NTV Telugu Site icon

Maharashtra Next CM: బ్రాహ్మణ సీఎం కింద ఇద్దరు మరాఠా డిప్యూటీ సీఎంలు.. మహారాష్ట్ర అంగీకరిస్తుందా?

Maharashtra Next Cm

Maharashtra Next Cm

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 6 రోజులు గడుస్తున్నా.. సీఎం నిర్ణయం తూతూమంత్రంగా సాగుతోంది. షిండేను ఒప్పించేందుకు బీజేపీ పలు ప్రతిపాదనలు చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎక్‌నాథ్‌ షిండే మాత్రం అంగీకరించలేదు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం ముంబైలో జరగాల్సిన కూటమి సమావేశం కూడా వాయిదా పడింది. సమావేశానికి ముందు షిండే తన సొంత గ్రామానికి వెళ్లారు.

సీఎం పదవి కంకణం కట్టుకున్న షిండే..
తాజా నివేదికల ప్రకారం.. గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అని స్పష్టం చేసినట్లు సమచారం. డిప్యూటీ సీఎం పదవిపై బీజేపీ షిండేతో ఒకసారి చర్చించింది. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టడం వల్ల మహాయుతి ఐక్యత సందేశం పంపుతుందని బీజేపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫడ్నవీస్‌తో పాటు ఇతర అనుభవజ్ఞులైన నాయకుల గురించి ఆలోచించింది. పార్టీల్లో సీనియర్ పదవులను కలిగి ఉన్నప్పటికీ.. ఇతర బాధ్యతలను కూడా అప్పగిస్తున్నట్లు సమాచారం. అయితే.. షిండే మాత్రం ఇందులో వేటినీ ఏకీభవించలేదు. తనకు సీఎం పదవి కావాలని కంకణం కట్టుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది.

డిప్యూటీ సీఎం పదవిని షిండే ఎప్పటికీ అంగీకరించరు..
ఇదిలా ఉండగా.. తాజాగా శివసేన నేతలు కొత్త వాదన వినిపిస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కులపరంగా బ్రాహ్మణుడని శివసేన అంటోంది. ఇద్దరు మరాఠా నాయకులైన అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలను బ్రాహ్మణుడి క్రింద డిప్యూటీలుగా ఉంచడాన్ని మరాఠా ప్రజానికం ఒప్పుకోదని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. మరాఠా ఓటర్లు దీన్ని ఇష్టపడరని.. ఇప్పటికే రాష్ట్రంలో పలు కారణాల వల్ల బీజేపీపై మరాఠా ప్రజానికం కోపంగా ఉందని పేర్కొంది. మహాయుతి కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు నేతులు కుండ బద్దలు గొడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పదవిని షిండే ఎప్పటికీ అంగీకరించరని శివసేన నేత సంజయ్ శిర్సత్ స్పష్టం చేశారు.

షిండేను వదులుకునేందుకు సిద్ధంగా లేని బీజేపీ..
కాగా.. అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కానీ షిండేను కోల్పోవడానికి కమల దళం అనుకూలంగా లేదు. ఏక్‌నాథ్ షిండే బీజేపీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. ఎట్టిపరిస్థితుల్లోనూ షిండే ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యేలా చూడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏక్నాథ్ షిండే కూడా సీఎం పదవిని వదులుకునేందుకు భారీ బేరసారాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో షిండేకు పెద్ద మంత్రిత్వ శాఖను ఆఫర్ చేశారు. కానీ ఆయన దానిని కూడా తిరస్కరించారు. ఏక్నాథ్ షిండే ఎట్టిపరిస్థితుల్లోనూ మహారాష్ట్రను విడిచిపెట్టే పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా.. హోం మంత్రిత్వ శాఖ విషయంలో కూడా ఆయన మొండిగా ఉన్నారు. ఒకవేళ బీజేపీ అభ్యర్థి ఫైనల్ అయితే.. శివసేన మరో నాయకుడిని డిప్యూటీ సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. షిండే పదవిపై మాత్రం ఎలాంటి స్పష్టత రావడం లేదు.

మహారాష్ట్రలో మరాఠాల ప్రభావం అధికం..
రాష్ట్ర జనాభాలో మరాఠాలు ఏకంగా 31 శాతానికి పైగా ఉన్నారు. మరాఠా ఓటు బ్యాంకు కూడా ఎక్కువే. గత లోక్‌సభ ఎన్ని్కల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జరాంగే పాటిల్ ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో మహాయుతి కూటమికి చాలా నష్టం వాటిల్లింది. ఓబీసీ కోటా నుంచి మరాఠాలను మినహాయించడంపై కూడా అసహనం వ్యక్తమైంది. ఇప్పుడు మరాఠా ముఖ్యమంత్రి ఎక్‌నాథ్‌ షిండేను తప్పించి.. బ్రాహ్మణ కులానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎంను చేస్తే మాత్రం మహాయుతికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరి కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్ని్కలు జరగనున్నాయి. ఈ ఎన్ని్కల్లో మరాఠాలు మహాయుతి కూటమికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.