నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమ్మీదకు బయల్దేరింది. మరికొన్ని గంటల్లో ఆమె భూమ్మీద ల్యాండ్ కాబోతుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా రానున్నారు. ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లిన పలువురు కూడా వారితో వస్తున్నారు. సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోకి చేరుకుంది. క్రూ-10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది.
భారత కాలమానం ప్రకారం మార్చి 19 (బుధవారం) తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్ క్రాఫ్ట్ ఫ్లోరిడా తీరంలో నీటిలో ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా (NASA) వెల్లడించింది. నాసా శాస్త్రవేత్తలు ఏడు స్ప్లాష్‌డౌన్ సైట్‌లను గుర్తించారు. వీటిలో మూడు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో, నాలుగు అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నాయి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా స్పేస్‌ఎక్స్ నిపుణులు ఏ ప్రదేశంలో ల్యాండ్ చేయాలనే నిర్ణయం తీసుకుంటారు. తుఫాన్, గాలి దిశ, ఉష్ణోగ్రత వంటి అంశాలను పరిశీలించిన తరువాత ల్యాండింగ్ ప్రదేశాన్ని ఖరారు చేస్తారు.
Read Also: Court Movie: అక్కడ కోర్ట్ సినిమా స్క్రీనింగ్ నిలిపివేత.. ఎందుకంటే?
NASA ప్రకారం.. భూమి వాతావరణంలోకి ప్రవేశించే ముందు స్పేస్‌ఎక్స్ అంతరిక్ష నౌక చివరి మార్గసవరణ చేయబడుతుంది. ఆ తరువాత, భూమికి చేరుకోవడానికి 46 నిమిషాలు పడుతుంది. ఈ ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన దశ ఇదే. అంతరిక్ష నౌక గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతూ అగ్ని బంతిలా మారుతుంది. ఇది వాతావరణ ఘర్షణ వల్ల అంతరం వేగం తగ్గుతుంది. భూమి వాతావరణంలోకి వచ్చిన తర్వాత.. స్పేస్‌ఎక్స్ నౌకలోని క్యాప్సూల్, ట్రంక్ మాడ్యూల్ వేరైపోతాయి. నలుగురు వ్యోమగాములు క్యాప్సూల్‌లోనే ఉంటారు. చివరి ఏడు నిమిషాల్లో క్యాప్సూల్ నియంత్రణ కష్టంగా మారవచ్చు. ఈ సమయంలో పారాచూట్‌లు తెరుచుకుంటాయి. తద్వారా స్పేస్‌ఎక్స్ వేగం గంటకు 600 కిలోమీటర్ల నుండి 24 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. చివరకు అంతరిక్ష నౌక నీటిలో పడతుంది.
62 ఏళ్ల బుచ్ విల్మోర్, 59 ఏళ్ల సునీతా విలియమ్స్ గత సంవత్సరం జూన్ 5న కేప్ కెనవెరల్ నుండి అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. వీరు కేవలం ఒక వారం మాత్రమే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సింది. కానీ బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో హీలియం లీక్ అవడంతో పాటు ప్రణాళికలో మార్పులు రావడంతో.. వారు తొమ్మిది నెలలపాటు అక్కడే ఉండిపోయారు. కాగా.. ఆదివారం నాడు కొత్త NASA వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఈ బృందంలో NASAకు చెందిన అన్నే మెక్‌లేన్, నికోల్ అయర్స్, జపాన్‌కు చెందిన టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. వీరు అంతరిక్ష కేంద్రంలో చేరిన వెంటనే.. విల్మోర్ & విలియమ్స్ హాచ్ తెరిచి వారిని ఆహ్వానించారు. కొత్త వ్యోమగాములను చూసి సునీతా విలియమ్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.