Tilak Varma Creates T20 Record With 26 Unbeaten Chases: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అజేయ అర్ధసెంచరీతో సత్తా చాటిన టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, ఛేజింగ్‌లో తనకున్న విశిష్టమైన విలువను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్‌లో మరెవరికీ సాధ్యం కాని ఓ అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు పురుషుల టీ20 క్రికెట్‌లో ఛేజింగ్ చేస్తూ తిలక్ వర్మ 26 సార్లు అజేయంగా (నాటౌట్) నిలవగా, ఆ 26 మ్యాచ్‌ల్లోనూ అతని జట్టు విజయం సాధించడం విశేషం. ఇలా ఛేజింగ్‌లలో 100 శాతం విజయాల రికార్డును కలిగి ఉన్న ఏకైక ఆటగాడిగా తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు.
ఓవరాల్ జాబితాలో 31 నాటౌట్లతో జేమ్స్ విన్స్ అగ్రస్థానంలో ఉండగా, తిలక్ వర్మ రెండో స్థానంలో నిలిచాడు. తిలక్ తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు బ్రెండన్ మెక్‌కల్లమ్, మార్టిన్ గుప్టిల్ చెరో 22 ఇన్నింగ్స్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20ల విషయానికి వస్తే, తిలక్ వర్మ నాటౌట్‌గా నిలిచిన 12 ఛేజింగ్ మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం వరించడంతో అతడు క్రీజులో ఉంటే గెలుపు ఖాయమనే నమ్మకం ఏర్పడింది. అంతేకాకుండా, అంతర్జాతీయ టీ20లలో ఛేజింగ్ చేస్తూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్థశతకం సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా తిలక్ నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియాపై హోబర్ట్ వేదికగా వాషింగ్టన్ సుందర్ చేసిన 49 నాటౌట్ పరుగులే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. భారత జట్టు తరఫున ఛేజింగ్‌లో ఐదు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి 12 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలవడమే కాకుండా, ఏకంగా 4 అర్థశతకాలు నమోదు చేశాడు. టీమిండియా టాప్-4 మినహా మిగతా బ్యాటర్లందరూ కలిసి ఇప్పటివరకు నాలుగు అర్ధసెంచరీలు సాధిస్తే, తిలక్ వర్మ ఒక్కడే ఐదో స్థానం లేదా ఆ దిగువన వచ్చి నాలుగు హాఫ్ సెంచరీలు చేయడం అతని ఘనతకు అద్దం పడుతోంది. అంతర్జాతీయ టీ20 సక్సెస్‌ఫుల్ ఛేజింగ్స్‌లో తిలక్ వర్మ బ్యాటింగ్ సగటు 92.50గా ఉండగా, టీ20 ఛేజింగ్స్‌లో వరుసగా అత్యధిక సార్లు (11 ఇన్నింగ్స్‌లు) డబుల్ డిజిట్ స్కోర్లు చేసిన భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ తర్వాత తిలక్ వర్మ రెండో స్థానంలో నిలిచాడు.

