Today Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందటంతో ఇవాళ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన కీలక సూచీలు ఇంట్రాడేలో మరింతగా డౌన్ అయ్యాయి.
ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్లు బక్కచిక్కటంతో సెన్సెక్స్, నిఫ్టీ పడిపోయాయి. అయితే.. అంతర్జాతీయ మార్కెట్లలో రేట్లు పడిపోవటం వల్ల మెటల్ స్టాక్స్ రాణించటం కాస్త చెప్పుకోదగ్గ అంశం. సెన్సెక్స్ 159 పాయింట్లు తగ్గి 59 వేల 567 పాయింట్ల వద్ద ముగిసింది.
read more: American Banks Performance: అమెరికా బ్యాంకులకు అనుకోని లాభాలు. సంక్షోభ ప్రభావం శూన్యం
నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 17 వేల 618 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 10 కంపెనీల షేర్లు మాత్రమే ఎక్కువ విలువ వద్ద సెటిల్ అయ్యాయి. మిగతా 20 కంపెనీల స్టాక్స్ వీక్ అయ్యాయి.
వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. రేఖా ఝున్‌ఝున్‌వాలా స్టాక్.. 15 ఏళ్లకు పైగా విరామం అనంతరం సరికొత్త శిఖరానికి చేరింది. మరో వైపు.. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఏసియన్ పెయింట్స్, విప్రో, హెచ్‌యూఎల్, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ బాగా వెనకబడ్డాయి.
రంగాల వారీగా చూసుకుంటే.. మెటల్ సూచీ సున్నా పాయింట్ 5 శాతం పెరగ్గా.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక శాతం తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సూచీ సున్నా పాయింట్ 9 శాతం దిగజారింది. పది గ్రాముల బంగారం ధర 667 రూపాయలు తగ్గి.. గరిష్టంగా 59 వేల 821 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు ఏకంగా వెయ్యీ పది రూపాయలు పడిపోయి.. అత్యధికంగా 74 వేల 239 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 161 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 518 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 19 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 25 పైసల వద్ద స్థిరపడింది.