NTV Telugu Site icon

Bandi Sanjay : అర్ధంపర్ధంలేని అంశాలతో భారతీయ సంస్కృతిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు

Sanjay Bandi

Sanjay Bandi

భారతీయ సంస్క్రుతి గల గల పారే జీవనది లాంటిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భారతీయ సంస్క్రుతి, సాంప్రదాయాలపై దాడి చేస్తూ సమాజంలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సమాజాన్ని ఏకం చేస్తూ భారతీయ విలువలు పెంపొందిస్తూ ప్రజ్ఝాభారతి ఆధ్వర్యంలో ‘లోక్ మంథన్’ పేరుతో చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో ఈరోజు సాయంత్రం జరిగిన ‘లోక్ మంథన్ సన్నాహక సమావేశానికి’ బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. ప్రజ్ఝాభారతి వ్యవస్థాపకులు, పద్మశ్రీ టి.హనుమాన్ చౌదరి, సామవేదం షణ్ముగశర్మ, నందకుమార్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

నవంబర్ 21 నుండి 24 వరకు భాగ్యనగర్ లోని హైటెక్ సిటీ శిల్పకళావేధికలో జరగబోయే ‘లోక్ మంథన్’ ఇంటర్నేషనల్ సమావేశ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహక సమావేశానికి రావడం సంతోషంగా ఉంది. లోకంలో(ప్రపంచంలో) జరుగుతున్న అనేక అంశాలపైన, మార్పులుపైన చర్చించడంతోపాటు హిందూ సమాజ ప్రగతి, భారతీయ సనాతన విలువలను పెంపొందించేందుకు ‘లోక్ మంథన్’ వేదికగా కావడం గొప్ప విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే… లోక కళ్యాణం కోసమే ‘లోక్ మంథన్’…(సర్వేజన సుఖి:నోభవంతు)

అదే సమయంలో సమాజానికి మంచితోపాటు చెడు కలిగించే అంశాలు కూడా ఉంటాయి. వాటిపై లోతుగా చర్చిస్తూ భారతీయ సంస్క్రుతి, హిందూ సమాజ ప్రగతికి అవసరమైన మంచిపై అవగాహన కల్పించేందుకు ‘లోక్ మంథన్’ చేస్తున్న క్రుషి అభినందనీయం. అర్ధం పర్ధం లేని అంశాలు తెరపైకి తీసుకొచ్చి భారతీయ సంస్క్రుతి, సాంప్రదాయాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో లోక్ మంథన్ చేస్తున్న క్రుషి అభినందనీయం. భారతీయ సనాతన ధర్మం విషయంలో సమాజంలో చీలికలు తెస్తున్న సందర్భంలో మీలాంటి అనేక మంది మేధావులు, విద్యావేత్తలు లోక్ మంథన్ పేరుతో చేస్తున్న క్రుషి మరువలేనిది.

తరాలు మారుతున్నయ్… యుగ ధర్మాలు మారుతున్నయ్…. అందుకు అనుగుణంగానే భారతీయ సంస్క్రుతి, సంప్రదాయాల్లో, హిందూ సమాజంలో మార్పులు రావడం సహజం. ఎంత మంచి నీళ్లైనా సరే.. ఒకే చోట కదలకుండా నిశ్చలంగా ఉంటే ఆ నీరు ఖరాబవుతుంది. బాక్టీరియా చేరుతుంది. నాచు చేరుతుంది. మారుతున్న కాలానికి, ధర్మానికి అనుగుణంగా హిందూ సమాజ విలువల్లో కూడా మార్పు అనివార్యం. ఎందుకంటే హిందూ సమాజం ప్రవహించే జీవ నదిలాంటిది. ప్రవహించే జీవనదిలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. సమజంలో ఉన్న చెడును తీసేసి, మంచిని కొనసాగిస్తూ హిందూ సమాజ రక్షణకు, భారతీయ విలువలను పెంపొందించేందుకు ‘లోక్ మంథన్’ వేదికగా అనేక అంశాలపై చర్చేందుకు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సమావేశం నిర్వహించడం అభినందనీయం.

భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయతత్వాన్ని మరింత బలోపేతం చేయడం మనందరి లక్ష్యం. విద్యావేత్తలు, ఆలోచనాపరులు, తత్వవేత్తలు, పరిశోధకులు, కళాకారులు ఇలా అనుభవజ్ఝులైన మేధావి వర్గమంతా ఒకే వేదికపై వచ్చి తమ ఆలోచనలు పంచుకునేందుకు ‘లోక్‌మంథన్’ ఒక వేదిక కావడం గొప్ప విషయం. అందులో భాగంగా కుటుంబ విలువలు, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, భారతీయ జీవన విధానం, పౌరుల క్రమశిక్షణ వంటి వాటిపై ‘లోక్‌మంథన్’ ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ… చర్చలు, సమ్మేళనాలు, ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్స్ వంటి వాటిని నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది.

వలస పాలకులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు భారతీయ సమాజంలో విభజనలు తీసుకొచ్చి పాశ్చాత్య భావజాలాన్ని మన మనస్సులో రుద్దితే.. ఆ విదేశీ భావజాలాన్ని తొలగించి భారతీయులంతా ఒక్కటే అని చాటిచెప్పేందుకు ఏర్పడ్డ వేదిక లోక్ మంథన్. నేషన్ ఫస్ట్ అని చాటి చెప్పడమే కాకుండా ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టి భారతీయ సమాజంలోని విభజనలను రూపుమాపి… ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజ్ఝాభారతి చేస్తున్న క్రుషి లోమరువలేనిది. విభజనవాదాన్ని కొన్ని విద్యాసంస్థలు, మీడియా, సినిమా, రాజకీయ పార్టీలు చేసే ప్రచారాన్ని తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ….. భారతీయ సంస్క్రతి, సంప్రాదాయలను ఒకే వేదికపై ఆవిష్కరించేందుకు 3 దశాబ్దాలుగా ప్రజ్ఝాభారతి పాటుపడుతోంది.

భారతదేశం సనాతన ధర్మానికి కేంద్రమని… ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ఆచరించే వారికీ భారతదేశమే ఆధారం. జాతీయవాదంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, జాతీయవాదులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకునేందుకు ప్రజ్ఞా భారతి ఒక వేదికగా ఉంటూ వస్తోంది. జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ప్రజ్ఞా భారతి రౌండ్ టేబుల్ సమావేశాలు, గ్రూప్ డిస్కషన్లు, సెమినార్లు, వెబినార్లు, మేధోమథన సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండటం గొప్ప విషయం.

అందులో భాగంగా నవంబర్ 21 నుండి 24 వరకు భాగ్యనగర్ లోని హైటెక్ సిటీ శిల్పకళావేధికలో బుర్రకథ, జాతరలు, జానపదాలు వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ‘లోక్ మంథన్’ నిర్ణయించడం సంతోషంగా ఉంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ను ఈరోజు ఆవిష్కరించే కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ఎంతో మంది మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మార్గదర్శకత్వంలో లోక్ మంథన్ నిర్వహిస్తున్న కార్యక్రమం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని ఆయన అన్నారు.