Today Business Headlines 08-04-23:
షాపులు 24 గంటలు ఓపెన్
బిజినెస్‌కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. షాపులను, సంస్థలను 24 గంటలు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు ఏడాదికి 10 వేల రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. దీంతోపాటు కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. షాపుల్లో పనిచేసే ఉద్యోగులు మరియు సిబ్బందికి సంబంధించి రికార్డులను మెయిన్‌టెయిన్ చేయాలని.. ఐడీ కార్డులు ఇవ్వటంతోపాటు వాటిపై షిఫ్ట్ టైమింగ్స్ ప్రింట్ చేయాలని సూచించింది. నిబంధనల ప్రకారం వర్కింగ్ అవర్స్ నిర్ణయించాలని, ఎక్‌స్ట్రా టైం పనిచేస్తే ఓటీ ఇవ్వాలని ఆదేశించింది. వీక్లీ ఆఫ్‌లు, పండగ సెలవులు ఇవ్వాలని, మహిళా సిబ్బందికి వాళ్ల అనుమతితోనే నైట్ షిఫ్ట్‌లు వేయాలని స్పష్టం చేసింది.
తగ్గిన విదేశీ మారక నిల్వలు
గత ఆర్థిక సంవత్సరంతో ముగిసిన వారంలో మన దేశ విదేశీ మారక నిల్వలు దాదాపు 2 వేల 700 కోట్ల రూపాయలు తగ్గాయి. తద్వారా మొత్తం నిల్వలు 47 పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద ఫారెక్స్ రిజర్వ్స్ 28 పాయింట్ ఎనిమిదీ ఆరు బిలియన్ డాలర్లు తగ్గాయి. బంగారం నిల్వలు 279 మిలియన్ డాలర్లు తగ్గి 45 పాయింట్ రెండు సున్నా బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద ఇండియా నిల్వలు 14 మిలియన్ డాలర్లు తగ్గి 5 పాయింట్ ఒకటీ ఆరు బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ తెలిపింది.
జెస్ట్‌మనీలో 100 మంది ఔట్
లేఆఫ్ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా.. ఫిన్‌టెక్ సంస్థ జెస్ట్‌మనీ కూడా ఈ బాట పట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బై నౌ పే లేటర్ సర్వీసులు అందిస్తున్న ఈ కంపెనీ తన మొత్తం సిబ్బందిలో 20 శాతానికి సమానమైన స్టా్ఫ్‌కి పింక్ స్లిప్‌లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఈమధ్యే ఫోన్‌పేతో కొనుగోలు ఒప్పంద ప్రయత్నం చేయగా ఫెయిల్ అయింది. ఇది జరిగిన కొన్నాళ్లకే దాదాపు 100 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రెడీ అవుతుండటం గమనించాల్సి అంశం. బిజినెస్‌ను కొనసాగించటం.. మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించటంలో భాగంగా లేఆఫ్ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
5 రోజుల్లో 10 లక్షల కోట్లు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారుల సంపద 5 రోజుల్లోనే 10 పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. తద్వారా మొత్తం సంపద 262 పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లకు పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావటం.. విదేశీ కొనుగోళ్లు పెరగటం వల్లే ఇది సాధ్యమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 2 వేల 2 వందల 19 పాయింట్లకు పైగా లాభపడింది. శాతాల్లో చెప్పాలంటే.. 3 పాయింట్ ఎనిమిదీ ఐదు శాతం పెరిగింది.
ఆరేళ్ల గరిష్టానికి చక్కెర ధర
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పంచదార ధర ఆరేళ్ల గరిష్టానికి చేరింది. నిన్న శుక్రవారం ఒక్క రోజే 2 పాయింట్ 2 శాతం పెరిగింది. 2016 అక్టోబర్ తర్వాత ఈ రేంజులో పెరగటం ఇదే తొలిసారి. ప్రొడక్షన్ తగ్గటంతోపాటు ఎక్స్‌పోర్టులకు ఇండియా ఫుల్‌స్టాప్ పెడుతోందనే వార్తల నేపథ్యంలో రేట్లు భగ్గుమన్నాయి. థాయ్‌ల్యాండ్ మరియు పాకిస్థాన్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. న్యూయార్క్ మార్కెట్‌లో ఒక పౌండ్ షుగర్ రేటు 23 పాయింట్ నాలుగు ఆరు సెంట్లకు చేరింది. రూపాయల్లో చెప్పాలంటే.. ఇది.. 20 రూపాయల 50 పైసలకు సమానం. క్రూడాయిల్ రేట్లు పెరగటం వల్ల ఇండియా మరియు బ్రెజిల్ దేశాలు ఎక్కువ మొత్తంలో చెరకును ఇథనాల్ తయారీ కోసం వాడనున్నాయనే వార్తలు సైతం షుగర్ రేట్లు పెరగటానికి దారితీశాయి.
రికార్డు స్థాయిలో రెమిటెన్స్‌లు
విదేశాల్లో ఉంటున్న భారతీయులు గతేడాది 8 పాయింట్ ఎనిమిదీ రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా డబ్బును ఇండియాకు పంపారు. దీంతో.. రెమిటెన్స్‌ల విషయంలో.. ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వరల్డ్ బ్యాంక్ అంచనా కన్నా 750 కోట్ల డాలర్లు ఎక్కువ వచ్చినట్లు తెలిపారు. రెమిటెన్స్‌లు పెరగటం వల్ల ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్ కూడా 60 వేల కోట్ల డాలర్లకు చేరుకున్నాయని చెప్పారు. ఎన్నారైలు పంపిన ఫండ్స్.. జీడీపీలో 3 శాతానికి చేరుకున్నాయి.