Wedding Ceremony : వైభవంగా పెళ్లి జరుగుతోంది.. వచ్చిన అతిథులంతా హడావుడిగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. ఈ సమయాన్ని అదునుగా తీసుకున్న ఓ దొంగ తన చేతి వాటం ప్రదర్శించాడు. వధువు వద్ద ఉన్న నగదు, నగలు దోచుకెళ్లాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో సంచలనం సృష్టించింది. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ మేరకు నవీన్ కమతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివాహ వేడుకలో మొత్తం 5 లక్షల 50 వేల చోరీ సీసీటీవీలో రికార్డయింది.
Read Also: Ukraine War: వీకిపీడియాకు మాస్కో కోర్టు షాక్.. ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు జరిమానా
నాగ్‌పూర్‌లోని న్యూ కమతి పోలీస్ స్టేషన్ పరిధిలోని భిల్గావ్‌లో నివాసం ఉంటున్న వసంత్ ఖట్కర్ కుమార్తె వివాహం జరిగింది. వివాహ వేడుకకు వచ్చిన అతిథుల నుంచి వధువు అందుకున్న డబ్బు, నగలను తను కూర్చున్న పక్క సీటుపై ఉంచారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు అతిథులతో మాట్లాడే పనిలో నిమగ్నమై ఉండగా.. దొంగలు దాన్ని అవకాశంగా తీసుకున్నారు. ఎవరూ చూడకుండా డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు. కొంత సేపటి తర్వాత ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోధించి, వచ్చిన బహుమతుల గురించి ఆరా తీశారు. సామాగ్రి ఎక్కడా లేకపోవడంతో పెళ్లి వేడుకలో కలకలం రేగింది. లాన్‌లోని సీసీటీవీని పరిశీలించగా.. ఓ దొంగ సామాగ్రిని తీసుకెళ్తున్నట్లు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 5 లక్షల 50 వేల రూపాయల విలువైన వస్తువులను దొంగ ఎత్తుకెళ్లినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.