Site icon NTV Telugu

Toll Plaza: వాహనదారులపై టోల్‌ భారం.. ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ..!

Toll Plaza

Toll Plaza

విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే.. అన్నిసార్లూ టోల్‌ మోత మోగుతోంది. కాజ వద్ద మాత్రమే కాదు.. రాష్ట్రంలోని 65 టోల్‌ ప్లాజాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టోల్‌ప్లాజాల బీవోటీ గడువు ముగియడంతో.. గత అక్టోబరు నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్‌ ఫీ వసూళ్లు జరుగుతున్నాయి. దాంతో వాహనదారులపై తీవ్రంగా భారం పడుతోంది.

గత సెప్టెంబరు వరకు ఒకసారి వెళితే రూ.160, తిరుగు ప్రయాణంలో రూ.80 చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా.. టోల్‌ వసూళ్లు ఉండేవి కావు. అక్టోబరు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం.. ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం చొప్పున వసూలు చేస్తున్నారు. దాంతో పని నిమ్మిత్తం ప్రయాణించే వారిపై పెను భారం పడుతోంది. విజయవాడ-గుంటూరు మధ్య నిత్యం వందలాది మంది వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. అందరిపై టోల్‌ ఫీజు రూపంలో తీవ్ర భారం పడుతోంది.

రాష్ట్రంలో మొత్తంగా 69 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వాటిలో 65 టోల్‌ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలు అవుతుండగా.. 4 టోల్‌ ప్లాజాల్లో మాత్రం పాత విధానం అమల్లో ఉంది. విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలోని కీసర టోల్‌ ప్లాజా.. నెల్లూరు-చెన్నై హైవేలోని వెంకటాచలం, బూదరం, సూళ్లూరుపేట టోల్‌ ప్లాజాల్లో పాత నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటి గుత్తేదారుల బీవోటీ 2031లో ముగుస్తుంది. అప్పటివరకు ఈ నాలుగు ప్లాజాల్లో 24 గంటల్లోపు ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా.. ఒకసారి పూర్తిఫీజు, రెండోసారి సగం ఫీజు ఛార్జ్ చేస్తారు.

Exit mobile version