CM Devendra Fadnavis: “నిందితులను వదిలిపెట్టం”.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..

Devendra Fadnavis

Devendra Fadnavis

CM Devendra Fadnavis: బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిని తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ముంబైలో ఫుట్‌బాల్ ఆట ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో టైగర్ ష్రాఫ్ పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఒకరు నేరుగా టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరొకరు ఆయన డ్రైవర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌కు అద్దాలు గుచ్చుకుని గాయాలవగా, గన్ పౌడర్ కారణంగా ఆయన చేతికి కాలిన గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన టైగర్.. డ్రైవర్‌ను పక్కకు జరిపి, స్వయంగా కారు నడుపుకుంటూ ఆసుపత్రికి చేరుకున్నారు.

ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముంబై పోలీసుల పనితీరును వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనను ముంబై పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నారని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. విచారణలో భాగంగా కొన్ని కీలక ఆధారాలు లభించాయని, ఇప్పటికే కొందరిని గుర్తించామని స్పష్టం చేశారు. నేరస్థులు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని భరోసా ఇచ్చారు. బెదిరింపులను ప్రభుత్వం ఎప్పుడూ తేలికగా తీసుకోదని, ముంబై పోలీసులు అత్యంత నిపుణులైన బలగమని కొనియాడారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని అరెస్ట్ చేయడంలో ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ చరిత్ర చూపామని, ఈ కేసులోనూ అదే పునరావృతమవుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఈ దాడికి సంబంధించి భద్రతా అంశాలపై వస్తున్న చర్చలపైనా ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అనవసర చర్చలు అవసరం లేదని, ఘటన అత్యంత తీవ్రమైనదని పేర్కొన్నారు. భద్రత విషయానికి వస్తే.. గతంలో ఆయన రక్షణ కోరినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో లేరని, సరిగ్గా అదే సమయంలో ఈ దాడి జరిగిందని వివరించారు. ఇక, ఈ కుట్ర వెనుక తెరవెనుక ఉండి నడిపిస్తున్న సూత్రధారులను కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ ఉగ్ర లేదా అసాంఘిక మూకల ఆఫీసులు మహారాష్ట్రలో లేవని, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నవారిని ఇప్పటికే అరెస్ట్ చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ దాడులకు పాల్పడుతున్న వారు ఇతర రాష్ట్రాల నుంచి లేదా దేశం వెలుపల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలిపారు. ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ, విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న వారిని కేంద్ర ప్రభుత్వ సాయంతో పట్టుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దుండగులు కేవలం చాటుగా వచ్చి దాడి చేసే భయస్తులని ముఖ్యమంత్రి మండిపడ్డారు. వీరి భరతం పడతామని స్పష్టం చేశారు. నిందితులు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి పట్టుకునే సత్తా ముంబై పోలీసులకు ఉందని మరోసారి నిరూపిస్తామన్నారు.