Today Stock Market Roundup 03-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ట్రేడింగ్‌ని లాభాలతో ప్రారంభించి లాభాలతోనే ముగించింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల వార్తల ప్రభావంతో కొద్దిసేపటికే నష్టాల బాట పట్టాయి. ఇంట్రాడేలో తిరిగి పుంజుకున్నాయి.
ఆటోమొబైల్ కంపెనీలతోపాటు కొన్ని ఫైనాన్షియల్ సంస్థల స్టాక్స్ కొనుగోళ్లు ఊపందుకోవటం కలిసొచ్చింది. సెన్సెక్స్‌లో మారుతీ సంస్థ షేర్ల విలువ రెండున్నర శాతం పెరిగింది. ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, టైటాన్ మరియు బజాజ్ ట్విన్స్ కూడా బాగానే రాణించాయి. మణప్పురం షేరు విలువ వారం రోజుల్లో 11 శాతం పెరిగింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరింది. మరోవైపు.. ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐటీసీ స్టాక్స్ వ్యాల్యూ ఒక శాతం చొప్పున తగ్గింది.
read more: Sleeping in Office: నిద్ర కోసం సెలవు కూడా ఇచ్చిన కంపెనీ
సెన్సెక్స్ 114 పాయింట్లు పెరిగి 59 వేల 106 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ స్వల్పంగా 38 పాయింట్లు పెరిగి 17 వేల 398 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 22 కంపెనీలు లాభాల బాట పట్టగా 8 కంపెనీలు మాత్రమే నష్టపోయాయి.
రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ మంచి పనితీరు కనబరిచింది. ఒక శాతానికి పైగా లాభాన్ని ఆర్జించింది. ఐటీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు డౌన్ అయ్యాయి.
10 గ్రాముల బంగారం ధర 102 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 59 వేల 300 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.కేజీ వెండి రేటు 368 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 71 వేల 850 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 355 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 554 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 11 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 34 పైసల వద్ద స్థిరపడింది.