NTV Telugu Site icon

Heat Index: ఇరాన్ లో దంచికొడుతున్న ఎండలు.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు

Heat Waves

Heat Waves

ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో వాతావరణ మార్పు మానవాళికి పెను ముప్పుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల, శిలాజ ఇంధనాల దహనం, అడవుల నిర్మూలన, పారిశ్రామికీకరణ, వ్యవసాయ విధానాలు వల్ల వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల చేరుతున్నాయి. తత్ఫలితంగా గత శతాబ్ద కాలంగా భూగోళం సగటు ఉష్ణోగ్రత పెరుగుతోంది. వాతావరణ మార్పులు ప్రపంచంపై ప్రతికూల ప్రభావానికి అద్ధం పట్టే మరో సంఘటన ఇది.

Read Also: Engineering Counselling 2023: జులై 24 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌.. ఫీజులు ఇలా!

అయితే, ఇరాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉష్ణ సూచికపై ఏకంగా 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు వాతావరణంలోని తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైనట్లు అమెరికాకు చెందిన వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. గాలిలో ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా వేడిని అంచనా వేస్తారు. పర్షియన్‌ గల్ఫ్‌లోని వెచ్చని జలాలపై ప్రవహించే తేమతో కూడిన గాలి.. లోతట్టు ప్రాంతాల్లోని వేడిని తాకడంతో ఇరాన్‌లో భయంకర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Read Also: Top Headlines@9AM: టాప్‌ న్యూస్

ఇలాంటి వేడి పరిస్థితులు మానవులపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. తగినంత నీరు తీసుకోకపోతే డీహైడ్రేషన్‌కు గురి కావాల్సి వస్తుందని అంతర్జాతీయ ఇమ్యునైజేషన్ కూటమి హెచ్చరించింది. రక్తం చిక్కబడి, గడ్డకట్టే స్థాయికి చేరడంతో గుండెపోటు, పక్షవాతం వంటివి వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలున్న వారికి, వృద్ధులకు ఈ వాతావరణం మరింత ప్రమాకరమని హెచ్చరిస్తున్నారు. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం జులై నెలలో 10 రోజులు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read Also: Delhi Flood: కాస్త శాంతించిన యమునా నది.. ప్రమాద స్థాయికంటే దిగువకు నీరు

పసిఫిక్‌ మహా సముద్రంలో ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలను ఇప్పటికే వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫ్లోరిడాలో అట్లాంటిక్‌ మహాసముద్ర జలాలు 32.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు చేరుకున్నాయి. చైనాలోని శాన్‌బో టౌన్‌షిప్‌లోనూ రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో తక్షణమే భూతాపాన్ని నియంత్రించే చర్యలు తీసుకోకపోతే అది మానవులకు నరకంగా మారే ఛాన్స్ ఉందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ వాతావరణ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.