NTV Telugu Site icon

Today (30-12-22) Business Headlines: సినీ నటి శారద చాక్లెట్ కంపెనీ రిలయెన్స్ చేతికి. మరిన్ని ముఖ్య వార్తలు

Today (30 12 22) Business Headlines

Today (30 12 22) Business Headlines

Today (30-12-22) Business Headlines:

‘హైదరాబాద్ చాక్లెట్’ కొన్న రిలయెన్స్

సీనియర్‌ మోస్ట్‌ సినీ నటి శారద మరియు విజయ రాఘవన్‌ నంబియార్‌ సంయుక్తంగా 1988వ సంవత్సరంలో ప్రారంభించిన లోటస్ చాక్లెట్‌ కంపెనీని.. రిలయెన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చాక్లెట్‌ కంపెనీ ప్రస్తుతం సింగపూర్‌ సంస్థ సన్‌షైన్‌ అలైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అనుబంధంగా.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా దౌలతాబాద్‌లో యూనిట్‌ కలిగిన ఈ కంపెనీలో మెజారిటీ వాటాను.. అంటే.. 51 శాతం షేరును రిలయెన్స్‌ సొంతం చేసుకుంది. ఒక్కో షేరుకు 113 రూపాయల చొప్పున మొత్తం 74 కోట్ల రూపాయలు చెల్లించనుంది.

‘మొండి’తనం తగ్గిందన్న ఆర్‌బీఐ

బ్యాంకులకు మొండి బకాయిలు భారీగా తగ్గాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు ఏడేళ్ల కనిష్టానికి దిగొచ్చాయని 26వ ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొంది. గ్రాస్‌ నాన్‌ పెర్‌ఫామింగ్‌ అసెట్స్‌ 5 శాతానికి.. నెట్‌ ఎన్‌పీఏలు పదేళ్ల కనిష్టానికి కరిగి.. ఒకటీ పాయింట్‌ 3 శాతానికి చేరాయని వెల్లడించింది. సెప్టెంబర్‌ వరకు అందుబాటులో ఉన్న ఈ వివరాలను నిన్న గురువారం విడుదల చేసిన రిపోర్ట్‌లో పొందుపరిచింది. దేశంలోని బ్యాంకుల్లో మూలధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, ఆర్థిక మాంద్యం లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా తట్టుకోగలవని ధీమా వ్యక్తం చేసింది.

వచ్చే ఏడాది మరో రెండు ఎఫ్‌టీఏలు

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) నిన్న గురువారం నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మన దేశం.. వచ్చే సంవత్సరం.. కనీసం మరో రెండు స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడికలపై సంతకాలు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు. భారత్‌తో ఈ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రిటన్‌, ఐరోపా కూటమి, కెనడా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. వివిధ దేశాల వాణిజ్య శాఖల అధికారులతో మన వాణిజ్య శాఖ అధికారుల సమావేశం జనవరిలో నిర్వహించనున్నామని ప్రకటించారు.

‘మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్‌ ఫౌండర్‌ గౌతమ్‌ అదానీని ‘మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అని అభివర్ణించొచ్చు. ఎందుకంటే.. ఆయన సంపద ఈ సంవత్సరం భారీగా పెరిగింది. మన దేశంలో అత్యంత సంపన్నుడిగా మరియు ప్రపంచంలో 3వ పెద్ద కుబేరుడిగా నిలిచారు. ఆసియా బిజియెస్ట్‌ డీల్‌ మేకర్‌ అనే కిరీటాన్ని సైతం బ్లూమ్‌బర్గ్‌ సంస్థ నుంచి పొందారు. ఈ కంపెనీ రూపొందించిన 10 మంది బిలియనీర్ల లిస్టులో.. 2022లో.. ఎక్కువ సంపాదించిన ఏకైక వ్యక్తి గౌతమ్‌ అదానీయే కావటం విశేషం. జాబితాలోని మిగతా 9 మంది 259 బిలియన్‌ డాలర్లకు పైగా సంపదను కోల్పోగా ఈయన మాత్రం 44 పాయింట్‌ 6 బిలియన్‌ డాలర్లను సొంతం చేసుకున్నారు.

భారీ తెరతో శామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫ్రిజ్‌

శామ్‌సంగ్‌ సంస్థ సరికొత్త స్మార్ట్‌ ఫ్రిజ్‌ను ఆవిష్కరించింది. ఇందులో.. 32 అంగుళాల పరిమాణంలో ఉండే భారీ తెరను అమర్చటం చెప్పుకోదగ్గ విషయం. ఈ వర్టికల్‌ టచ్‌ స్క్రీన్‌లో టిక్‌టాక్‌ వీడియోలు, అమేజాన్‌ ఆర్డర్లు తదితరాలను చూడొచ్చు. తద్వారా వంట గదిని హోం థియేటర్‌లా ఫీలవ్వొచ్చన్నమాట. ఈ ఫ్రిజ్‌ను ‘‘బిస్పోక్‌ రిఫ్రిజిరేటర్‌ ఫ్యామిలీ హబ్‌ ప్లస్‌’’ అని పేర్కొంటారు. డిస్‌ప్లేలో వీడియోలను మినిమైజ్‌ చేసుకోవటం లాంటి మల్టీ టాస్క్‌లను కూడా నిర్వహించొచ్చు. శామ్‌సంగ్‌ టీవీ పస్ల్‌ సర్వీస్‌ సైతం అందుబాటులో ఉంది. అమెరికాలో 190 ఛానల్స్‌, సౌత్‌ కొరియాలో 80 ఛానల్స్‌ ఉచితంగా వీక్షించొచ్చు.

‘వింటేజ్‌’కి మంచి ‘కాఫీ’ లాంటి వార్త

భాగ్య నగరంలోని వింటేజ్‌ కాఫీ అండ్‌ బేవరేజెస్‌ లిమిటెడ్‌ సంస్థకి 17 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆర్డర్‌ లభించింది. సౌత్‌ ఈస్ట్‌ ఏసియా దేశాల్లోని ఒక ఫేమస్‌ కాఫీ బ్రాండ్‌.. ఇన్‌స్టంట్‌ కాఫీ సప్లైకి సంబంధించి ఈ ఆర్డర్‌ ఇచ్చింది. వింటేజ్‌ కంపెనీ ఇప్పటికే రష్యా మరియు ఐరోపా మార్కెట్లకు కాఫీ ప్రొడక్టులను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఆర్డర్‌ వల్ల ఆగ్నేయ ఆసియా దేశాలకు సైతం విస్తరించే ఛాన్స్‌ కలుగుతోంది. ఈ విషయాలను సంస్థ అధిపతి టి.బాలకృష్ణ తెలిపారు.