్డి చర్చలు సాగుతున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందించనుంది అనే దానిపై ఉత్కంఠ నెలకుంది.

ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా.. బీజేపీ, బీఆర్ఎస్ లపై పొన్నం ఫైర్
ప్రభుత్వాన్ని కూల్చుతామంటే..చూస్తూ ఊరుకోవాలా? అని బీజేపీ, బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. వనమహోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ హితమైన మొక్కల్ని నాటేందుకు కృషి జరుగుతుందన్నారు. నలభై లక్షల మొక్కల్ని కరీంనగర్ లో నాటబోతున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలు కూల్చిందని మండిపడ్డారు. బండి సంజయ్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు ? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే..చూస్తూ ఊరుకోవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం ధర్మం తప్పలేదు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాజనీతిని అవలంభిస్తున్నామన్నారు. కుల గణన పై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 3 వరకు మాకు ఎమ్మెల్యే లను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. పడగొడతాము, కూలగొడతాం అని రెచ్చగొట్టింది బీజేపీ, బీఆర్ఎస్ నేతలే అన్నారు. బండి సంజయ్ కూడా ప్రభుత్వం కూలిపోతుంది అని అన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని మీరంటే.. నిలబెట్టడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలను ఆహ్వానిస్తున్నామన్నారు. రాజ్యాంగ హత్యా దివస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్వహించడం దారుణమన్నారు. కేటీఆర్ కి చేరికల మీద మాట్లాడే హక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని మంత్రిని చేసింది వారని తెలిపారు. వారు చేస్తే రాజకీయ పునరేకీకరణ అవుతుంది.. మేము చేర్చుకుంటే రాజ్యాంగ విరుద్దమా? రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుతాన్ని కూల్చుతాము అన్నది కేటీఆర్ కాదా…? అని ప్రశ్నించారు.

తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. వేర్వేరు ఘటనల్లో ఒక చిన్నారి సహా ఏడుగురు మృతి
అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. అధ్యక్ష ఎన్నికల కోసం పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఘోరమైన దాడికి గురయ్యారు. అదే సమయంలో అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్‌లో రెండు వేర్వేరు కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒక చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు.శనివారం అర్థరాత్రి బర్మింగ్‌హామ్‌లోని క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు మరణించారని, అంతకుముందు నగరంలోని మరొక ప్రాంతంలో ఇంటి వెలుపల కాల్పులు జరిపిన సంఘటనలో కనీసం నలుగురు మరణించారని పోలీసులు కాల్పులకు సంబంధించిన సమాచారం అందించారు. ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బర్మింగ్‌హామ్ పోలీసు అధికారి ట్రూమాన్ ఫిట్జ్‌గెరాల్డ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో సందేశంలో శనివారం రాత్రి 11 గంటల తర్వాత నైట్‌క్లబ్ వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో చాలా మంది మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బర్మింగ్‌హామ్ అగ్నిమాపక, రెస్క్యూ కార్మికులు క్లబ్‌కు సమీపంలో ఉన్న కాలిబాటపై ఒక వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని, క్లబ్‌లో ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపించాయని ఆయన చెప్పారు. కాల్పుల్లో గాయపడిన 10 మందిని బర్మింగ్‌హామ్‌లోని ఆసుపత్రిలో చేర్చారని, అక్కడ ఒకరు చికిత్స పొందుతూ మరణించారని, మరో తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారి తెలిపారు. దుండగుల్లో ఒకరు రోడ్డుపై నుంచి నైట్‌క్లబ్‌లోకి బుల్లెట్లు పేల్చినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ కాల్పుల ఘటనకు కొన్ని గంటల ముందు బర్మింగ్‌హామ్‌లో సాయంత్రం 5.20 గంటలకు కారు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసు అధికారి ఫిట్జ్‌గెరాల్డ్ ప్రకారం.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక ఇంటి ముందు యార్డ్‌లో కారును కనుగొన్నారు. అందులో ఒక వ్యక్తి, ఒక మహిళ, ఒక చిన్న పిల్లవాడు తుపాకీ కాల్పుల కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

