గుడ్లను క్యాన్సర్ ప్రమాదంతో ముడిపెడుతున్న ఇటీవలి వాదనలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొట్టిపారేసింది. అటువంటి ప్రచారాలు తప్పుదారి పట్టించేవి, శాస్త్రీయంగా నిరాధారమైనవి, అనవసరంగా ఆందోళన కలిగించేవి అని పేర్కొంది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ దేశంలో లభించే గుడ్లు తినడానికి సురక్షితమైనవని, గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని ఆరోపించే నివేదికలకు శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది.
భారత్ లో విక్రయించే గుడ్లలో నైట్రోఫ్యూరాన్ మెటాబోలైట్స్ (AOZ) – క్యాన్సర్‌తో ముడిపడి ఉన్నాయని వచ్చిన మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్ట్‌లకు ప్రతిస్పందనగా ఈ వివరణ ఇచ్చింది. ఆహార భద్రత, ప్రమాణాలు (కలుషితాలు, విష పదార్థాలు, అవశేషాలు) నిబంధనలు, 2011 ప్రకారం కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తి అన్ని దశలలో నైట్రోఫ్యూరాన్ వాడకాన్ని ఖచ్చితంగా నిషేధించారని FSSAI అధికారులు చెప్పారు.
సాధారణ గుడ్డు వినియోగాన్ని క్యాన్సర్ ప్రమాదం పెరగడానికి కారణం అని ఏ జాతీయ లేదా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ కూడా తెలపలేదని రెగ్యులేటర్ పునరుద్ఘాటించింది. కొన్ని వివిధ ప్రయోగశాల ఫలితాల ఆధారంగా గుడ్లను సురక్షితం కాదని లేబుల్ చేయడం శాస్త్రీయంగా తప్పు అని పేర్కొంది. FSSAI వినియోగదారులను ధృవీకరించబడిన శాస్త్రీయ ఆధారాలు, అధికారిక సలహాలపై ఆధారపడాలని కోరింది. ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి అయిన గుడ్లు సమతుల్య ఆహారంలో సురక్షితమైన, పోషకమైన, విలువైన భాగంగా ఉంటాయని పునరుద్ఘాటించింది.
