NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికుల నిరసన
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు ఫ్లైట్‌ వచ్చింది. తిరిగి ఉదయం 8.15 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది.ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్ రద్దు చేయడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి వేచి ఉండడంతో అసహనంతో ప్రయాణికులు బైఠాయించారు. ఎయిర్‌లైన్స్ మేనేజర్, సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

 

నగరంలో దారుణం.. భార్యను గొంతు కోసి తగలబెట్టిన భర్త..
చిన్న పాటి గొడవలకు సహనం కోల్పోయిన భర్త.. భార్యపై కత్తితో దాడి చేసి తగలబెట్టిన ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది. నగరంలోని బండ్లగూడలో భార్యాభర్తలు ఫైజ్ ఖురేషి, ఖమర్ బేగం నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి వివాహయై ఆరు సంవత్సరాలైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ఫైజ్ ఖురేషి నగరంలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు మొదలయ్యాయి. రోజూ ఏదో గొడవ జరుగుతుండటంతో భర్త ఖురేషి భార్య ఖమర్ పై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. తనతో పాటు కత్తిని కూడా తెచ్చుకున్నాడు. సోమవారం అర్థరాత్రి చిన్న పాటి గొడవ మళ్లీ మొదలైంది. దీంతో అనుకున్న విధంగా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో భార్యపై దాడి చేశాడు. అనంతరం అతి కిరాతకంగా గొంతుకోసం దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని తగలబెట్టి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు రావడంతో.. భయాందోళన చెందిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి లొంగిపోయాడు. ఖురేషిపై కేసు నమోదు చేసి, భార్య మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరి గొడవ జరగుతున్నప్పుడు ఇద్దరు పిల్లలు ఎక్కడ వున్నారు.. అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఖమర్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్‌ రెడ్డికి కడప సెకండ్ ఏడీఎం మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈకేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్ , సుబ్బారెడ్డి లకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని మెజిస్ట్రేట్ పోలీసులకు తెలిపారు. అర్దరాత్రి రెండు గంటల సమయంలో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం కేసుకు సంబంధించిన పేపర్లను పీపీ, వర్రా రవీందర్ రెడ్డి తరఫు లాయర్లు మెజిస్ట్రేట్ ముందుంచారు. ఇరుపక్షాల వాదనల అనంతరం వర్రా రవీంద్ర రెడ్డికి రిమాండ్ విధించారు. వర్రా రవీందర్ రెడ్డి తనకు జరిగిన అన్యాయాన్ని మెజిస్ట్రేట్‌కు తెలిపారని ఆయన తరపు లాయర్ ఓబుల్ రెడ్డి వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి తెలిపేందుకు హైదరాబాదు నుంచి కడపకు వస్తున్నారని.. ఈ క్రమంలో కర్నూలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అరికాళ్ళపై కొట్టి , తొడలపై కాళ్లతో ఎక్కి తొక్కి టార్చర్ చేసినట్లు మెజిస్ట్రేట్ తో చెప్పారన్నారు. విజయమ్మపై వైయస్ షర్మిల పై,సునీతపై పోస్టులు పెట్టినట్టు ఒప్పుకోమని టార్చర్ చేశారని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలంటూ వారు టార్చర్ చేసినట్లు చెప్పాడని లాయర్ తెలిపారు. ఒప్పుకోకపోతే నీ కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని హెచ్చరించినట్లు కూడా మెజిస్ట్రేట్ ముందు వర్రా రవీంద్ర తెలిపాడన్నారు. వర్రా రవీంద్ర చెప్పిన స్టేట్మెంట్ అంతా మెజిస్ట్రేట్ రికార్డు చేశారని తెలిపారు. ఈరోజు మెడికల్ టెస్ట్‌కు పంపించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారని పేర్కొన్నారు.

