NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

‘స్పందన’ పేరు తొలగింపు.. ప్రక్షాళనకు సర్కార్‌ నిర్ణయం
ప్రజల నుంచి సమస్యల పరిష్కారానికి ‘స్పందన’పేరుతో వినతులు స్వీకరిస్తూ వచ్చింది గత ప్రభుత్వం.. ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో ఈ కార్యక్రమం నిర్వహించేవారు.. అయితే, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ స్పందనను ప్రక్షాళన చేపట్టనుంది చంద్రబాబు సర్కార్.. స్పందన పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. జిల్లాల కలెక్టరేట్లల్లో ప్రతి సోమవారం ఫిర్యాదులను స్వీకరిస్తోన్న కలెక్టర్లు, అధికారులు.. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థకు పూర్తి ప్రక్షాళన అవసరమని భావిస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరభ్‌ పేరుతో మెమో జారీ చేశారు.. ఇకపై ‘ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాలు’ పేరుతో వినతుల స్వీకరించనున్నారు.. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

పాలనలో మార్పు, మార్క్‌ చూపిస్తున్న చంద్రబాబు.. ఈ రోజు సీఎస్‌, డీజీపీలతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. పాలనలో తన మార్క్, మార్పు చూపిస్తున్నారు.. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ చూపిచేందుకు రెడీ అయ్యారు.. ఇవాళ సీఎంవో, సీఎస్, డీజీపీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుండగా.. అదే సమయంలో.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టనున్నారు ప్రభుత్వ పెద్దలు. ప్రవీణ్ ప్రకాష్, శశి భూషణ్, అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాల కృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.. ఇక, ఐదు హామీల అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి.. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.. తాను ప్రకటించినట్టుగానే.. టీటీడీ ప్రక్షాళనతో పనిమొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి.. కొత్త ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు.. ఇక, అన్ని విభాగాల్లోనూ ఈ తరహా మార్పులు, చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.

ఏజెన్సీలో తీరని కష్టాలు.. డోలీలో ఆస్పత్రికి గర్భిణీ..
ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఒక గ్రామంలో గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు. అరకులోయ మండల బస్కి పంచాయతీ కొంత్రాయిగుడకి చెందిన సమర్ది డాలిమ్మ అనే గర్భిణీకి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబీకులు అంబులెన్సు ఫోన్ చేసినప్పటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో చేసేది ఏమీ లేక కుటుంబీకులు డోలి కట్టుకుని మూసుకుని ఆసుపత్రికి తరలించారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలం బస్కి పంచాయితీ కొంత్రాయిగుడ గ్రామానికి చెందిన సమర్థి దాలిమ్మ అనే గర్భిణీని డోలీలో మోసుకుంటూ మాడగడ ఆసుపత్రికి తరలించారు స్థానికులు.. శుక్రవారం ఉదయాన్నే పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ సకాలంలో రాని కారణంగా కిలోమీటర్ దూరం మీద కుర్చీకి కట్టుకొని డోలిమోత ద్వారా మోసుకొచ్చారు. ఇక, మార్గ మధ్యలో అంబులెన్స్ రావడంతో గర్భిణిని మాడగడ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రసవం చేయించారు. సకాలంలో ఆసుపత్రికి చేర్చడంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు గిరిజన సంఘం నాయకులు కోరుతున్నారు..

సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి.. లోకేష్ ఆదేశాలు.
సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి అంటూ అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్‌.. మంగళగిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు లోకేష్.. తన నివాసంలో ప్రజలను కలుసుకున్నారు.. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలు చేపట్టిన నారా లోకేష్.. ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం విదితమే.. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ప్రకటించారు.. ఇక, నియోజకవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు.. ఈ రోజు ప్రజా దర్బార్‌లో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మంగళగిరి వాసులు.. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి లోకేస్‌.. అంతేకాదు.. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్‌. ఇక, మంత్రి హోదాలో తొలిసారి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్న నారా లోకేష్‌ని ఈ సందర్భంగా కొందరు అభిమానులు, టీడీపీ శ్రేణులు కూడా కలిసి ఆయనకు శుభాకాక్షంలు తెలియజేశారు.

మోడీ అహంకార ధోరణి వల్లే ఆర్ఎస్ఎస్ అసహనం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు చేసే రైతులకే రైతు బంధు పెట్టుబడి సహాయం ఇస్తామని తెలిపారు. గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, బీడు భూములకు రైతు బంధు ఎందుకు అని ప్రశ్నించారు. సర్కార్ సోమ్ము అంటే అలుసా.. ఆదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం 60 లక్షల కోట్ల రూపాయల రాయితీని ఇచ్చింది అని వెల్లడించారు. పంజాబ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కనువిప్పు కావాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక, ఎక్కడైతే మతం ఆరంభం అయిందో అక్కడే ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ప్రతికులంగా వెలుగులోకి వచ్చాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ అహంకార ధోరణితో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) తీవ్ర అసహనం వ్యక్తం చేసిందన్నారు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరి మీద నేను ఆరోపణలు చేయలేదు.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడే మాటల తీరు చూస్తుంటూ బీఆర్ఎస్ నాయకులు చట్టానికి అతీతమా అన్నట్టు అనిపిస్తుందన్నారు.. ప్రతి ఒక్కరు చట్టానికి కట్టుబడి ఉండాలి.. ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ కేసులు పెట్టిస్తుంది..
ఆదిలాబాద్ లో బీజేపీ ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా కేసులు పెట్టిస్తుంది అని ఆరోపణలు గుప్పించారు. భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో మీటింగ్ దగ్గర శాంతి యుతంగా నిరసన చేస్తే హనుమాన్ భక్తులను సైతం జైల్లో పెట్టారు.. పోలీసులు కనీసం మానవత్వం లేకుండా ఆ ఇష్యూతో సంబంధం లేని వాళ్ళను సైతం ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చారు.. తప్పుడు కేసులు ఎత్తి వేయాలి అని డిమాండ్ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎంపీ నగేష్ కోరారు. ఇక, హిందువులతో గొక్కున్న పార్టీలు రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోయాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రశ్నించే విధంగా లేదా కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరులను వేధిస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు. వేధింపులకు లేదా బెదిరింపులకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈలాంటి చిల్లర రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రజల కోసం తాము నిరంతరం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.

సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. మార్చి 28వ తేదీన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి భావేజ ముందు జరిగిన లిక్కర్ కేసు విచారణ సందర్భంగా.. సీఎం కేజ్రీవాల్ తన అరెస్ట్ కు సంబంధించిన వాదనలు కోర్టుకు వినిపించారు. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కోర్టు ముందు చెప్పిన వీడియో, ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేజ్రీవాల్ కోర్టు వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా టీమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. కేజ్రీవాల్ వీడియో పోస్టుల సునీతా కేజ్రీవాల్ ను ట్విట్టర్ లో రీపోస్ట్ చేశారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు ప్రొసీడింగ్స్ లోని కేజ్రీవాల్ వీడియోను రికార్డ్ చేయడమే కాకుండా.. సోషల్ మీడియాలో పోస్టు చేశారని అడ్వకేట్ వైభవ్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో ఉన్న వీడియోను ఆయా సంస్థలు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్ ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, జస్టిస్ అమిత్ శర్మల ధర్మాసనం విచారించింది. “కోర్టుల కోసం, వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఢిల్లీ హైకోర్టు రూల్స్ 2021” ప్రకారం కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధించారు. ఇలాంటి వీడియోలను వైరల్ చేయడం వలన న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్టను కించపరిచే ప్రయత్నం అని వైభవ్ సింగ్ వాదించారు. ఇలాంటి వీడియోలను పోస్ట్ చేయడం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ కలిసి పన్నిన కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలైట్లపై భద్రతా బలగాలు మరోసారి భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇద్దరి మధ్య అడపాదడపా ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. బస్తర్‌లోని అబుజ్మద్‌లో ఆపరేషన్ కోసం వెళ్లిన భద్రతా బలగాల మధ్య గత రెండు రోజులుగా నక్సలైట్లతో అడపాదడపా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాలంలో బస్తర్‌లోని అబుజ్‌మద్‌లోని కుతుల్ ఫర్సెబెడ కొడమెట ప్రాంతంలో పెద్ద ఆపరేషన్ మొదలైంది. ఆ ప్రాంతంలో నక్సలైట్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. నారాయణపూర్, కొండగావ్, కంకేర్, దంతేవాడ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారని, మరికొందరు గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. రెండు రోజులుగా సైనికులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్న బస్తర్‌లోని అబుజ్మద్ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవులు, పర్వతాలు ఉన్నాయి. మధ్యలో నక్సలైట్లు ఉన్నారనే వార్త వచ్చిన ప్రాంతమంతా సైనికులు చుట్టుముట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఎనిమిది మంది నక్సలైట్లు మరణించగా, మరికొందరు సైనికులు కూడా గాయపడినట్లు వర్గాలు తెలిపిన సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

