NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఎంత అణిచి వేస్తే అంత పోరాటం చేస్తాం.
ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర అని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని మండిపడ్డారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసిందని తెలిపారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే పట్నం నరేందర్ రెడ్డిని, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరు..
ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? అని మండిప్డడారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని హెచ్చరించారు. మీ బెదిరింపులకు @BRSparty భయపడదన్నారు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామన్నారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు. మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లారు. పట్నం నరేందర్ రెడ్డి సతీమణితో మాట్లాడారు. అక్కడ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్ పై దాడి జరగడం బాధాకరమని తెలిపారు. ఈ ఘటన బీఆర్ఎస్ నేతలపై కావాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం లో జరిగిన ఘటన.. అధికారుల మీద కోపంతో కాదు ముఖ్యమంత్రి మీద కోపం ఈ ప్రభుత్వం మీద కోపంతో దాడి జరిగిందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రైతుల బాధ వినండి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ల్యాండ్ కి సంబంధించి 8 నెలలు రైతులను ఒప్పించి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్నామన్నారు. ఇది న్యాయం కాదు, రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

 

చింతలపూడి ఎత్తిపోతల ద్వారా 2.15 లక్షల ఎకరాలకు నీరు
2014-19లో గత టీడీపీ పాలనలో రూ.3038 కోట్లు ఖర్చుపెట్టి 40 పనులు పూర్తి చేశామని.. 2019-24 వైసీపీ పాలనలో కేవలం రూ. 760 కోట్లు ఖర్చుపెట్టి 5 శాతం పనులు మాత్రమే చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ వేదికగా తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై తమ అనుచరులతో ఎన్జీటీలో వైసీపీ కేసులు వేయించిందని చెప్పారు. 2021 డిసెంబర్‌లో వైసీపీ అధికారంలో ఉండగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు ఎన్జీటీ రూ.73 కోట్ల పెనాల్టీ విధించిందని వెల్లడించారు. 3 నెలల్లో అనుమతులు తీసుకోవాలని చెప్పినా, పట్టించుకోకపోవడంతో 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయన్నారు. భూసేకరణకు సంబంధించి, సంబంధిత కలెక్టర్లు, ఆర్ అండ్ ఆర్ అధికారులతో 8 సార్లు సమీక్షలు చేశానని మంత్రి పేర్కొన్నారు. ఇంకా 934 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని.. 4 రకాలుగా ఈ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రూ.2500 కోట్లతో మొదటి దశలో పనులు పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు సాగునీరు , తాగు నీరు అందించేలా పనులు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. జల్లేరు రిజర్వాయర్‌ను వదులుకున్నాం, పక్కన పెట్టాం అని చెప్పి , ఇప్పుడు మా ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 4 జిల్లాల్లో , 11 నియోజకవర్గాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు, 25 లక్షల మందికి తాగు నీరు అందుతుందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నాగార్జున సాగర్ కింద ఉన్న 2.15 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు. ఆ నీటిని శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమకు ఉపయోగించుకోవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

 

యూపీలో ఇళ్ల కూల్చివేతల పై సుప్రీం కీలక తీర్పు..ఏమన్నదంటే ?
బుల్డోజర్ చర్యపై తీర్పును ఇస్తూ ప్రాథమిక హక్కులను మరింత పెంచడానికి.. చట్టబద్ధమైన హక్కులను సాధించడానికి ఎగ్జిక్యూటివ్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఆస్తులను కూల్చివేయలేయడం సరికాదని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ఏ వ్యక్తినైనా దోషిగా నిర్ధారించే హక్కు రాష్ట్ర పరిపాలనకు లేదా కార్యనిర్వాహక వర్గానికి లేదని పేర్కొంది. కాబట్టి అలాంటి చర్యలను ఆపాలని సూచించింది. బుల్‌డోజర్‌ చర్యపై తీర్పును వెలువరిస్తూ.. బుల్‌డోజర్‌లను ఆపరేట్‌ చేసేటప్పుడు సంబంధిత అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. లేనిపక్షంలో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లే ప్రజలకు చివరి భద్రత అని, దానితో ఆడుకోవద్దంటూ కోర్టు మందలించింది. ఒక వ్యక్తి ఇంటిని కూల్చివేస్తే.. అతనికి పరిహారం చెల్లించే వ్యవస్థ ఉండాలని కోర్టు పేర్కొంది. బుల్‌డోజర్‌ చర్యకు సంబంధించి రాష్ట్రం ఏకపక్షంగా వ్యవహరించదని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. ఈ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. నిందితుడు ఒకరేనని, అయితే మొత్తం కుటుంబ సభ్యుల ఇల్లు కూల్చివేయబడిందని, ఇది తప్పు అని కోర్టు పేర్కొంది. అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకునే ముందు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇంటిని ప్రాథమిక హక్కుగా కోర్టు నిర్వచించింది. ఆర్టికల్ 142 ప్రకారం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి న్యాయం కోసం భారతదేశం అంతటా అమలు చేయదగిన ఆదేశాలను ఆమోదించడానికి ఈ కథనం సుప్రీంకోర్టును అనుమతిస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు 2024లో బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ చర్యకు వ్యతిరేకంగా జమియత్ ఉలేమాతో పాటు పలు సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. యూపీ, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేస్తున్నారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా యూపీ ప్రభుత్వాన్ని మందలించింది. సెప్టెంబర్ 17న బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వర్మకు నోటీసులు
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్‌లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్‌ చేసి.. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా  ప్రమోషన్‌ లో టైమ్ లో ఆనాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటోలను మార్ఫింగ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. అయితే తాజాగా ఈ పోస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్దిపాడు మండల చెందిన తెదేపా కార్యదర్శి రామ్ గోపాల్ పై ఎం.రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేసారు.  ఆర్జీవీ పై ఫిర్యాదులు నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు మద్దిపాడు ఎస్సై శివరామయ్య.  మరోవైపు అమరావతి లోని తుళ్లూరులోనూ ఆర్జీవీపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌ ఫొటోలను రామ్‌గోపాల్‌ వర్మ గతంలో మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు  పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరి విచారణకు రామ్ గోపాల్ వర్మ వస్తారో రారో చూడాలి.

