Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..

Tmc Faces

Tmc Faces

Prakash Chik Baraik: పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు తీవ్ర సంక్షోభానికి దారితీశాయి. పార్టీలో మొదలైన అసంతృప్తి కాస్తా ఇప్పుడు నేతల వలసల పర్వానికి కారణమైంది. తాజాగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బరాయిక్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నిజానికి తృణమూల్ కాంగ్రెస్‌కు రాజ్యసభలో ఇది వరుసగా తగిలిన మూడో పెద్ద షాక్. ప్రకాష్ చిక్ బరాయిక్ కంటే ముందే పార్టీలో అత్యంత కీలక నేతలుగా ఉన్న సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ సైతం తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు కరడుగట్టిన నేతలు పార్లమెంట్ ఎగువ సభకు గుడ్‌బై చెప్పడంతో రాజ్యసభలో టీఎంసీ బలం ఒక్కసారిగా పడిపోయింది. తాజా రాజీనామాతో ఎగువ సభలో మమతా బెనర్జీ పార్టీ ఎంపీల సంఖ్య కేవలం 10కి పరిమితమైంది.

అయితే, తృణమూల్ కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో రేగిన ఈ అసమ్మతి జ్వాలలు ఇంతటితో చల్లారేలా కనిపించడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే వారం రోజుల్లోనే టీఎంసీకి చెందిన మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు సైతం తమ పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే పార్లమెంట్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గ్రాఫ్ మరింత పాతాళానికి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ రాజీనామాలకు గల స్పష్టమైన కారణాలు బయటకు రాకపోయినప్పటికీ, విపక్షాలు మాత్రం దీనిని టీఎంసీ అంతర్గత కలహాలు, నాయకత్వంపై పెల్లుబుకుతున్న అసంతృప్తికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నాయి.

×
×
Ad