 

ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు..
హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలని KPHBలోని ఓ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలపారు. కేపీహెచ్ బీ లోని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో విష్ణువర్ధన్ కి ప్రదక్షిణలు చేస్తున్నాడు. గుడిలోకి రావడం, స్వామి వారికి ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇంతలోనే విష్ణకు కాస్త అలసటగా అనిపించింది. దీంతో విష్ణు ఆలయంలో వన్న ఫిల్టర్ వద్దకు వెళ్లి నీరు కూడా తాగాడు.. ఆ తరువాత మళ్లీ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆలయ అర్చకులు, భక్తులు విష్ణుని లేపడానికి ప్రయత్నించారు. అయినా విష్ణులో ఎలాంటి చలనం లేనందుకు చివరకు 108 సహాయంతో ఆసుతప్రికి తరలించారు. విష్ణుని పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. స్థానిక సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణు మృతి చెందిన సంఘట అంతా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. విష్ణుకి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విష్ణు విగతజీవిగా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కార్తీక మాసం కావడంతో ఉదయం స్వామి వారి దర్శనానికి వెళ్లడని, కానీ ఇలా విగత జీవిగా వస్తాడని ఊహించలేక పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన వయసుకుని హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటని బోరున విలపించారు. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటూ ఇలా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడంటూ కన్నీరు పెట్టుకున్నారు. విష్ణు మృత దేహంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా మైక్‌ వాల్ట్జ్‌.. ప్రపంచానికి పెద్ద సంకేతమిచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ క్రమంగా తన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మైక్ వాల్ట్జ్‌ని తన జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకున్నారు. యూఎస్ సెనేట్‌లోని ఇండియా కాకస్ అధిపతి వాల్ట్జ్, అమెరికా కోసం బలమైన రక్షణ వ్యూహాన్ని సమర్థించారు. దేశ భద్రతను మరింత పటిష్టం చేస్తామన్న ట్రంప్ వాగ్దానాలకు ఆయన బలమైన మద్దతుదారు. మైక్ వాల్ట్జ్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించగలడు. 2023లో అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్ హిల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక ప్రసంగం ఏర్పాటు చేయడంలో మైక్ వాల్ట్జ్ కీలక పాత్ర పోషించారు. సెనేట్‌లోని ఇండియా కాకస్‌లో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. దీనిని 2004లో అప్పటి న్యూయార్క్ సెనేటర్ హిల్లరీ క్లింటన్, సెనేటర్ జాన్ కార్నిన్ ఏర్పాటు చేశారు. సెనేట్‌లో ఇదే అతిపెద్ద సభ. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికన్ దళాలను విడిచిపెట్టడానికి అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాల్ట్జ్ తీవ్రంగా విమర్శించారు. అతని నియామకం చైనా పట్ల అమెరికా వైఖరిలో పెద్ద మార్పుకు దారితీయవచ్చు. 50 ఏళ్ల మైక్ రిటైర్డ్ ఆర్మీ నేషనల్ గార్డ్ అధికారి. ఆయన ఫ్లోరిడా నుంచి మూడుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ సబ్‌కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన హౌస్‌లోని విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. మైక్‌కు సైనిక అనుభవజ్ఞుడిగా విస్తృతమైన అనుభవం ఉంది. ఆయన వర్జీనియా మిలిటరీ ఇన్స్టిట్యూట్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఫ్లోరిడా గార్డ్‌లో చేరడానికి ముందు నాలుగు సంవత్సరాలు సైన్యంలో పనిచేశాడు. ఆయన ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో వార్ ఫ్రంట్‌లో ఉన్నాడు. పెంటగాన్‌లో విధాన సలహాదారుగా కూడా పనిచేశారు.

 

బీరూట్‌పై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి.. 7గురు చిన్నారులతో సహా 23 మంది మృతి
లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది చిన్నారులు సహా 23 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మధ్య భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) లెబనాన్ లోపల హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది. ప్రతీకారంగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ భూభాగంలోకి రాకెట్లు, క్షిపణులను కూడా ప్రయోగిస్తోంది.లెబనాన్‌లోని బీరుట్‌కు ఉత్తరాన ఉన్న అల్మాట్ గ్రామంలో ఇజ్రాయెల్ దాడిలో అనేక ఇళ్లు, మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. హిజ్బుల్లా స్థానాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే అల్మాట్ గ్రామంలో హిజ్బుల్లాకు స్థావరం లేదని లేదా దాని సభ్యులు ఎవరూ ఇక్కడ నివసించలేదని లెబనీస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ గ్రామంలో మరణించినవారు, గాయపడిన వారంతా సామాన్యులే.

