American Banks Performance: అగ్ర రాజ్యం అమెరికాలోని టాప్ లెవల్ బ్యాంకులు పెర్‌ఫార్మెన్స్ విషయంలో అదరగొట్టాయి. మొదటి త్రైమాసికంలో మంచి పలితాలను నమోదుచేశాయి. ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావాన్ని విజయవంతంగా అధిగమించి అనూహ్యంగా లాభాలను ఆర్జించాయి.
జేపీ మోర్గాన్ ఛేజ్, వెల్స్ ఫార్గో, సిటీ గ్రూప్ మరియు పీఎన్‌సీ ఫైనాన్షియల్ బ్యాంకులు ఇన్వెస్టర్ల అంచనాలను మించి రాణించటం చెప్పుకోదగ్గ అంశం. సిలికాన్ వ్యాలీ, క్రెడిట్ సూయిజ్, సిగ్నేచర్ బ్యాంక్‌లు కుప్పకూలటంతో ఈ ఇండస్ట్రీ ఇటీవల భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే.
read more: Apple First Retail Store in India: ఏడేళ్ల యాపిల్ కల.. నెరవేరిన వేళ..
అయితే.. ఇలాంటి పరిస్థితి నుంచి అమెరికా బ్యాంకులు తిరిగి కోలుకున్నాయనటానికి తాజా ఆర్థిక ఫలితాలే నిదర్శనమని నిపుణులు అంటున్నారు. జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కంపెనీ ఫస్ట్ క్వార్టర్ లాభాల్లో 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. వడ్డీ రేట్లు పెరగటం, ఫలితంగా రుణాలపై అధిక ఛార్జీలు విధించటం కలిసొచ్చింది.
సిలికాన్ వ్యాలీ మరియు సిగ్నేచర్ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో కస్టమర్లు, వ్యాపార సంస్థలు జేపీ మోర్గాన్ చెంతకు చేరటంతో డిపాజిట్లు గణనీయంగా పెరిగాయి. వెల్స్ ఫార్గో అండ్ కంపెనీ.. ఫస్ట్ క్వార్టర్‌లో ముందస్తు అంచనాలను పటాపంచలు చేసింది.
వడ్డీ రేట్లు పెరగటం వల్ల ఈ బ్యాంక్ ఆదాయం కూడా పైపైకి లేచింది. దీన్నిబట్టి.. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని పరిశీలకులు పేర్కొన్నారు. ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తే మాత్రం పనితీరు మందగిస్తుందని ఆందోళన వెలిబుచ్చారు.
వెల్స్ ఫార్గో బ్యాంక్.. రుణాల వల్ల కలిగే నష్టాల నుంచి బయటపడేందుకు ఒకటీ పాయింట్ రెండు ఒకటి బిలియన్ డాలర్లను పక్కన పెట్టడం విశేషం. అంతకుముందు ఏడాదిలో ఈ మేరకు 787 మిలియన్ డాలర్లను మాత్రమే ఇవ్వటం గమనించాల్సిన అంశం.
ఈ అధిక కేటాయింపుల వల్ల బ్యాంక్ షేర్ల విలువ ప్రి-మార్కెట్ ట్రేడింగ్‌లో 4.14 శాతం పెరిగింది. తద్వారా వడ్డీల వల్ల వచ్చిన నికర ఆదాయం 45 శాతం వృద్ధి చెంది 13 పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్లకు చేరింది. సిటీ గ్రూప్ సైతం ఆశ్చర్యకరంగా మొదటి త్రైమాసికం లాభాల్లో పురోగతి సాధించింది.
స్థిర ఆదాయం కలిగిన వాణిజ్య వర్గాలు.. పెరిగిన వడ్డీ రేట్ల నుంచి ప్రయోజం పొందేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయటం ప్లస్ పాయింట్ అయింది. కరెన్సీలు, కమోడిటీల ట్రేడింగ్, ఫిక్స్‌డ్ ఇన్‌కంల ద్వారా రెవెన్యూ రావటం సానుకూలంగా మారింది.
దీంతో ఆదాయం అనూహ్యంగా నాలుగు శాతం పెరిగి నాలుగున్నర బిలియన్ డాలర్లకు చేరింది. నికర ఆదాయం 7 శాతం వృద్ధి చెంది నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా నమోదైంది. పీఎన్‌సీ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ మొదటి త్రైమాసికంలో 18 పాయింట్ 5 శాతం ఎక్కువ లాభాన్ని సొంతం చేసుకుంది.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచటంతో ప్రాంతీయ బ్యాంకుల నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కం ఒక్కసారిగా పెరిగింది. షేర్ల విలువ ప్రిమార్కెట్ ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం పెరిగింది.