Today Business Headlines 07-04-23:
‘సచిన్’కి తనిష్క్ కానుక
ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరుతో వజ్రాభరణాలు అందుబాటులోకి వచ్చాయి. టాటా గ్రూపునకు చెందిన తనిష్క్ జ్యూలరీ కంపెనీ.. ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 24వ తేదీన సచిన్ 50వ పుట్టిన రోజు జరుపుకోనుండటంతో వీటిని తయారుచేయించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దానికి గుర్తుగా తనిష్క్ సంస్థ హండ్రెడ్ లిమిటెడ్ ఎడిషన్ సొలిటైర్ డైమండ్ జ్యూలరీ కలెక్షన్ ని మార్కెట్ లోకి తెచ్చింది. వీటికి.. సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండుల్కర్ అనే పేరు పెట్టింది.
40,710 కోట్లు మంజూరు
స్టాండప్ ఇండియా పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 40 వేల 710 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 80 శాతం నిధులను లేడీస్ కే ఇచ్చారు. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారుచేసేందుకు ఈ పథకాన్ని ఏడేళ్ల కిందట.. అంటే.. 2016 ఏప్రిల్ 5న ప్రారంభించారు. ఇందులో.. మ్యానిఫ్యాక్షరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, అగ్రికల్చర్ అనుబంధ రంగాల్లో బిజినెస్ ప్రారంభించాలనుకునేవారికి రుణాలు అందజేస్తారు. ఈ పథకాన్ని 2025 వరకు అమలుచేస్తారు.
ఇండియన్ బ్యాంక్ కి ఫైన్
నో యువర్ కస్టమర్.. కేవైసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించనందుకు ఇండియన్ బ్యాంక్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 55 లక్షల రూపాయల జరిమానా విధించింది. లోన్లు మంజూరు చేసే సమయంలో వడ్డీ రేట్లకు సంబంధించిన నియమనిబంధనలను ఉల్లంఘించినందుకు మహింద్రా అండ్ మహింద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కు 6 కోట్ల 77 లక్షల రూపాయలు ఫైన్ వేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో మోసాల నివారణ కోసం పాటించాల్సిన విధివిధానాలను పట్టించుకోనందుకు ముత్తూట్ మనీకి పదిన్నర లక్షలు జరిమానా పడింది.
సిద్ధార్ధ మల్హోత్ర.. ప్రచారకర్త
ఫ్యాషన్ డ్రస్సులకు సంబంధించిన బ్రాండెడ్ కంపెనీ జాన్ ప్లేయర్స్.. బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ మల్హోత్రాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో.. స్ర్పింగ్ సమ్మర్ 23 పేరుతో కొత్త కలెక్షన్ ని అందుబాటులోకి తెచ్చింది. జాన్ ప్లేయర్స్ బ్రాండ్ ని సరికొత్త రూపంలో ఈమధ్యనే తిరిగి విడుదల చేసింది. ప్లే ఇట్ రియల్ అనే పేరుతో యువతను లక్ష్యంగా చేసుకొని ఈ బ్రాండ్ ని తీర్చిదిద్దింది. సిద్ధార్థ మల్హోత్రా ప్రచారంతో తమ ఉత్పత్తులు అందరికీ చేరువ అవుతాయని పేర్కొంది.
అక్షతమూర్తి.. భావోద్వేగం
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణ సుధామూర్తి పద్మభూషణ్ అవార్డును స్వీకరించటం పట్ల ఆమె కుమార్తె, బ్రిటన్ ఫస్ట్ లేడీ అక్షతా మూర్తి భావోద్వేగంగా స్పందించారు. తన తల్లి ఎప్పుడూ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతోనే ఉండేవారు తప్ప గుర్తింపు కోసం, ప్రచారం కోసం పనిచేయలేదని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవటాన్ని మాటల్లో వర్ణించలేనని అన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి అయిన అక్షతామూర్తి ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
రేపే పీఎం రిబ్బన్ కటింగ్
చెన్నై విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు శనివారం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే చెన్నై నగరంలోని మౌలిక సదుపాయాలకు అదనపు బలం చేకూరుతుందని చెప్పారు. ఈ నిర్మాణం.. కనెక్టివిటీని పెంచుతుందని, లోకల్ ఎకానమీకి బూస్ట్ మాదిరిగా బెనెఫిట్ అవుతుందని తెలిపారు. ఈ కొత్త టెర్మినల్ ను 12 వందల 60 కోట్ల ఖర్చుతో నిర్మించారు.