 

కేకేఆర్ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా టీమిండియా నయా సంచలనం!
ఐపీఎల్ 2025 మెగా వేలంకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ప్రాంచైజీ ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్‌ను టాప్ ప్లేయర్‌గా రూ.13 కోట్లకు అట్టిపెట్టుకుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, డేంజరస్ హిట్టర్ ఆండ్రీ రసెల్‌లను రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. భారత ప్లేయర్స్ హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌లను రూ.4 కోట్లుకు అట్టిపెట్టుకుంది. కేకేఆర్ రూ.63 కోట్లతో వేలంలోకి వెళ్లనుంది. 2024 ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే. కేకేఆర్‌ రిటెన్షన్‌కు శ్రేయస్ ఒప్పుకోలేదని సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ సూచనలతోనే కోల్‌కతాను వీడినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ స్థానంలో మరోసారి ఢిల్లీకి శ్రేయస్ సారథిగా వ్యవహరించనున్నాడని ప్రచారం జరుగుతోంది. శ్రేయస్ జట్టును వీడడంతో కోల్‌కతాకు కెప్టెన్ అవసరం ఏర్పడింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వేలంలో ఉన్నా.. వీరిద్దరూ కోల్‌కతాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పంజాబ్ కింగ్స్‌కు పంత్.. ఆర్‌సీబీకి కేఎల్ రాహుల్ వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కెప్టెన్సీ ఆప్షన్ ఉన్న భారత ఆటగాళ్లు కోల్‌కతాకు లేకుండా పోయారు. దాంతో జట్టులో ఉన్న రింకూ సింగ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు చేస్తోందని తెలిసింది. రింకూకు ఇప్పటివరకు కెప్టెన్సీ అనుభవం లేదు. కనీసం దేశవాళీ క్రికెట్‌లో కూడా సారథిగా వ్యవహరించలేదు. అలాంటి రింకూ డిపెండింగ్ ఛాంపియన్ జట్టును ముందుకు తీసుకెళ్లడం కత్తిమీద సామే అనే చెప్పాలి. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

 

స్పెషల్ సాంగ్ శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘పుష్ప-2 ది రూల్‌’. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శత్వంలో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.ఈ సినినిమాలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు. అయితే, ఈ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ చేనందుకు ఎంత తీసుకుంది అనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ్ జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. పుష్ప 1 లో నటించిన సమంత ‘ఊ అంటావా’ సాంగ్‌కా ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. మరి బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ను కాదని శ్రీలీలను తీసుకోవడంతో ఏ మేరకు ఇచ్చారు అనే టాక్ రావడం సహజం. వినిపిస్తున్న సమాచారం మేరకు కిస్సిక్‌ సాంగ్ కోసం శ్రీ లీల రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటుందట. కాగా ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని, శ్రీలీల డాన్స్ అదరగొట్టినట్టు యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న పుష్ప డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

 

ఇది కదా ‘బంగారం’ లాంటి వార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్!
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఇటీవల పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600, రూ.1470 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. మరోవైపు 22 క్యారెట్లపై వరుసగా 550, 1350, 400 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450గా.. 24 క్యారెట్ల ధర రూ.76,850గా నమోదైంది. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బుధవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,01,000గా ఉంది. ముంబై, ఢిల్లీలలో 91 వేలుగా నమోదైంది. డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ బంగారం, వెండిపై గట్టిగానే పడింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ భారీ విజయంతో గెలిచిన నాటి నుంచి మనదేశంలో రేట్లు తగ్గుతున్నాయి. దేశీయ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,450
విజయవాడ – రూ.70,450
ఢిల్లీ – రూ.70,600
చెన్నై – రూ.70,450
బెంగళూరు – రూ.70,450
ముంబై – రూ.70,450
కోల్‌కతా – రూ.70,450
కేరళ – రూ.70,450
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.76,850
విజయవాడ – రూ.76,850
ఢిల్లీ – రూ.76,850
చెన్నై – రూ.77,290
బెంగళూరు – రూ.76,850
ముంబై – రూ.76,850
కోల్‌కతా – రూ.76,850
కేరళ – రూ.76,850

 

Show comments