Site icon NTV Telugu

MLAs Resign: హిమాచల్‌ప్రదేశ్‌లో కీలక పరిణామం.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

Resign

Resign

హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి జరిగింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో అనూహ్యంగా బీజేపీ రాజ్యసభ సీటును తన్నుకుపోయింది. ఈ ఘటన ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది.

తాజాగా మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. ముగ్గరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ ముగ్గురు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు.

ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆశిష్ శర్మ (హమీర్‌పూర్ నియోజవర్గం), హోషియార్ సింగ్ (డెహ్రా), కేఎల్ ఠాకూర్ (నాలాగఢ్) శుక్రవారం ఉదయం అసెంబ్లీలో విపక్ష నేత జైరామ్ ఠాకూర్‌ను కలుసుకున్నారు. అనంతరం తమ రాజీనామాను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. హోషియార్ సింగ్ ఈ విషయం మీడియాకు తెలియజేశారు. తమ రాజీనామాను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశామని, బీజేపీలో చేరనున్నామని చెప్పారు. బీజేపీ టిక్కెట్‌పై తాము పోటీ చేయనున్నట్టు తెలిపారు.

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో ప్రభుత్వం ఇరాకటంలో పడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 40, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అయితే కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 34 ఓట్లు వచ్చాయి. అనంతరం లక్కీ డ్రా తీయడంతో రాజ్యసభ సీటును బీజేపీకి గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఆరుగురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. ఇటీవల ఆ నియోజకవర్గాలకు ఈసీ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. తాజాగా మరో ముగ్గురు రాజీనామా చేశారు. వీరు కూడా బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. దీంతో ప్రభుత్వం మరింత సంక్షోభం దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Exit mobile version