NTV Telugu Site icon

JK Elections: జమ్మూ బీజేపీలో గందరగోళం.. తొలి జాబితాపై తీవ్ర అసంతృప్తి.. గంటల్లోనే సవరణ!

Jk Elections

Jk Elections

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం బీజేపీ విడుదల చేసింది. అయితే.. నాటకీయ పరిణామాల మధ్య ఈ జాబితాను ఉపసంహరించుకుంది. కొన్ని గంటల తర్వాత సవరించిన జాబితాను మళ్లి విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి దశ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌లో బీజేపీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. జమ్మూలో బీజేపీ సీనియర్‌ నేత ఒమీ ఖజురియా మద్దతుదారులు తమ నేతకు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆగ్రహించిన కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా కార్యాలయాన్ని చుట్టుముట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన క్యాబిన్‌కే పరిమితమై బయట సెక్యూరిటీ సిబ్బందిని మోహరించాల్సిన పరిస్థితి నెలకొంది.

READ MORE: Minister Narayana: త్వరలో ఏపీలో టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్‌!

రవీంద్ర రైనా కార్యాలయం వెలుపల నిరసన తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. బీజేపీకి కష్టపడి పనిచేసే వారు లేరా అని ప్రశ్నించారు. ఎవరి నమ్మకంతో కిష్త్వార్ సీటును వేరే వాళ్లకు కేటాయించారని మండిపడ్డారు. ఈ సీటును బీజేపీ కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ ఓమీ ఖజురియాకు మద్దతుగా నినాదాలు చేశారు. నిజానికి.. ఒమి ఖజురియా జమ్మూలో సీనియర్ బీజేపీ నాయకుడు కాబట్టి జమ్మూ నార్త్ స్థానం నుంచి తనకు సీటు వస్తుందని ఆశించారు. నేడు ఉదయం విడుదల చేసిన బీజేపీ జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో మద్దతుదారులు పార్టీ కార్యాలయానికి చేరుకుని రచ్చ సృష్టించారు. అయితే బీజేపీ తన తొలి జాబితాను ఉపసంహరించుకుని ఆ తర్వాత కొత్త జాబితాను విడుదల చేసింది.