రేపే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దాదాపు గత నెలన్నర రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి నిన్న (గురువారం) సాయంత్రం 6 గంటలకు తెరపడింది. ఇక, రాజస్థాన్‌లో 200 నియోజకవర్గాలు ఉండగా.. 199 స్థానాలకు ఒకేరోజు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 51 వేల 756 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. రాజస్థాన్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 682 కోట్ల రూపాయల విలువైన సొత్తును అధికారులు సీజ్ చేశారు.
Read Also: Suresh Raina: సురేశ్ రైనా మెరుపులు.. హైదరాబాద్ విజయం!
ఇక, డిసెంబర్ 3వ తారీఖున ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. అయితే, మొత్తం 1875 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 183 మంది స్త్రీలు, 1692 మంది పురుషులు ఉండగా.. జోత్వారా అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 18 మంది, లాల్సోట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99, బీజేపీ 73 అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి.
Read Also: Koata Bommali PS Twitter Review: థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా.. హిట్ కొట్టినట్లేనా?
అయితే, అబు పింద్వారా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 4 వేల 921 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఉన్న షేర్‌గావ్ ప్రజలు తమ స్వగ్రామంలోని పోలింగ్ బూత్‌లో రేపు ఓటు వేయబోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు తొలిసారి తమ ఊరిలోనే ఓటు వేస్తున్నారు. 35 మంది ఓటర్లున్న బార్మర్ కా పార్, 49 మంది ఓటర్లు ఉన్న మంఝోలి, 50 మంది ఓటర్లున్న కంటల్ కా పార్ గ్రామాల్లోనూ ఈసారి పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకూండ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.