NTV Telugu Site icon

Bihar Crisis: ఈరోజు నితీష్ ప్లాన్ ఇదే..!

Bihar Crics

Bihar Crics

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చాపకింద నీరులా చకచక మార్పులు, చేర్పులు జరిగిపోతుంటాయి. ఇందుకు బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలే ఉదాహరణ. నిన్నటిదాకా నితీష్‌కుమార్ నాయకత్వంలో సాఫీగా సాగిపోతున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా మహాకూటమి అవాక్కైంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీతో దోస్తీ కట్టేందుకు నితీష్ రెడీ అయిపోయారు. ఈ అనూహ్య నిర్ణయంతో ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు నిశ్చేష్టులయ్యారు. లోక్‌సభ ఎన్నికల వేళ నితీష్ ప్లేట్ ఫిరాయించడంతో ఇండియా కూటమి కూడా ఝలక్‌కు గురైంది.

Read Also: Nitish Kumar: నేడు సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా..?

ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఈరోజే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మహాకూటమికి స్వస్తి పలికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను నితీష్‌కుమార్ సమర్పించనున్నారు. ఇప్పటికే జేడీయూ ఎమ్మెల్యేలంతా పట్నాకు చేరుకున్నారు. అంతేకాకుండా చాలా మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా నితీష్‌కు జైకొట్టినట్లు సమాచారం అందుతోంది. మొత్తం మీద కమలనాథులతో కలిసి నితీష్‌కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: OU Registrar: మరోసారి జరగదు.. విద్యార్థినుల రక్షణ మాదే.. ఓయూ రిజిస్టార్ క్లారిటీ

ఆదివారమే మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నితీష్ చర్యలపై మహాకూటమి సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. నితీష్‌కుమార్ విశ్వసనీయతను కోల్పోయారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీహార్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంతో ఇండియా కూటమికి బీటలు వారుతున్నాయి. వాస్తవానికి ఇండియా కూటమి ఏర్పాటుకు నితీష్ కీలక పాత్ర పోషించారు. కానీ కూటమి అధ్యక్షుడిగా తనను కాకుండా మల్లిఖార్జున ఖర్గేను ఎంచుకోవడంపై నితీష్ అలకబూనినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి.