కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 308కి చేరింది. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయినట్లు అంచనా. తప్పిపోయిన వారిని అన్వేషించేందుకు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. వయనాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్ వివరాలను తెలియజేస్తూ.. రెస్క్యూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతోందని కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు. ఆదివారం..1300 మందికి పైగా సైనికులు సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు. వాలంటీర్లు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు. శనివారం రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన వాలంటీర్లు చిక్కుకుపోయారని, దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. చురల్‌మల, ముండక్కైలో రాత్రి సమయంలో పోలీసులు గస్తీ నిర్వహించారని పేర్కొంది.
కొండచరియలు విరిగిపడిన ఈ రెండు ప్రాంతాల్లోనూ ఖాళీగా ఉన్న ఇళ్లలో చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసు అనుమతి లేకుండా, సహాయక చర్యల కోసం కూడా ఎవరూ ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించడం నిషేధించబడింది. అనుమతి లేకుండా ఎవరైనా ఇళ్లలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, శిథిలాల నుంచి ఇప్పటివరకు 215 మృతదేహాలు, 143 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు . వీటిలో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది పిల్లల శరీరాలు, అవయవాలు ఉన్నాయి.
READ MORE:Shiva Stotra Parayanam: అష్టైశ్వర్యాలు చేకూరాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి..
బాధితులకు చైనా ప్రధాని సంతాపం
వయనాడ్ కొండచరియలు విరిగిపడి మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ చైనా ప్రధాని లీ చియాంగ్ ప్రధాని నరేంద్ర మోడీకి సందేశం పంపారు. భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఆగస్టు 3న కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోడీకి సంతాప సందేశం పంపినట్లు ప్రధాని లీ చియాంగ్ తెలిపారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.