Today Business Headlines 10-04-23:
త్వరలో రిలయెన్స్ ఐస్‌క్రీం
ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ రిటైల్ సొంతగా ఐస్‌క్రీం బ్రాండ్‌ను లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన ఒక కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీఅనుకున్నట్లు జరిగితే ఈ ఎండాకాలంలోనే రిలయెన్స్ బ్రాండ్ ఐస్‌క్రీం మార్కెట్లోకి రానుందని అంటున్నారు. రిలయెన్స్ ఇప్పటికే కూల్ డ్రింకులు, సోపులు మరియు గృహ సంరక్షణ ఉత్పత్తుల్లో సొంత బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఐస్ క్రీం మార్కెట్ విలువ 20 వేల కోట్ల రూపాయలుగా ఉంది.
60 వేల కోట్లకు ‘అమూల్’
అమూల్ బ్రాండెడ్ కంపెనీ ఆదాయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 66 వేల కోట్ల రూపాయలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. డిమాండ్ పెరగటం వల్ల 20 శాతం గ్రోత్ నమోదు కానుందని భావిస్తున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ 18 పాయింట్ 5 శాతం వృద్ధి చెందింది. తద్వారా 55 వేల 55 కోట్ల రూపాయలకు చేరుకుంది. కరోనా తర్వాత బ్రాండెడ్ డెయిరీ ప్రొడక్టులకు గిరాకీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాల రేటు పెంచే ప్రణాళికలేమీ లేవని అమూల్ ఎండీ జయేన్ మెహతా పేర్కొన్నారు.
కొనసాగిన ఎఫ్‌పీఐల సేల్స్
కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో ఫారన్ పోర్ట్‌ఫోలియో ఇన్‌స్టిట్యూషన్స్ సేల్స్ ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఒకటీ పాయింట్ 4 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా గత సంవత్సరం 37 వేల 631 కోట్ల విలువైన షేర్లను మాత్రమే అమ్మాయి. ఎఫ్‌పీఐలు వరుసగా రెండేళ్ల పాటు అమ్మకాలకు దిగటం ఇదే తొలిసారి. అగ్రరాజ్యం అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం దీనికి ప్రధాన కారణం.
తగ్గిన బంగారం దిగుమతి
మన దేశానికి పసిడి దిగుమతులు పడిపోతున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఇండియా దాదాపు 2 పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల విలువైన 6 వందల టన్నుల బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 30 శాతం తక్కువ. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసింది. దిగుమతి సుంకాలు అధికంగా ఉండటం మరియు అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనటం పుత్తడి దిగుమతులను దెబ్బతీశాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అందువల్లే గత ఆగస్టు నెల నుంచి ఇంపోర్టులు నేల చూపులు చూశాయి.
కొత్త ఇన్వెస్టర్లు 2.5 కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి కొత్త పెట్టుబడిదారులు భారీ సంఖ్యలోనే చేరారు. రెండున్నర కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. అంటే.. నెలకి యావరేజ్‌గా 20 లక్షల ఖాతాలు తెరుచుకున్నాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 11 పాయింట్ నాలుగు ఐదు కోట్లకు చేరింది. అంతకుముందు ఈ అకౌంట్ల సంఖ్య 8 పాయింట్ తొమ్మిదీ ఏడు కోట్లు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. దీన్నిబట్టి చూస్తే 27 శాతం గ్రోత్ నమోదైందని చెప్పొచ్చు.
‘వైజాగ్’ కోసం తెలంగాణ బిడ్
విశాఖ ఉక్కును సొంతం చేసుకోవటంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రస్ట్‌గా ఉంది. ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించింది. సింగరేణి ద్వారా బిడ్ వేయటానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో సింగరేణి సంస్థ అధికారులు ఇవాళో రేపో విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెక్ పెట్టబోతోంది. విశాఖ స్టీల్‌ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకోనుంది.