NTV Telugu Site icon

RythuBandhu: తెలంగాణ సర్కార్‌కు ఈసీ షాక్‌.. రైతు బంధు అనుమతి ఉపసంహరణ

Rythu Bandhu

Rythu Bandhu

Rythu Bandhu: తెలంగాణలో బీఆర్ఎస్‌ సర్కార్‌కు షాక్‌ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్‌.. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఉన్నట్టుండి రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుబంధు నిధులకు బ్రేక్ పడింది. అయితే దీనిపై ప్రభుత్వ ప్రతిపదనకు ఎన్నికల కమిషన్ నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. అయితే, నవంబర్ 28వ తేదీలోపు రైతులకు నిధులు జమ చేయాలని సూచించింది. ఎన్నికల కమిషన్ నిధుల విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులకు ఊరట లభించినట్టు అయ్యింది..

కానీ, రైతు బంధు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్‌.. ఇప్పుడు నిధులు విడుదల చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్.. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిన ఈసీ.. అయితే, 28వ తేదీ 70 లక్షల రైతుల ఖాతాల్లో సుమారు 7 వేల కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు వేసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు వెలువడిన ఈసీ తాజా ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది.

ఇక, ఎన్నికల కమిషన్‌ నుంచి రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో.. నిధుల పంపిణీకి సిద్ధం అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. నిన్న ఓ బహిరంగ సభలో రాష్ట్ర ఆర్థిశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. మీరు సోమవారం ఉదయం టీ తాగే సమయానికి టింగ్‌ టింగ్‌ టింగ్‌ అంటూ రైతుల ఫోన్లకు రైతు బంధు నిధులు జమ అయిన మెసేజ్‌లు వస్తాయని ప్రకటించారు.. అయితే, ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉంది.. గురుపౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.. కానీ, హరీష్‌రావు.. సోమవారమే డబ్బులు పడతాయని ప్రకటించారు.. మరోవైపు.. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ఈ నెల 30వ తేదీన జరగనుంది.. ఇప్పుడు రైతు బంధుకు అనుమతి ఇవ్వడం ఏంటి? అనే ఫిర్యాదులు కూడా ఎన్నికల కమిషన్‌కు వెళ్లియట.. దీంతోనే.. ఎన్నికల కమిషన్‌ అనుమతిని ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది.