Maredumilli Selfie Video Goes Viral: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పురుగుల మందు తాగుతూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. మారేడుమిల్లి ఆర్ఎస్ రిసార్ట్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీలలో తనను అన్నయ్య, వదిన మోసం చేశారంటూ సెల్ఫీ వీడియోలో పురుగుల మందు తాగుతూ పేర్కొన్నాడు యాకూబ్ భాష అనే వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
నమ్మకద్రోహం చేసి నన్ను నట్టేట ముంచేసి నా కుటుంబాన్ని రోడ్డున పడేలా చేశారని యాకూబ్ భాష వీడియోలో పేర్కొన్నాడు. తన భార్య, పిల్లలను ఆదుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కి సెల్ఫీ వీడియోలో యాకూబ్ భాష వేడుకున్నాడు. నా చావుకు కారణమైన ఏ ఒక్కరిని వదలొద్దని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోలో కోరారు. వీడియో వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రిసార్ట్‌కు వెళ్లి ఆస్పత్రికి తరలించారు. యాకూబ్ బాషా మారేడుమిల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.