Tirumala Brahmotsavam 2025: తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి ఆధ్యాత్మిక వైభవం కొనసాగుతోంది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవం ప్రారంభం కాగా.. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ రూపాల్లో అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు ఆనందపారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో పదకొండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులు అమ్మ సన్నిధికి పోటెత్తుతున్నారు. నిన్న గాయత్రి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆతల్లిని గాయత్రీ రూపంలో దర్శించుకున్న భక్తులు భక్తపారవశ్యంలోమునిగి తేలారు. ఇక ఇవాళ ఆ మహాశక్తి.. అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Read Also: Typhoon Ragasa: తైవాన్, చైనాలో తుఫాన్ విధ్వంసం.. 17 మంది మృతి
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందడి తిరుమలలో మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంతో వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది. ఈ వేడుకలో భాగంగా, శ్రీవారి సేనాధిపతిగా భావించే విష్వక్సేనుల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షించి, ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేలా చూస్తారన్నది ఆగమ సంప్రదాయం. ఈ ఊరేగింపు తర్వాత ఆలయంలోని యాగశాలలో వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూమాతకు పూజలు చేసి, పవిత్రమైన పుట్టమన్నులో నవధాన్యాలను నాటి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ ఈ ఘట్టాన్ని పూర్తి చేశారు.
మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరుమల గిరులకు తరలివచ్చారు. తిరుమాడ వీదుల్లో విహరిస్తున్న ఆ దేవదేవుణ్ని…వివిధ రూపాలు, అలంకరణల్లో దర్శించుకోనున్నారు భక్తజనం. ఇక, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భారత ఉపరాష్ట్రపతి, ఏపీ సీఎం కూడా నేడు తిరుమలకు రానున్నారు.. సాయంత్రం 6:20 గంటలకు తిరుమల చేరుకోనున్న సీఎం.. రాత్రి 7:40 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వస్తారు.. అక్కడి నుంచి 7:55 కి ఊరేగింపుగా బయల్దేరి శ్రీవారి ఆలయానికి చేరుకోని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు.. 8:20 కి శ్రీవారిని దర్శించుకుని.. 9 గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.. ఇక, రేపు ఉదయం 9 గంటలకు 105 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం, 24 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏఐ అనుసంధాన కమాండ్ కంట్రోల్ సెంటర్,3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటైన లడ్డు ప్రసాదాల ముడిసరుకుల నాణ్యత యంత్రాలను ప్రారంభించనున్నారు.. 10:45 కి తిరుమల పర్యటన ముగించుకుని బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు..
ఇక, ఇవాళ, రేపు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుమల పర్యటన ఉంది.. రాత్రి 8:30 గంటలకు తిరుమల చేరుకోనున్న ఉపరాష్ట్రపతి.. మహాద్వారం నుంచి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.. సీఎం చంద్రబాబుతో కలసి పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.. రేపు ఉదయం ఆలయ మర్యాదలతో శ్రీవారిని మరోసారి దర్శించుకుంటారు.. ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబుతో కలసి పలు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు..
