Site icon NTV Telugu

CM Chandrababu: రెవెన్యూ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు..!

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

సీఎం చంద్రబాబు చేపట్టిన రెవెన్యూ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం రూ.15 కోట్లు తగలేశారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం.

Read Also: Khap Panchayat: స్వలింగ వివాహాలు, లివ్-ఇన్ రిలేషన్ నిషేధించాలి.. జంతువులు కూడా ఇలా చేయవు..

మరోవైపు.. రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతేకాకుండా.. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చేందుకు రూ.650 కోట్లు ఖర్చయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. కేంద్రం చెప్పిన రీ సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకున్నా.. తన బొమ్మల కోసం గ్రానైట్ రాళ్లు సిద్దం చేశారని అధికారులు వెల్లడించారు.

Read Also: Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలిక అంచనా వేసింది. జగన్ మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృధా అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చెయ్యవచ్చో చూడమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ఇచ్చారు.

Exit mobile version