నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఉందని..పెద్ద పులి ఉండటం మనకు గర్వకారణమని జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. పెద్ద పులిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నామన్నారు. సమీప గ్రామాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సురక్షితంగా ఉందని..మర్రిపాడు వద్ద కారుకు జరిగిన డ్యామేజ్ ప్రకారం పెద్దపులి కొట్టినట్లుగా అనిపించడం లేదన్నారు. కారుపై పులి దాడి చేసిందనేది అవాస్తవం అని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమగ్రంగా విచారణ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా రక్తపు మరకలు కూడా లేవని..ప్రమాదం జరిగిన ప్రాంతంలో పులికి సంబంధించిన పాద ముద్రలు కనిపించాయన్నారు. పులులు ఎప్పుడూ రాత్రి సమయంలో సంచరిస్తాయని తెలిపారు. పులికి ఏదైనా ప్రమాదం జరిగితే నొప్పికి తీవ్రంగా అరుస్తుందన్నారు. సమీప ప్రాంతంలో ఎక్కడా పులి అరుపులు వినిపించలేదని స్పష్టం చేశారు. డ్రోన్ తో సమీప ప్రాంతాల్లో తనిఖీ చేశామని చంద్రశేఖర్ పేర్కొన్నారు. పెద్ద పులి సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్ళ వద్దని కోరుతున్నామన్నారు. పెద్ద పులి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీ ప్రాంతంలో జంతువులకు నీటి సమస్య లేదని స్పష్టం చేశారు.
READ MORE: MP CM RAMESH: “రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవు”
సోమవారం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలోని నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారుపై పెద్దపులి దాడి చేసిందని..ప్రయాణికులు తెలిపారు. పులిని తప్పించే క్రమంలో కారు బోల్తా పడిందని.. వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యిందన్నారు. కారు ఢీకొనడంతో పులికి గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్తుండగా కదిరినాయుడుపల్లి అటవీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్పందించిన అటవీశాఖ అధికారి చంద్రశేఖర్ స్పందించారు. పులి దాడి చేయలేదని.. పులి సురక్షితంగానే ఉందని ఆయన పేర్కొ్న్నారు.