లోన్స్ తీసుకున్న వారికి ఎస్బీఐ షాక్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఇవాళ (సోమవారం) తెలిపింది. కొన్ని కాల‌ప‌రిమితుల‌పై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. స‌వ‌రించిన రేట్లు నేటి (జులై 15) నుంచే అమ‌ల‌ులోకి వస్తాయని ఎస్‌బీఐ త‌న అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఏడాది కాల‌వ్యవధి గ‌ల ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి.. ఆరు నెల‌ల కాల‌వ్యవధికి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి.. రెండేళ్లకు 8.85 శాతం నుంచి 8.95 శాతానికి, మూడేళ్ల కాల‌ప‌రిమితి 8.95 శాతం నుంచి 9 శాతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్‌ ఆధారిత లోన్ల ఈఎంఐలు మరింత ప్రీమియం కానున్నాయి. ఎస్‌బీఐ ఆటో రుణాలు ఒక సంవత్సరం, వ్యక్తిగత రుణాలు 2 సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానం చేశారు. కాగా, ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక‌ రుణ రేటుగా నిర్ధరాంచింది. నిధుల సేక‌ర‌ణ‌కు బ్యాంకుల‌కు అయ్యే వ్యయం, నిర్వహ‌ణ వ్యయం, క్యాష్ రిజ‌ర్వు రేషియో, కాల‌ ప‌రిమితి, ప్రీమియంల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంసీఎల్ఆర్‌ను సీఎస్బీఐ లెక్కిస్తుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే త‌క్కువ‌కు రుణం అందించే ఛాన్స్ ఉండదు.. వివిధ కాల‌ప‌రిమితుల‌కు (ఓవ‌ర్ నైట్ నుంచి మూడేళ్ల వ‌ర‌కు) ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటాయి. ఎస్‌బీఐ ప్రస్తుతం గృహ రుణాలను ‘ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేట్స్‌’ ఆధారంగా అందిస్తుంది. ఇందులో మాత్రం ఎలాంటి సవరణలు చేయలేదని పేర్కొనింది. ప్రస్తుతం ఈ ఈబీఎల్‌ఆర్‌ 9.15శాతం + సీఆర్‌పీ + బీఎస్‌పీ దగ్గర స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం ఎస్‌బీఐ హోం లోన్‌ వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంది. సిబిల్‌ స్కోర్‌ సహా ఇతర అర్హతలను బట్టి ఇది మారిపోతుంది.

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధర పెరిగితే.. ఇంకోరోజు తగ్గుతుంటుంది. ఇంకొన్ని రోజులు మాత్రం పసిడి ధరలు స్థిరంగా ఉంటాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు… నేడు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. సోమవారం (జులై 15) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,500గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.73,640గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.300 తగ్గి.. రూ.95,200గా నమోదైంది.

టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్
భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హిట్‌మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో మాత్రం ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే టెస్ట్, వన్డే ఫార్మాట్ల నుంచి కూడా రోహిత్‌ త్వరలోనే తప్పుకుంటాడని సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌కు గుడ్‌బై చెప్పే సమయం దగ్గరపడిందంటూ పలువురు అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25కి కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇటీవల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి రిటైర్‌మెంట్‌పై రోహిత్‌ తాజాగా స్పందించాడు. టెన్షన్ వద్దని, ఇంకొంత కాలం తాను క్రికెట్ ఆడతానని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. డాలస్‌లో క్రికెట్‌ అకాడమీ ప్రారంభానికి వెళ్లిన రోహిత్.. అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘నేను ఇంకొంత కాలం క్రికెట్ ఆడతా. సుదీర్ఘ ప్రణాళికలేమీ లేవు. ప్రస్తుతానికి నా దృష్టి అంత క్రికెట్‌పైనే’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ జవాబిచ్చాడు. ఐపీఎల్‌లో ఇంకొన్నాళ్లు హిట్‌మ్యాన్ కొనసాగనున్నాడు. జులై చివరలో శ్రీలంక టూర్‌కు భారత జట్టు వెళ్లనుంది. ఈ సిరీస్‌ నుంచి రోహిత్‌ శర్మ విశ్రాంతిని తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంక టూర్ అనంతరం జరిగే బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లలో రోహిత్ ఆడనున్నాడు. శ్రీలంక టూర్‌కు విరాట్ కోహ్లీ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ. ఇక శ్రీలంక టూర్‌ నుంచే కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆకస్మిక మృతి…
ఓవర్ సీస్ లో ఎన్నో తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ హ వ్యవహరించిన  ఫికస్ డిస్టిబ్యూషన్ సంస్థ అధినేత  హరీష్ సజ్జ ఆకస్మిక మరణం చెందారు. అట్లాంటాలోని ఇంట్లో ఉండగా అకస్మాతముగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికె అయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు . కాగా USAలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలలో ఒకటైన ఫికస్‌కు చెందిన హరీష్ సజ్జా రాఖీ చిత్రంతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ చిత్రం సక్సెస్ కావడంతో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో యూఎస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గ పేరుతెచుకున్నారు. ముఖ్యంగా 2008 నుండి 2016 వరకు దాదాపు ఒక దశాబ్దం పాటు యుఎస్‌లో అతిపెద్ద పంపిణీదారుగా క్రియాశీలకంగా వ్యవహరించారు. అదే తరుణంలో మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రోబో, రేస్ గుర్రం, 1 నేనొక్కడినే, ఆగడు, జనతా గ్యారేజ్ మొదలైన అనేక భారీ చిత్రాలను ఓవర్ సీస్ లో పంపిణీ చేసారు. USAలో మొదటి మిలియన్ డాలర్ల చిత్రంగా రికార్డు నమోదు చేసిన దూకుడు పంపిణిదారులు హరీష్ సజ్జా.

‘క’ ట్రైలర్ వచ్చేసింది.. కిరణ్ ది మాములుగా లేదుగా ..?
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశాన్ని ఎంచుకొని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు సందర్భంగా క చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఎలా ఉందొ సారి చూద్దాం రండి..? టీజర్  ప్రారంభంలో  టైమ్ ట్రావెల్ లాంటి వస్తువును చూపించి కృష్ణగిరి అనే మారుమూల పల్లెటూరులో  పోస్ట్ మ్యాన్ గా పని చేస్తూ ఆ ఊరి ప్రజలకు వచ్చే ఉత్తరాలను చదువుతు తిరిగే కుర్రాడు  ఆ తర్వాత  హత్యలు చేసేవరకు వెళ్లినట్టు చూపించారు. మీకు తెలిసి నేను మంచి కానీ నేను.. అంటూ గోడపై sr. ఎన్టీఆర్ రావణాసురుడి చిత్రాన్ని చూపిస్తూ తోడేలువురా నువ్వు అంటూ విలన్ చెప్పేటు వంటి షాట్స్ ఆకట్టుకున్నాయి. చివరలో ఆంజనేయస్వామి, ఎద్దులబండి,ఉత్తరాలు, అమ్మవారి జాతర వీటన్నిటికి లింక్ ఏంటనే సస్పెన్స్ తో సైకిల్ హ్యాండిల్ తో ఫైట్ చేసిన హీరోపై టీజర్ ను ముగించారు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథ, రాయలసీమ యాక్షన్ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా, ట్విస్ట్ లతో ఆకట్టుకుంది. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరింది. దర్శక స్వయం సందీప్ – సుజిత్ ల షాట్ మేకింగ్ లో ప్రతిభ కనిపిస్తుంది. ఈ చిత్రంతో హిట్ కొట్టేలా ఉన్నాడు ఈ యంగ్ హీరో. పనిలో పనిగా టీజర్ ఫై మీరు ఒక లుక్ వేయండి..