NTV Telugu Site icon

Uttar Pradesh: మామిడికాయల కోసమని వెళ్లిన చిన్నారులపై తోటమాలి దారుణ చర్య..

Mango

Mango

ఉత్తరప్రదేశ్‌లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో ఓ తోటమాలి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. మామిడికాయలు కోయడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులపై బరితెగించాడు. తోటమాలి పిల్లలను తాడుతో చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మేలుకుని.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

ఈ ఘటన బుధవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం పూట వాకింగ్ కు వెళ్లిన ముగ్గురు పిల్లలు పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లారు. అక్కడ రాలిన కాయలను ఏరుకుంటుండగా.. పిల్లలు మామిడి కాయలను దొంగలిస్తున్నారనే ఉద్దేశ్యంతో తోటమాలి అక్కడకు వచ్చాడు. వచ్చి అంతటితో ఆగకుండా.. ముగ్గురు పిల్లలను పట్టుకుని చెట్టుకు తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత వారి నోట్లో మామిడికాయలు కుక్కి మరీ చితకబాదాడు.

IAS Vivek Yadav: ఏపీ సీఈవోగా సీనియర్ ఐఏఎస్‌ వివేక్ యాదవ్..

అయితే.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్నాడన్న సమాచారం గ్రామస్తులకు తెలిసి అక్కడ గుమిగూడారు. అక్కడే ఉన్న ఒకరు ఈ ఘటనను వీడియో తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న చిన్నారుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లలను తీసుకుని కలిసి ఇంటికి వెళ్లారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. తోటమాలి సహా ముగ్గురు వ్యక్తులు పిల్లలను కట్టేసి కొట్టారని ఆరోపిస్తూ ఓ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తోటమాలిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లి డిమాండ్ చేసింది.

ఈ క్రమంలో.. చౌక్ పోలీస్ స్టేషన్‌లో తోట తోటమాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను బంధించి చిత్రహింసలు పెట్టినందుకు మామిడి తోట యజమాని సుదర్శన్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ హెడ్ ప్రశాంత్ కుమార్ పాఠక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.