Today Business Headlines 06-05-23:
రైల్వే ప్రింటింగ్ క్లోజ్
సికింద్రాబాద్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. దీంతో.. 144 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థ ఇక గతంలా మిగిలిపోనుంది. రైల్వే రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లను ఇన్నాళ్లూ ఇక్కడే ముద్రించేవాళ్లు. సికింద్రాబాద్ ప్రింటింగ్ ప్రెస్‌తోపాటు బైకులా-ముంబై, హావ్‌డా, శకుర్‌బస్తీ-ఢిల్లీ, రాయపురం-చెన్నై ప్రింటింగ్ ప్రెస్‌లను కూడా మూసివేయనున్నారు. ఈ మేరకు రైల్వే బోర్డ్ డైరెక్టర్ గౌరవ్ కుమార్.. సంబంధిత రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
తగ్గిన మద్యం రేట్లు
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయి. బాటిల్ సైజ్‌ను బట్టి కనీసం 10 రూపాయల నుంచి 40 రూపాయల వరకు దిగొచ్చాయి. ఫుల్ బాటిల్ రేటు 40 రూపాయలు, 375 మిల్లీ లీటర్లకు 20 రూపాయలు, 180 మిల్లీ లీటర్లకు 10 రూపాయలు తగ్గాయి. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. నిన్న శుక్రవారం నుంచి తయారయ్యే మద్యం సీసాలపై కొత్త రేట్లు ఉంటాయి. గురువారం వరకు ఉన్న స్టాక్ మీద పాత ధరలే అమలవుతాయి. అయితే.. బీర్ల ధరల్లో మాత్రం మార్పు లేకపోవటం గమనించాల్సిన విషయం.
టెండర్లు పిలవటమే
శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించే మెట్రోరైల్‌కి సంబంధించిన టెండర్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్.. హెచ్ఏఎంఎల్ అనుకుంటోంది. ఈ మేరకు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఎంపికను ఇప్పటికే పూర్తి చేసింది. ఇక.. మిగిలింది.. టెండర్ల ప్రక్రియేనని అంటున్నారు. ఈ టెండర్ల పనులను త్వరగా చేపట్టేలా ప్రాసెస్ ప్రారంభించాలని ఇంజనీరింగ్ కన్సల్టెంట్ సంస్థకు మెట్రోరైల్ సంస్థ సూచిస్తోంది. 31 కిలోమీటర్ల పొడవున మూడేళ్లలో పూర్తిచేయాల్సి ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6 వేల 250 కోట్ల రూపాయలు.
22 సంస్థలకి ఆధార్
కస్టమర్లను లేదా క్లయింట్లను ఆధార్ నంబర్ ఆధారంగా ధ్రువీకరించుకునేందుకు 22 ఆర్థిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ కంపెనీల లిస్టులో గోద్రెజ్ ఫైనాన్స్, అమేజాన్ పే ఇండియా, ఆదిత్య బిర్లా హౌజింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహింద్రా రూరల్ హౌజింగ్ ఫైనాన్స్, హీరో ఫిన్‌కార్ప్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇప్పటివరకు బ్యాంకింగ్ సంస్థలకు మాత్రమే ఈ అనుమతులు లభించగా ఇప్పుడు మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం కింద రిపోర్ట్ చేస్తున్న సంస్థలకు కూడా ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
251 మందికి లేఆఫ్
ఇ-కామర్స్ సంస్థ మీషో 251 మందిని ఇంటికి పంపింది. వీళ్లు.. మొత్తం సిబ్బందిలో 15 శాతానికి సమానం. ఖర్చులను తగ్గించుకోవటంతోపాటు లాభాలను పెంచుకోవటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీషో పేర్కొంది. లేఆఫ్‌కి గురైన ఉద్యోగులందరూ నోటీస్ పీరియెడ్‌తోపాటు ఒక నెల వేతనాన్ని అదనంగా పొందుతారని తెలిపింది. కంపెనీలో ఎన్నాళ్లు పనిచేశారనేదాంతో సంబంధం లేకుండా షేర్లు సైతం సొంతం చేసుకుంటారని వెల్లడించింది. మీషో సంస్థ రెండేళ్ల వ్యవధిలో 10 రెట్లు గ్రోత్ సాధించిందని ఫౌండర్ అండ్ సీఈఓ విదిత్ ఆత్రే చెప్పారు.
మళ్లీ పెరిగిన ‘ఫారెక్స్’
మన దేశంలో విదేశీ మారక నిల్వలు మరోసారి పెరిగాయి. ఏప్రిల్ 28వ తేదీతో ముగిసినవారంలో 453 కోట్ల డాలర్లకు పైగా వృద్ధి చెందాయి. తద్వారా మొత్తం నిల్వల విలువ 58 వేల 878 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ రిజర్వ్స్.. రికార్డు స్థాయిలో.. లైఫ్ టైం హయ్యస్ట్ లెవల్ అయిన 64 వేల 500 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆ తర్వాత.. విదేశీ ఆటుపోట్ల నుంచి మన రూపాయిని రక్షించుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక నిల్వలను వాడుకుంది. దీంతో అవి నేలచూపులు చూశాయి. మళ్లీ ఇప్పుడు పెరుగుతుండటం విశేషం.