Today (27-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజు భారీ నష్టాల్లో ముగిసింది. అమ్మకాల ఒత్తిళ్లు తీవ్రంగా పెరగటంతో మూడు నెలల కనిష్టానికి పతనమైంది. అదానీ గ్రూప్‌పై హిండర్‌బర్గ్ నుంచి వచ్చిన ఆరోపణలు మొత్తం మార్కెట్ సెంటిమెంట్‌నే దెబ్బతీశాయి. దీంతో రెండు కీలక సూచీలు బెంచ్ మార్క్‌లను కూడా దాటలేని స్థితిలో డౌన్‌లో క్లోజ్ అయ్యాయి.
ఇవాళ శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు.. అంటే.. సెకండ్ సెషన్‌లో నేల చూపులు చూసింది. సెన్సెక్స్ ఒకానొక దశలో వెయ్యీ 50 పాయింట్లకు పైగా పడిపోయింది. గ్లోబల్ మార్కెట్‌ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ రావటంతో ఏ దశలోనూ కోలుకునే పరిస్థితి లేకుండా పోయింది. సెన్సెక్స్ చివరికి 874 పాయింట్లు కోల్పోయి 59 వేల 330 పాయింట్ల వద్ద ముగిసింది.
read more: Global Economic Downturn: ఇండియా వాణిజ్యంపై ప్రభావం ప్రారంభం
నిఫ్టీ 287 పాయింట్లు నష్టపోయి 17604 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 7 కంపెనీలు మాత్రమే లాభాల బాటలో నడిచాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ బాగా రాణించాయి. ఆరు శాతం వరకు లాభాలను ఆర్జించాయి. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా దెబ్బతిన్నాయి.
వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ మరియు అదానీ పోర్ట్స్ తమ షేర్ల విలువను అత్యధికంగా కోల్పోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్స్ వ్యాల్యూ 18 శాతం, అదానీ పోర్ట్స్ షేర్ల విలువ 15 శాతం పడిపోయాయి.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ విలువ కూడా 10 నెలల కనిష్టానికి దిగజారింది. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 15 శాతం డౌన్ అయింది. 10 గ్రాముల బంగారం ధర 185 రూపాయలు తగ్గి గరిష్టంగా 56 వేల 775 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు స్వల్పంగా 41 రూపాయలు కోల్పోయింది. అత్యధికంగా 68 వేల 635 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 166 రూపాయలు పెరిగి బ్యారెల్ ముడి చమురు 6 వేల 699 రూపాయల వద్ద స్థిరపడింది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 56 పైసలుగా నమోదైంది.