Site icon NTV Telugu

Today Business Headlines 25-03-23: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్‌ సూపర్‌ మార్కెట్‌. మరిన్ని వార్తలు

Today Business Headlines 25 03 23

Today Business Headlines 25 03 23

Today Business Headlines 25-03-23:

తెలంగాణలో తొలిసారిగా..

తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్‌ మార్ట్‌ హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్‌ మార్కెట్‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. దీని మెయింటనెన్స్‌లో భాగంగా 65 లక్షల రూపాయలతో ధాన్యం గోడౌన్‌, 35 లక్షల రూపాయలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ బిల్డింగ్‌ కట్టారు. గ్రామీణ ప్రజల కోసం ఇందులో 500 రకాలకు పైగా నిత్యావసర సరుకులను గరిష్ట రిటైల్‌ ధర కన్నా 5 శాతం తక్కువే అమ్ముతున్నారు. ఈ రూరల్‌ మార్ట్‌ని నందనం కర్షక సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

ఉపాసనకి అరుదైన గౌరవం

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తేజ్‌ భార్య ఉపాసనకు అరుదైన గౌరవం లభించింది. మోస్ట్‌ ప్రామిసింగ్‌ బిజినెస్‌ లీడర్స్‌ ఆసియా 2022-23 లిస్టులో చోటు దక్కింది. ఎకనామిక్‌ టైమ్స్‌వాళ్లు ఆమెకు ఈ ప్రత్యేక గుర్తింపు ఇవ్వటం విశేషం. అపోలో హాస్పిటల్స్‌ అధినేత ప్రతాప్‌రెడ్డి మనవరాలైన ఉపాసన.. ప్రస్తుతం అపోలో ఛారిటీకి వైస్‌ ప్రెసెడెంట్‌గా ఉన్నారు. B పాజిటివ్‌ అనే హెల్త్‌ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ట్రిపుల్‌ R సినిమా పాటకు ఆస్కార్‌ అవార్డు పొందటం ద్వారా ఒక వైపు భర్త రామ్‌చరణ్‌తేజ్‌.. మరోవైపు భార్య ఉపాసన ఈవిధంగా.. ఒకే సమయంలో మెరవటం గమనించాల్సిన అంశం.

EPFO వడ్డీ రేటు ఎంత?

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ.. EPFO.. వడ్డీ రేటు త్వరలో ఖరారు కానుంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల మీటింగ్‌ ఈ నెల 27, 28 తేదీల్లో జరగనుండటంతో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అంశాన్ని CBTల సమావేశపు అజెండాగా చేర్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో EPFO వడ్డీ రేటును 8 పాయింట్‌ ఒకటీ సున్నా శాతంగా అమలుచేసిన సంగతి తెలిసిందే. 2022-23లో కూడా ఇదే కొనసాగుతుందా? లేక ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయా అనేది రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. ఈ మేరకు వార్షిక నివేదికలు, నిల్వలు, లోటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

రష్యా సంస్థల టెండర్లు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వందే భారత్‌ రైళ్ల తయారీ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు దేశీయ సంస్థలతోపాటు విదేశీ సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. వందే భారత్‌ రైళ్లను భారతదేశ ప్రమాణాలకు తగ్గట్లు తయారుచేసేందుకు రష్యాకు చెందిన కంపెనీలు టెండర్లు వేశాయి. JSC మెట్రో వాగన్‌మష్‌, మితీష్‌చి అనే సంస్థలు ఇండియాలోని జాయింట్‌ స్టాక్‌ కంపెనీ లోకోమోటివ్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ మరియు రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌తో కలిసి ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. ఈ విషయాలను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు.

RBI ఎంపీసీ 6 సార్లు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ కొత్త ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6 సార్లు భేటీ కానుంది. మొదటి సమావేశాన్ని ఏప్రిల్‌ 3-6 తేదీల్లో నిర్వహించనున్నారు. రెండోది.. జూన్‌ 6-8 తేదీల్లో, మూడోది.. ఆగస్టు 8-10 తేదీల్లో, నాలుగోది అక్టోబర్‌ 4-6 తేదీల్లో, ఐదోది డిసెంబర్‌ 6-8 తేదీల్లో, 6వ సమావేశం ఫిబ్రవరి 6-8 తేదీల్లో జరగనుంది. వడ్డీ రేట్లను నిర్ణయించే ఈ కమిటీ మీటింగ్‌ని RBI గవర్నర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తారు. ఈ ప్యానెల్‌లో RBI నుంచి ఇద్దరు, బయటి వ్యక్తులు ముగ్గురు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. షెడ్యూలును విడుదల చేసింది.

జియోని దాటేసి..

5జీ సేవల విస్తరణ విషయంలో ఎయిర్‌టెల్‌.. జియోని దాటేసింది. లేటెస్ట్‌గా 235 సిటీలను ఈ నెట్‌వర్క్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో 5జీ సర్వీసులు అందుతున్న మొత్తం నగరాల సంఖ్య 500లకు చేరింది. ఈ మేరకు భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ ఒక ప్రకటన చేసింది. నిత్యం 30 నుంచి 40 నగరాలకు విస్తరిస్తున్నామని తెలిపింది. టెలికం రంగంలో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న రిలయెన్స్‌ జియో మాత్రం ప్రస్తుతానికి 406 సిటీలకే పరిమితమైంది. దీన్నిబట్టి చూస్తే ఎయిర్‌టెల్‌ ఎంత దూకుడు ప్రదర్శిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version