500 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి.. 17 గంటల తర్వాత మృతి
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా సూరజ్‌పురా గ్రామంలో 50 అడుగుల లోతున్న బోరుబావిలో ఏడాదిన్నర చిన్నారి పడిపోయింది. ఆమె 17 గంటల పాటు బోరుబావిలో మృత్యువుతో పోరాడింది. చివరకు ప్రాణాలు వదిలింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె బోరుబావిలో పడిపోయింది. సూరజ్‌పురా గ్రామంలో 50 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఏడాదిన్నర బాలికను రక్షించలేకపోయామని అధికారులు శనివారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఏడాదిన్నర బాలిక ఆరోహి బోరుబావిలో పడిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక యంత్రాంగం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు ప్రారంభించింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ 17 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత శనివారం ఉదయం అపస్మారక స్థితిలో అతన్ని బయటకు తీశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బోర్‌వెల్‌ 500 అడుగుల లోతులో ఉందని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. అందులో పడిపోవడంతో బాలిక దాదాపు 50 అడుగుల లోతులో చిక్కుకుంది. స్థానిక యంత్రాంగంతో పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం దాదాపు 17గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత శనివారం ఉదయం 5 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న బాలికను బయటకు తీశారని ఆయన చెప్పారు.

సూపర్-8 చేరి జోష్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్‌!
టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్-8 చేరి మంచి జోష్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. అఫ్గాన్‌ స్టార్ స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. వేలి గాయం కారణంగా అతడు మెగా టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ముజీబ్‌ స్థానంలో హజ్రతుల్లా జజాయ్‌ జట్టులోకి చేరినట్లు పేర్కొంది. అఫ్గనిస్తాన్‌ జట్టులోని ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ కీలక ఆటగాడిగా ఉన్నాడు. టీ20లలో అతడికి మెరుగైన రికార్డు ఉంది. అఫ్గాన్‌ తరఫున 46 టీ20లు ఆడిన ముజీబ్‌.. 59 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో ఉగాండాపై మాత్రమే ముజీబ్‌ ఆడాడు. మూడు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్‌ తీశాడు. గాయం కారణంగా మళ్లీ అతడు మైదానంలోకి దిగలేదు. ముజీబ్‌ స్థానంలో నూర్‌ అహ్మద్‌ బరిలోకి దిగాడు. మణికట్టు స్పిన్నర్ అయిన నూర్‌.. మెగా టోర్నీలో రెండు గేమ్‌లు ఆడాడు. న్యూజిలాండ్‌, పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లలో నూర్ ఆకట్టుకున్నాడు. గ్రూప్‌-సీలో ఉన్న అఫ్గనిస్తాన్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌-8కు చేరుకుంది. గ్రూప్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే స్పిన్‌కు అనుకూలించే వెస్టిండీస్‌ పిచ్‌లపై ముజీబ్‌ లాంటి కీలక బౌలర్‌ సేవలు కోల్పోవడం అఫ్గాన్‌ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. స్పిన్నర్లు రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ.. పేసర్‌ ఫజల్‌హక్‌ ఫరూకీ రాణిస్తుండటం ఊరట కలిగించే అంశం. సూపర్‌-8లో అఫ్గాన్‌ ఎలా రాణిస్తుందో చూడాలి.

కొండన్న కామ్రేడ్ మనకు ఎక్కలేదు కానీ.. అక్కడ బ్లాక్ బస్టరే
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ “గీతా గోవిందం”..స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.సినిమాలో వీరిద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా తరువాత వీరిద్దరూ జంటగా నటించిన మూవీ డియర్ కామ్రేడ్..దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని ,యలమంచిలి రవి శంకర్ ,మోహన్ చెరుకూరి ,యష్ రాగినేని గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాబీ అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో అద్భుతంగా నటించారు.రష్మిక ఈ సినిమాలో లిల్లి అనే స్టేట్ లెవెల్ క్రికెటర్ పాత్రలో నటించింది .ఈ సినిమాలో విజయ్ ,రష్మిక మధ్య లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.అయితే ఈ సినిమాకు తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం యూట్యూబ్ 400  మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకుపోతుంది.తాజాగా ఈ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది.ఇదిలా ఉంటే విజయ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.త్వరలోనే తన అప్ కమింగ్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

కపుల్ సాంగ్ కు నెట్టింట సూపర్ క్రేజ్..టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుందిగా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2 ” క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అయితే రీసెంట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ రెండు సాంగ్స్  రిలీజ్ చేసారు. “పుష్ప పుష్ప”అంటూ సాగే ఫస్ట్ సింగల్ కు నెట్టింట భారీగా వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఫస్ట్ సింగల్ కి వచ్చిన క్రేజ్ తో మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సింగల్ ను రిలీజ్ చేసారు .అల్లుఅర్జున్ ,రష్మిక మధ్య సాగే “కపుల్ సాంగ్”ను మేకర్స్ రిలీజ్ చేసారు.స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.నెట్టింట ఈ సాంగ్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.ఈ సాంగ్ ను తెలుగు ,తమిళ్ మలయాళం ,కన్నడ ,హిందీ ,బెంగాలీ భాషల్లో లాంచ్ చేయగా నెట్టింట రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతుంది.ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ 1.67 మిలియన్లకు పైగా లైక్స్ తో  నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది.