Theft in Eluru District: పెళ్లి వేడుక అంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి. దీంతో పాటు చీరలు, నగలు అంటూ పెద్ద హంగామా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ పెళ్ళికి ఎలా రెడీ అవ్వాలి. ఏ నగలు పెట్టుకోవాలని ఆలోచిస్తారు. అందమైన బుట్టబొమ్మల్లా రెడీ అవుతారు. అంతేకాదు.. హిందూ సంప్రదాయంలో పెళ్లిలో పెళ్ళికూతురికి ఇటు పుట్టింటి వారు, అటు అత్తింటివారు తమ శక్తి కొలదీ నగలు పెట్టడం ఆనవాయతీగా ఎప్పటినుంచో వస్తున్నదే. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇంట్లో పెళ్లి జరుగుతుంది అంటే.. నగలు, డబ్బులు తప్పనిసరిగా ఉంటాయి. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ దొంగ పెళ్లింట్లో దొంగతనం చేశాడు. సుమారు రూ.11 లక్షల సొత్తును కొల్లగొట్టాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Read Also: Instagram reel: పోలీస్ జీపుతో ఇన్‌స్టా రీల్ చేసి చిక్కుల్లో పడ్డాడు..
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలోని పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కూతురి వివాహo సందర్భంగా ఇంటికి తాళాలు వేసి కళ్యాణ మండపానికి వరదారావు కుటుంబం వెళ్లగా.. ఎవరూ లేనిది గమనించి దుండగుడు ఇంట్లోకి దూరాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగలగొట్టి రూ. సుమారు 11 లక్షలు చోరీ చేశాడు. పెళ్లి అనంతరం వరదారావు కుటుంబం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోని నగదు మాయమైంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.