 

చంపేస్తామని షారూఖ్ ఖాన్‌కు బెదిరింపులు.. లాయర్ అరెస్ట్
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన ఛత్తీస్‌గఢ్ న్యాయవాదిని ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఫైజాన్ ఖాన్‌ను రాయ్‌పూర్ నివాసం నుండి అరెస్టు చేశారు. బాంద్రా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నవంబర్ 14న ముంబై వస్తానని ఫైజాన్ ఖాన్ గతంలో చెప్పాడు. అయితే, గత రెండు రోజులుగా తనకు చాలా బెదిరింపులు వస్తున్నందున, అతను ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశాడు. తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలని అభ్యర్థించాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్‌కు వరుసగా బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో షారూఖ్ ఖాన్‌కు ఈ బెదిరింపు వచ్చింది. గత వారం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు బెదిరింపు సందేశం అందింది. ఆ తర్వాత అతడిపై కేసు నమోదైంది. విచారణలో ఫైజాన్ ఖాన్ పేరుతో నమోదైన ఫోన్ నంబర్ నుండి నటుడికి బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముంబై పోలీసు బృందం రాయ్‌పూర్‌ని సందర్శించి ఫైజాన్‌ను విచారణకు పిలిచింది. అయితే నవంబర్ 2న తన ఫోన్ పోయిందని, ఫిర్యాదు చేశానని ఫైజాన్ పోలీసులకు తెలిపాడు. ఫైజాన్ విలేకరులతో మాట్లాడుతూ, తన నంబర్ నుండి వచ్చిన బెదిరింపు కాల్ తనపై కుట్ర అని అన్నారు.రెండు మత సమూహాల మధ్య శత్రుత్వానికి కారణమైనందుకు షారుఖ్ ఖాన్‌పై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, దాని కోసం తనను ఇరికించారని ఫైజన్ పేర్కొన్నాడు. 1993లో వచ్చిన ‘అంజామ్’ చిత్రంలో షారూఖ్ ఖాన్ జింకను చంపినట్లు చూపించారని, దానిని వండుకుని తినమని తన సిబ్బందిని కోరారని ఆయన ఆరోపించారు. ఫైజాన్, యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, నటుడికి ఉగ్రవాద అంశాలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.”నేను రాజస్థాన్ నుండి వచ్చాను. బిష్ణోయ్ కమ్యూనిటీ (రాజస్థాన్ నుండి వచ్చింది) నా స్నేహితుడు. జింకలను రక్షించడం వారి మతంలో ఉంది. కాబట్టి, జింక గురించి ముస్లిం ఇలా మాట్లాడితే అది ఖండించదగినది. కాబట్టి నేను అభ్యంతరం లేవనెత్తాను. ,” అని ఫైజాన్ మీడియాతో అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో షారూఖ్‌కు హత్యా బెదిరింపు కూడా వచ్చింది, ఆ తర్వాత ఆయనకు Y+ స్థాయి భద్రత కల్పించబడింది.

 

పాకిస్థాన్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడంటే?
ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసిన పీసీబీ.. ఐసీసీకి పంపింది. బీసీసీఐ కారణంగా కారణంగా ఐసీసీ ఇంకా షెడ్యూల్‌ను రిలీజ్ చేయని విషయం తెలిసిందే. అయితే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు వెళ్లి ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు సిద్ధంగా లేదు. టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. టీమిండియా ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని ఐసీసీ కోరింది. ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ అంగీకరించలేదని తెలుస్తోంది. తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే.. ఏకంగా టోర్నీని వీడాలని పాకిస్తాన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఇరు దేశాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు భారత్‌లో జరిగే ఏ ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని పాక్ భావిస్తోందట. ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం ఉంది. హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం, పీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుందని ఓ పీసీబీ అధికారి తెలిపారు. 2012 నుండి దాయాది దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ ఆడిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో.. టీమిండియా మ్యాచులు శ్రీలంకలో జరిగాయి.

Show comments