ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!

Tirumala Deputy Eo Lokanatham

Tirumala Deputy Eo Lokanatham

ACB Raids on Tirumala Deputy EO Lokanatham: తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. ఈ కేసులో భాగంగా తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మెండు లోకనాథం ప్రధాన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఉన్న ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేస్తోంది. అలాగే ఏర్పేడు మండలం చెల్లూరులోని లోకనాథం సోదరుడి నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లోకనాథం ఆస్తులు, ఆదాయ మార్గాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, ఇతర వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అదే సమయంలో తిరుమలలోని లోకనాథం కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయానికి సంబంధించిన రికార్డులు, అధికారిక పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఏసీబీ సోదాలు కొనసాగుతున్న సమయంలో డిప్యూటీ ఈవో మెండు లోకనాథం తిరుమల శ్రీవారి ఆలయంలో విధుల్లో ఉన్నారు. ఆయన కోసం తిరుమల క్వార్టర్స్ ముందు కూడా ఏసీబీ అధికారులు వేచి వున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. లోకనాథం ఆస్తుల వివరాలు, వాటి విలువ, ఆదాయ వనరులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాతే స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు లేదా ఇతర ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరానున్నాయి. 2011లో టీటీడీ డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 15 ఏళ్ల తర్వాత టీటీడీ ఉద్యోగి నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది.