Today Stock Market Roundup 10-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు.. అంటే.. ఇవాళ శుక్రవారం కూడా నష్టాలు కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో కీలక సూచీలు రోజంతా కోలుకోలేదు. ఉదయం నష్టాలతో ప్రారంభమై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఫలితంగా.. సెన్సెక్స్, నిఫ్టీ.. రెండూ కూడా బెంచ్‌మార్క్ విలువలకు దిగువనే నమోదయ్యాయి.
సెన్సెక్స్ 671 పాయింట్లు కోల్పోయి 59 వేల 135 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 176 పాయింట్లు తగ్గి 17 వేల 412 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 9 కంపెనీలు మాత్రమే రాణించగా మిగతా 21 కంపెనీలు వెనకబడ్డాయి.
read more: Singapore Airlines: సింగపూర్ ఎయిర్‌లైన్స్ విలీనంతో భారీగా ‘విస్తారం’
బీఎస్‌ఈలో అదానీ పవర్, బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్, ఐసీఐసీఐ, కొటక్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోయింది.
నిఫ్టీలో టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ లాభపడగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌డీఎఫ్‌సీ, అపోలో హాస్పిటల్స్ 3 శాతం వరకు దిగొచ్చాయి. రంగాల వారీగా చూస్తే.. ఫైనాన్షియల్ సంస్థల స్టాక్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, మహింద్రా అండ్ మహింద్రా, ఏసియన్ పెయింట్స్ ఒకటిన్నర శాతం వరకు డౌన్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 81 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 55 వేల 382 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 160 రూపాయలు తగ్గింది. అత్యధికంగా 61 వేల 824 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 99 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 178 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూలో పెద్దగా మార్పులేదు. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 2 పైసల వద్ద స్థిరపడింది.