NTV Telugu Site icon

MLA Rakshana Nidhi: రెండు రోజుల్లో టీడీపీలో చేరడంపై క్లారిటీ..! వైసీపీ ఎమ్మెల్యే ప్రకటన

Rakshana Nidhi

Rakshana Nidhi

MLA Rakshana Nidhi: అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నాల్గో జాబితాలో తిరువూరు ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసును నియమించారు.. మీకు సీటు రాదంటూ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రక్షణ నిధికి ముందే సమాచారం ఉండగా.. దాంతో.. ఆయన టీడీపీతో టచ్‌లోకి వెళ్లారనే చర్చ సాగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగా ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రక్షణ నిధి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. 6 నెలలుగా నాకు సీటు రాకుండా కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎంపీ కేశినేని నాని.. వైసీపీలోకి వచ్చే ముందే తిరువూరు సీటు కండీషన్‌ పెట్టారని.. అందుకే నన్ను తప్పించడానికి రకరకాల సర్వేలు చేయించి చివరికి సీటు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..

ఇక, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు మంత్రి పదవి ఇస్తామని రాత్రి 12 గంటలకు చెప్పి.. పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు రక్షణ నిధి.. మంత్రి పదవి ఇవ్వక పోయినా.. పార్టీకి నిబద్ధతతో పని చేశాను అన్నారు. అయినా.. తనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందన్నారు. ఇక, పార్టీకి రాజీనామా చేసే అంశంపై క్యాడర్‌తో మాట్లాడి ప్రకటిస్తానని అన్నారు. మరోవైపు.. రెండు రోజుల్లో టీడీపీలో చేరే విషయంపై క్లారిటీ ఇస్తాను అని వెల్లడించారు తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి. కాగా, తిరువూరు నుంచి రెండు సార్లు విజయం సాధించినా.. తనకు టికెట్‌ నిరాకరించడంపై ఎమ్మెల్యే రక్షణ నిధి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. పార్టీలోనే ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి.. సీనియర్‌ నేతలను రక్షణనిధి వద్దకు పంపి.. బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించలేదు.. దీంతో, చివరకు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు.