TMC Rebellion: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను భూకంపం సంభవించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో ఊహించని రీతిలో భారీ చీలిక వచ్చింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతలు రితాబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలకు మద్దతుగా ఏకంగా 59 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ అసమ్మతి ఎమ్మెల్యేలందరి సంతకాలతో కూడిన లేఖను తీసుకుని రితాబ్రత బెనర్జీ స్వయంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వెళ్లి, అక్కడ స్పీకర్‌కు అందజేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మొత్తం 80 స్థానాల్లో విజయం సాధించింది. భారతదేశంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఏదైనా ఒక పార్టీ అధికారికంగా చీలిపోవాలి అంటే సదరు పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలలో కనీసం మూడింట రెండొంతుల (2/3) మంది సభ్యుల మద్దతు తప్పనిసరిగా ఉండాలి. టీఎంసీ గెలిచిన 80 సీట్ల లెక్క ప్రకారం చూసుకుంటే.. ఈ చట్టం నుంచి తప్పించుకోవడానికి కనీసం 54 మంది ఎమ్మెల్యేల బలం అవసరం అవుతుంది. ఇప్పుడు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసిన అసమ్మతి వర్గం వైపు ఏకంగా 59 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో.. చట్టబద్ధంగా వారికి ఎలాంటి ప్రమాదం లేదు. ఈ 59 మంది ఎమ్మెల్యేలు విడిగా ఒక గ్రూపుగా ఏర్పడినా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు పడదు, వారి అసెంబ్లీ సభ్యత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. అంతేకాదు, సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున ఈ తిరుగుబాటు వర్గం అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమదేనని, పార్టీ గుర్తు సైతం తమకే చెందుతుందని క్లెయిమ్ చేసుకునే పూర్తి అవకాశం లభించింది.
భారత రాజకీయాల్లో ఒక పార్టీపై పెత్తనం కోసం, దాని ఎన్నికల గుర్తు కోసం ఇలాంటి అంతర్గత యుద్ధాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఎన్నో వివాదాలు అసెంబ్లీ స్పీకర్లు, కేంద్ర ఎన్నికల సంఘం, ఆఖరికి సుప్రీంకోర్టు గుమ్మం వరకు వెళ్లాయి. ఈ తరహా పోరాటాల్లో కొన్ని తిరుగుబాటు వర్గాలు సఫలమై పార్టీని తమ వశం చేసుకోగా, మరికొన్ని వర్గాలు ఘోరంగా విఫలమయ్యాయి. అలాంటి కొన్ని కీలకమైన ఉదాహరణలను గమనిస్తే.. మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలిక ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాయకత్వ లోపాలు, కూటముల ఏర్పాటుపై వచ్చిన అంతర్గత విభేదాల కారణంగా 2022లో శివసేన రెండు ముక్కలైంది. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) లతో చేతులు కలిపి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సాంప్రదాయ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారంటూ ఏకనాథ్ షిండే నేతృత్వంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసింది. అత్యధిక మంది శివసేన ఎమ్మెల్యేలు షిండే వైపు నిలబడటంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేల బలాన్ని బేరీజు వేసుకున్న ఎన్నికల అధికారులు.. షిండే వర్గాన్నే అసలైన ‘శివసేన’గా గుర్తిస్తూ పార్టీ పేరును, సాంప్రదాయ ‘విల్లు-అంబు’ గుర్తును వారికే కేటాయించారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఒక ప్రత్యేక రాజకీయ సంస్థగా మిగిలిపోవాల్సి వచ్చింది.
ఇదే మహారాష్ట్రలో మరో ప్రముఖ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోనూ 2023లో ఇలాంటి సీనే రిపీట్ అయింది. సీనియర్ నాయకుడు అజిత్ పవార్ తన సొంత బాబాయ్, పార్టీ అధినేత అయిన శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చారు. అజిత్ పవార్ తనతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలను తీసుకువెళ్లి మహారాష్ట్రలోని ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరడంతో పార్టీ రెండు శత్రు వర్గాలుగా విడిపోయింది. రెండు వర్గాలూ తామే అసలైన ఎన్సీపీ అని వాదించడంతో ఈ వివాదం కాస్తా న్యాయపరమైన, రాజకీయ పోరాటంగా మారింది. చివరికి 2024లో భారత ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అధికారిక ఎన్సీపీగా గుర్తించి పార్టీ పేరు, గుర్తును వారికే అప్పగించింది. శరద్ పవార్ నేతృత్వంలోని గ్రూప్ వేరే పేరుతో విడిగా కొనసాగుతోంది. ఇక, తమిళనాడులోని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) పార్టీలోనూ 2016లో జయలలిత మరణం తర్వాత తీవ్రమైన నాయకత్వ సంక్షోభం తలెత్తింది. ఓ పన్నీర్‌సెల్వం (OPS), ఎడప్పాడి కె పళనిస్వామి (EPS) ల మధ్య పార్టీపై పట్టు కోసం ప్రధాన పోరు నడిచింది. మొదట్లో పార్టీ విడిపోకుండా ఉండేందుకు వీరిద్దరూ కలిసి ద్వంద్వ నాయకత్వ నమూనాలో పార్టీని నడిపించారు. కానీ రోజులు గడిచేకొద్దీ పార్టీ నియంత్రణ, భవిష్యత్తు వ్యూహాలపై ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో 2022లో జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ద్వంద్వ నాయకత్వ విధానాన్ని రద్దు చేస్తూ, ఈపీఎస్‌ను పార్టీ ఏకైక నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఓపీఎస్ కోర్టులో సవాలు చేయడంతో సుదీర్ఘ న్యాయపోరాటం నడిచింది. అయితే కోర్టు తీర్పులు, పార్టీలోని మెజారిటీ సభ్యుల మద్దతు ఈపీఎస్‌కే అనుకూలంగా రావడంతో ఆయన స్థానం మరింత బలోపేతమైంది. ఓపీఎస్, ఆయన మద్దతుదారులు పార్టీ నాయకత్వం నుంచి పూర్తిగా పక్కకు నెట్టబడ్డారు.
ఇక బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (LJP) లోనూ 2020లో ఆ పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణించిన తర్వాత 2021లో పెద్ద చీలిక వచ్చింది. పార్టీ పగ్గాల కోసం ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్, తమ్ముడు పశుపతి కుమార్ పారస్ మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఇద్దరూ తామే పార్టీ లీడర్లమని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో ఎన్నికల సంఘం పశుపతి పారస్ నేతృత్వంలోని వర్గాన్ని అధికారిక ఎల్‌జేపీగా గుర్తించింది, దాంతో చిరాగ్ పాశ్వాన్ ‘లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)’ అనే కొత్త గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ వివాదంలో ఎన్నికల సంఘం పార్టీ పాత గుర్తును స్తంభింపజేయడం (Freeze) వల్ల దీనిని స్పష్టమైన సంస్థాగత చీలికగా పరిగణించలేము. ఆ తర్వాత కాలంలో గుర్తింపు కోసం ఈ రెండు వర్గాలకు ఎన్నికల సంఘం వేర్వేరు కొత్త గుర్తులను కేటాయించింది. ఇప్పుడు బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ 59 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో, మమతా బెనర్జీ తన పార్టీని, గుర్తును కాపాడుకోగలరో లేదో చూడాలి.
